Healthy Relationship: అందరి కోసం మీ ఆనందాన్ని వదులుకుంటున్నారా? ఇకనైనా ఈ 5 విషయాలు గుర్తుంచుకోండి!

 కుటుంబ సభ్యులు, స్నేహితులు, జీవిత భాగస్వామి.. ఇలా మన జీవితంలో ఎంతోమంది ఉంటారు. అయితే కొన్నిసార్లు ఎదుటివారి కోసం మనకు ఇష్టం లేకపోయినా కొన్ని పనులు చేయాల్సి వస్తుంది. మన సమయాన్ని, ఇష్టాలను పక్కనపెట్టి ఇతరుల కోరికలకు ప్రాధాన్యత ఇస్తుంటాం. అలా కాదంటే ఎదుటివారు బాధపడతారేమో, మన గురించి తప్పుగా అనుకుంటారేమోనని ఆలోచిస్తుంటాం. ఈ క్రమంలో మనకు తెలియకుండానే మానసిక ఒత్తిడికి గురవుతుంటాం.

Healthy Relationship: అందరి కోసం మీ ఆనందాన్ని వదులుకుంటున్నారా? ఇకనైనా ఈ 5 విషయాలు గుర్తుంచుకోండి!
5 Ways To Set Healthy Boundaries Without Hurting Anyones Feelings

Updated on: Nov 29, 2026 | 8:09 PM

 

నిజానికి ఇతరులను గౌరవించడం ఎంత ముఖ్యమో.. మనల్ని మనం గౌరవించుకోవడం కూడా అంతే ముఖ్యం. ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని వ్యక్తిగత హద్దులు ఉండాలి. అవి బంధాలను దూరం చేయడానికి కాదు.. పరస్పర గౌరవం, నమ్మకం పెంచడానికి ఉపయోగపడతాయి. ఎదుటివారిని బాధపెట్టకుండా మన వ్యక్తిగత హద్దులను ఎలా నిర్ణయించుకోవాలి? సంబంధాలు మరింత బలంగా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? ఇప్పుడు తెలుసుకుందాం.

వ్యక్తిగత హద్దులు అంటే ఏమిటి?

వ్యక్తిగత హద్దులు అంటే మన సమయం, భావోద్వేగాలు, వ్యక్తిగత జీవితం, ఇష్టాలు, అభిప్రాయాలకు సంబంధించిన పరిమితులు. ఉదాహరణకు రాత్రి ఆలస్యంగా ఫోన్ కాల్స్ మాట్లాడకూడదనుకోవడం, వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోకపోవడం, మనకు ఇష్టం లేని పనులకు అంగీకరించకపోవడం వంటివి వ్యక్తిగత హద్దుల కిందకు వస్తాయి.

ఇలా హద్దులు పెట్టుకోవడం స్వార్థం కాదు. మన అవసరాలను గుర్తించుకోవడం, ఇతరుల అవసరాలను కూడా గౌరవించడం ఆరోగ్యకరమైన సంబంధాలకు పునాది.

1. ముందుగా మీ అవసరాలను గుర్తించండి

ఇతరులకు మీ హద్దుల గురించి చెప్పే ముందు మీకు ఏది ఇష్టం, ఏది ఇష్టం లేదో తెలుసుకోవాలి. ఏ విషయాలు మీకు అసౌకర్యం కలిగిస్తున్నాయి? ఏ పనుల వల్ల మానసిక ఒత్తిడికి గురవుతున్నారు? అనే విషయాలను ఆలోచించాలి.

ఉదాహరణకు రాత్రి 9 గంటల తర్వాత పని సంబంధిత ఫోన్ కాల్స్ మాట్లాడటం మీకు ఇష్టం లేకపోతే ఆ విషయాన్ని ఎదుటివారికి మర్యాదగా చెప్పాలి. అలాగే మీ వ్యక్తిగత సమయాన్ని ఇతరులు గౌరవించాలని కోరుకోవడంలో తప్పులేదు.

2. అవసరమైనప్పుడు ‘నో’ చెప్పడం నేర్చుకోండి

చాలామంది ఎదుటివారికి నచ్చజెప్పడం కోసం ప్రతి విషయానికీ అవును అంటుంటారు. స్నేహితులు ఏదైనా పని అడిగినా, బంధువులు ఏదైనా బాధ్యత అప్పగించినా తమకు ఇష్టం లేకపోయినా అంగీకరిస్తుంటారు. ఇలా చేయడం వల్ల కొంతకాలానికి మనసులో అసంతృప్తి పెరుగుతుంది.

