ఐపీఎల్ స్పాన్సర్ బిడ్డింగ్ రేసులోకి మరో భారతీయ ప్రముఖ కంపెనీ వచ్చి చేరింది. నిన్నటి వరకు పతాంజలి, రిలయన్స్, పేర్లతోపాటు మరికొన్ని కంపెనీల పేర్లు ఇప్పుడు తెరమీదికి వచ్చాయి. స్పాన్సర్‌షిప్ హక్కులు చేజిక్కించుకునేందుకు టాటా గ్రూప్ ప్రయత్నిస్తున్నది.
2018 నుంచి 2022 వరకు ఐపీఎల్ స్పాన్సర్‌గా చైనా మొబైల్ ఫోన్ కంపెనీ వివో ఉన్నప్పటికీ.. సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో చైనా కంపెనీలను బహిష్కరించాలనే డిమాండ్ల మేరకు చైనా మొబైల్ కంపెనీ స్వచ్ఛందంగా తప్పుకున్న విషయం తెలిసిందే. అయితే వివో ఈ ఏడాదికి మాత్రమే స్పాన్సర్‌షిప్ నుంచి తప్పుకోవడంతో.. నాలుగున్నర నెలల కోసం ఐపీఎల్ కొత్త స్పాన్సర్‌ను వెతుక్కోవాల్సి వస్తోంది.
ఈ క్రమంలో బీసీసీఐ ఆసక్తిగలవారి నుంచి బిడ్‌లను ఆహ్వానించింది. బిడ్‌లను దాఖలు చేయాల్సిన చివరి తేదీ శుక్రవారంతో ముగియగా.. ఈ నెల 18న కొత్త స్పాన్సర్‌ను నిర్ణయించనున్నారు. ఇప్పటికే ఈ రేసులో పతంజలి, అడిడాస్, జియో కమ్యూనికేషన్స్, అన్అకాడమీ, డ్రీమ్ ఎలెవన్ ఉండగా.. ఇప్పుడు తాజాగా టాటా గ్రూప్ ఈ జాబితాలో చేరింది. ఈ విషయాన్ని టాటా గ్రూప్‌కు చెందిన ఓ అధికారి శుక్రవారం ధ్రువీకరించారు.