భారత క్రికెట్‌ను బాగా పాపులర్‌ చేసిన 1983 వరల్డ్‌కప్‌ విక్టరీ

|

Jun 25, 2020 | 2:24 PM

1983లో కపిల్‌దేవ్‌ నేతృత్వంలోని భారత జట్టు ప్రపంచకప్‌ను గెల్చుకున్న మధుర జ్జాపకాలు. ! ఏ మాత్రం అంచనాలు లేకుండా టీమిండియా కప్‌ను గెల్చుకున్నదని కొందరంటారు కానీ.. ఎందుకంటే ప్రపంచకప్‌కు ముందే వెస్టిండీస్‌లో పర్యటించిన భారత జట్టు ఓ వన్డేలో విజయం సాధించింది... అంతెందుకు ప్రపంచకప్‌లో తొలి లీగ్‌ మ్యాచ్‌లో కూడా వెస్టిండీస్‌ను కంగు తినిపించింది.

భారత క్రికెట్‌ను బాగా పాపులర్‌ చేసిన 1983 వరల్డ్‌కప్‌ విక్టరీ
Follow us on

భారత్‌లో క్రికెట్‌కు పిచ్చ క్రేజ్‌! మరే ఆటకు అంత ఆదరణ లేదు.. క్రికెట్‌ మతంగా మారడానికి బీజం పడింది మాత్రం మొదటిసారి ప్రపంచకప్‌ గెల్చినప్పుడే ! ఆ తర్వాతే క్రికెట్‌ డ్రాయింగ్‌ రూమ్‌ నుంచి వంటగది వరకు పాకింది.. 1983లో కపిల్‌దేవ్‌ నేతృత్వంలోని భారత జట్టు ప్రపంచకప్‌ను గెల్చుకున్నప్పుడు చాలా మంది ఆశ్చర్యపోయారు.. నిజమా అన్న అనుమానాన్ని కూడా వ్యక్తం చేశారు.. వెస్టిండీస్‌లాంటి మెగా జట్టుపై విజయం సాధించడమంటే మాటలు కాదుగా! ఏ మాత్రం అంచనాలు లేకుండా టీమిండియా కప్‌ను గెల్చుకున్నదని కొందరంటారు కానీ.. అందులో నిజం పాలు తక్కువే! ఎందుకంటే ప్రపంచకప్‌కు ముందే వెస్టిండీస్‌లో పర్యటించిన భారత జట్టు ఓ వన్డేలో విజయం సాధించింది… అంతెందుకు ప్రపంచకప్‌లో తొలి లీగ్‌ మ్యాచ్‌లో కూడా వెస్టిండీస్‌ను కంగు తినిపించింది.. వెస్టిండీస్‌ జట్టుపై కూడా విజయం సాధించవచ్చని టీమిండియాకు అప్పుడే అర్థమయ్యింది.. లీగ్‌ దశలో వెస్టిండీస్‌పై ఓ మ్యాచ్‌లో, ఆస్ట్రేలియాపై ఓ మ్యాచ్‌లో విజయం సాధించిన టీమిండియాలో కొండంత ఆత్మవిశ్వాసం గూడుకట్టుకుంది.. ఇక జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో కపిల్‌దేవ్‌ చేసిన విధ్వంసం మాటల్లో చెప్పలేనిది… అలా సెమీస్‌లో అడుగుపెట్టిన టీమిండియా ఇంగ్లాండ్‌పై అలవోకగా విజయం సాధించి ఫైనల్‌ పోరుకు సిద్ధమయ్యింది.. సరిగ్గా 37 ఏళ్ల కిందట లార్స్డ్‌లో జరిగిన ఆ తుది సమరంలో వెస్టిండీస్‌ టాస్‌ గెల్చుకుని ఇండియాకు బ్యాటింగ్ అప్పగించింది.. అండీ రాబర్ట్స్‌, జోయెల్‌ గార్నర్‌, మైకేల్‌ హోల్డింగ్, మల్కం మార్షల్‌లు నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడి భారత్‌ను 183 పరుగులకే కట్టడి చేశారు.. శ్రీకాంత్‌ 38 పరుగులు, మొహిందర్‌ అమర్‌నాథ్‌ 26 పరుగులు, సందీప్‌పాటిల్‌ 27 పరుగులు చేశారు.. మిగిలినవారంతా చేతులెత్తేశారు.. 60 ఓవర్లలో ఆ మ్యాచ్‌లో ఇండియా 54.5 ఓవర్లలో 183 రన్స్‌ చేసి ఆలౌట్‌ అయ్యింది.. ఈ స్వల్ప టార్గెట్‌ను వెస్టిండీస్‌ సునాయాసంగా ఛేదిస్తుందని అందరూ అనుకున్నారు.. కానీ కపిల్‌దేవ్‌ సేన మాత్రం అలా అనుకోలేదు.. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు.. రాక రాక వచ్చిన సువర్ణ అవకాశాన్ని చేజార్చుకోకూడదన్న పట్టుదల పెరిగింది.. కపిల్‌దేవ్‌ ఇచ్చిన ఇన్‌స్పిరేషన్‌ టానిక్‌లా పని చేసింది. ఆరంభంలోనే బల్వీందర్‌సింగ్‌ సాంధూ ఓ అద్భుతమైన ఇన్‌స్వింగర్‌తో గార్డన్‌ గ్రీనిడ్జ్‌ను బోల్తా కొట్టించాడు.. అది మొదలు.. డెస్మండ్‌ హేన్స్‌ కూడా తక్కువ స్కోరుకే ఇంటిదారిపట్టాడు.. మధ్యలో మాస్టర్‌ బ్లాస్టర్‌ వివియన్‌ రిచర్డ్స్‌ టీమిండియా బౌలర్లను బెంబేలెత్తించాడు కానీ ఎక్కువ సేపు క్రీజ్‌లో నిల్చోలేకపోయాడు.. వీలైనంత త్వరగా మ్యాచ్‌ను ముగించాలనే రిచర్డ్స్‌ మొండితనమే వికెట్‌ పారేసుకునేలా చేసింది.. మదన్‌లాల్‌ వేసిన ఓ ఓవర్‌లో వరుసగా నాలుగు బౌండరీలు సాధించిన రిచర్డ్స్‌ అయిదో బంతిని కూడా బౌండరీకి తరలించాలనుకున్నాడు కానీ ఆ బంతి కాస్తా కపిల్‌దేవ్‌ చేతుల్లో పడింది.. చేతుల్లో పడిందంటే కపిల్‌దేవ్‌ ఎఫర్ట్‌ను తక్కువ చేసినట్టు అవుతుంది.. దాదాపు 16 మీటర్లు పరుగెత్తి అద్భుతంగా బంతిని ఒడిసిపట్టుకున్నాడు.. ఇదే టర్నింగ్ పాయింట్‌… విండీస్‌ ఓటమికి, ఇండియా విజయానికి అక్కడే అంకురం పడింది.. చివర్లో జెఫ్‌ డూజన్, మాల్కమ్‌ మార్షల్‌లు ఒకింత ప్రతిఘటించినా ఫలితం లేకుండాపోయింది. చివరికి 140 పరుగులకే విండీస్‌ ఆల్‌ అవుటయ్యింది. భారత్‌ విశ్వవిజేతగా నిలిచింది. 26 పరుగులు చేయడమే కాకుండా మూడు వికెట్లు తీసుకున్న మొహిందర్‌ అమర్‌నాథ్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు లభించింది.