అందుకే అవసరమైనప్పుడు మర్యాదగా నో చెప్పడం నేర్చుకోవాలి. ఉదాహరణకు ‘ఈసారి నాకు కుదరదు’, ‘ప్రస్తుతం నాకు సమయం లేదు’ అని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రతిసారీ పెద్ద పెద్ద కారణాలు చెప్పాల్సిన అవసరం లేదు.

3. వెంటనే నిర్ణయం తీసుకోకండి

ఎవరైనా ఏదైనా పని అడిగినప్పుడు వెంటనే అవును చెప్పే అలవాటును మార్చుకోవాలి. ముఖ్యంగా మనకు సమయం ఉందో లేదో తెలియకపోయినా ఒత్తిడికి గురై అంగీకరించకూడదు.

‘నా షెడ్యూల్ చూసి చెబుతాను’, ‘కొంత సమయం ఆలోచించాలి’ అని చెప్పవచ్చు. ఇలా చేయడం వల్ల మనకు ఆలోచించడానికి సమయం లభిస్తుంది. మన సమయానికి, సామర్థ్యానికి తగిన నిర్ణయం తీసుకోవచ్చు.

4. ఎదుటివారిని నిందించకుండా మీ భావాలను చెప్పండి

వ్యక్తిగత హద్దుల గురించి మాట్లాడేటప్పుడు ఎదుటివారిని నిందించడం వల్ల గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే వారి ప్రవర్తనపై ఆరోపణలు చేయకుండా మనకు ఎలా అనిపిస్తుందో వివరించాలి.

ఉదాహరణకు ‘నువ్వు ఎప్పుడూ నా గదిలోకి చెప్పకుండా వస్తావు’ అని కోపంగా చెప్పడానికి బదులుగా.. ‘నువ్వు రావడానికి ముందు ఒకసారి తలుపు తడితే నాకు సౌకర్యంగా ఉంటుంది’ అని చెప్పవచ్చు. ఇలా మాట్లాడటం వల్ల ఎదుటివారికి మన అభిప్రాయం అర్థమవుతుంది. అనవసరమైన అపార్థాలు తగ్గుతాయి.

5. నిర్ణయించుకున్న హద్దుల విషయంలో స్థిరంగా ఉండండి

వ్యక్తిగత హద్దులను నిర్ణయించుకోవడం ఎంత ముఖ్యమో వాటిని పాటించడం కూడా అంతే ముఖ్యం. ఒకసారి ఒక విషయానికి నో చెప్పి, మరోసారి అదే విషయానికి ఒత్తిడితో అవును అంటే ఎదుటివారికి మన నిర్ణయంపై స్పష్టత ఉండదు.

అందుకే మనం నిర్ణయించుకున్న పరిమితులను గౌరవించాలి. ఎవరైనా అనుకోకుండా వాటిని దాటితే కోపపడకుండా మరోసారి వివరించాలి. ఉదాహరణకు మీరు పని చేస్తున్నప్పుడు ఎవరైనా పదేపదే ఫోన్ చేస్తుంటే.. ‘ప్రస్తుతం పని చేస్తున్నాను, అరగంట తర్వాత మాట్లాడతాను’ అని ప్రశాంతంగా చెప్పవచ్చు.

హద్దులు పెట్టుకోవడం వల్ల బంధాలు దూరమవుతాయా?

చాలామందికి వ్యక్తిగత హద్దులు పెట్టుకుంటే ఎదుటివారు దూరమవుతారనే భయం ఉంటుంది. కానీ ఆరోగ్యకరమైన బంధాల్లో పరస్పర గౌరవానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. మన అవసరాలను ఎదుటివారికి స్పష్టంగా తెలియజేయడం వల్ల అపార్థాలు తగ్గుతాయి. ఒకరిపై మరొకరికి ఉండే అంచనాలు స్పష్టమవుతాయి.

అలాగే మన సమయం, వ్యక్తిగత జీవితం, భావోద్వేగాలకు విలువ ఇవ్వడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. అయితే మనం ఇతరుల నుంచి ఎలాంటి గౌరవాన్ని ఆశిస్తున్నామో.. అదే విధంగా వారి వ్యక్తిగత హద్దులను కూడా గౌరవించాలి. అప్పుడే సంబంధాల్లో సమతుల్యత ఉంటుంది.

గమనిక: వ్యక్తిగత హద్దులు పెట్టుకోవడం అంటే ఇతరులతో సంబంధాలను తెంచుకోవడం కాదు. పరస్పర గౌరవం, అవగాహనతో ఆరోగ్యకరమైన సంబంధాలను కొనసాగించడమే దీని ఉద్దేశం.

 

Loading...
Unable to load recommendations.
Follow Us