క‌రోనా భృతిపై దిగివచ్చిన డొనాల్డ్‌ ట్రంప్… 900 బిలియ‌న్ డాల‌ర్ల ఉద్దీప‌న ప్యాకేజీకి ఆమోదం..

క‌రోనా భృతిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ ఎట్టకేల‌కు దిగొచ్చారు. కరోనాతో అతలాకుతలమైన అమెరికా ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు ఉద్దేశించిన ఉద్దీపన బిల్లుపై సంతకం చేశారు.

  • Balaraju Goud
  • Publish Date - 10:33 am, Mon, 28 December 20
క‌రోనా భృతిపై దిగివచ్చిన డొనాల్డ్‌ ట్రంప్...  900 బిలియ‌న్ డాల‌ర్ల ఉద్దీప‌న ప్యాకేజీకి ఆమోదం..

క‌రోనా భృతిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ ఎట్టకేల‌కు దిగొచ్చారు. కరోనాతో అతలాకుతలమైన అమెరికా ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు ఉద్దేశించిన ఉద్దీపన బిల్లుపై సంతకం చేశారు. 900 బిలియ‌న్ డాల‌ర్ల ఉద్దీప‌న ప్యాకేజీకి ట్రంప్ ఆమోద ముద్ర వేశారు. దీంతో క‌రోనా కార‌ణంగా కుదేలైన వ్యాపార, వాణిజ్య సంస్థల‌తో పాటు పౌరుల‌కు ప్రయోజ‌నం క‌ల‌గ‌నుంది. దీంతో భారీ సంక్షోభం నుంచి అమెరికా ప్రభుత్వం గట్టెక్కింది. నిన్నటి వరకు సంతకం చేసేది లేదంటూ మొండిగా వ్యవహరించడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమయింది. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్ అధికార పగ్గాలు చేపట్టే వరకు తీవ్ర ఆర్థిక కష్టాలు తప్పవని భావించారు. తాజాగా ట్రంప్‌ నిర్ణయంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

కరోనా సృష్టించిన ప్రళయానికి అగ్ర రాజ్యం అమెరికా భారీగా నష్టపోయింది. అన్ని రంగాలపై లాక్‌డౌన్ ప్రభావం పడింది. చతికిలాపడ్డ ఆర్థిక వ్యవస్థను ఆదుకునేందుకు 900 బిలియన్‌ డాలర్ల అంటే సుమారు 66.37 లక్షల కోట్లు ప్యాకేజీతో కూడిన బిల్లును ఉభయ సభలు గతంలోనే ఆమోదించాయి. కానీ, అనూహ్యంగా ట్రంప్‌ దాన్ని తిరస్కరిస్తూ వచ్చారు. చిన్న వ్యాపారులకు, పౌరులకు 600 డాలర్ల (రూ.44వేలు) ఆర్థిక సహాయం సరిపోదని, దాన్ని రెండు వేల డాలర్ల(రూ.1.47లక్షలు)కు పెంచాలంటూ అమలుకు సాధ్యంకాని సూచనలిస్తూ వచ్చారు. ఇక కొత్త ఉద్దీపన బిల్లుతో నిరుద్యోగ ప్రాయోజిత పథకాల కింద దాదాపు 95 లక్షల మంది అమెరికన్లకు లబ్ధి చేకూరనుంది. ఈ పథకం ద్వారా నిరుద్యోగులకు అందుతున్న తోడ్పాటు మరో 11 వారాలు కొనసాగనుందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ పథకాల గడువు వచ్చే శనివారంతో ముగియనుండగా.. తాజాగా ట్రంప్‌ తీసుకున్న నిర్ణయం అందరికీ ఊరట కల్పించింది.