రైతుల నిరసనకు సంఘీభావంగా పంజాబ్ లో యువజన కాంగ్రెస్ కార్యకర్తల ధర్నా, పోలీసుల లాఠీఛార్జ్

ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావంగా పంజాబ్ లో యువజన కాంగ్రెస్ కార్యకర్తలు బుధవారం ధర్నా చేశారు.  వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేసి, వాటర్ క్యానన్లను  ఉపయోగించారు.  హర్యానాలో ..

రైతుల నిరసనకు సంఘీభావంగా పంజాబ్ లో యువజన కాంగ్రెస్ కార్యకర్తల ధర్నా, పోలీసుల లాఠీఛార్జ్

Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 02, 2020 | 3:46 PM

ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావంగా పంజాబ్ లో యువజన కాంగ్రెస్ కార్యకర్తలు బుధవారం ధర్నా చేశారు.  వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేసి, వాటర్ క్యానన్లను  ఉపయోగించారు.  హర్యానాలో   ఈ పార్టీ కార్యకర్తలు సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ నివాసాన్ని ముట్టడించారు. రైతులపై పోలీసుల బలప్రయోగానికి ఆయన  క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. తాము కూడా ఢిల్లీ వెళ్లి అక్కడ ఆందోళన చేస్తున్న అన్నదాతలతో కలిసి నిరసన ప్రదర్శనల్లో పాల్గొంటామని వారు ప్రకటించారు. కాగా సింఘు బోర్డర్ వద్ద సమావేశం నిర్వహించిన రైతులు తమ ఆందోళనను ఉధృతం చేయాలని నిర్ణయించారు. వీరి నిరసన కారణంగా నోయిడా-ఢిల్లీ సరిహద్దులను పోలీసులు మూసివేశారు.

అటు రేపు కేంద్రంతో మళ్ళీ తాము జరపబోయే చర్చల్లో ఎలాంటి విధానం అనుసరించాలన్న దానిపై బుధవారం అన్నదాతలు తమలో తాము చర్చించుకున్నారు.  ఈ రోజు కూడా వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర తోమర్, హోం శాఖ మంత్రి అమిత్ షా సమావేశమై తాజా పరిస్థితిపై చర్చించారు. ఇలా ఉండగా.. ప్రతిపక్షాలు తమ రాజకీయ ప్రయోజనాలకోసం రైతులను తప్పుదారి పట్టిస్తున్నాయని బీజేపీ ఎంపీ వీరేంద్ర సింగ్ సింగ్ మస్త్ ఆరోపించారు. రైతుల్లో కలిగిన అపోహలను తొలగించే బదులు విపక్షాలు వారిని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రేరేపిస్తున్నాయని ఆయన దుయ్యబట్టారు. నిజానికి రైతు చట్టాల వల్ల వారి ఆదాయం పెరుగుతుందని, ఈ విషయాన్ని వారికి అర్థమయ్యేలా చెప్పాలని ఆయన అన్నారు. వారి ఆటలు సాగబోవని హెచ్చరించారు.