తిప్పేస్తారా.. చుట్టేస్తారా… ఈ రోజే తేలనుంది..!

|

Nov 06, 2020 | 4:59 PM

ఆఖరి లీగ్‌ మ్యాచ్‌ వరకు ఒకటే టెన్షన్.. టైటిల్‌ రేసులో ఉంటుందో లేదోనన్న పెద్ద డౌట్..  ఏమైతేనేం.. ముంబైని చితకబాదిన హైదరాబాద్.. పాయింట్ల పట్టికలోకి దూసుకొచ్చింది. ...

తిప్పేస్తారా.. చుట్టేస్తారా... ఈ రోజే తేలనుంది..!
Follow us on

SRH vs RCB Predicted Playing : ఆఖరి లీగ్‌ మ్యాచ్‌ వరకు ఒకటే టెన్షన్.. టైటిల్‌ రేసులో ఉంటుందో లేదోనన్న పెద్ద డౌట్..  ఏమైతేనేం.. ముంబైని చితకబాదిన హైదరాబాద్.. పాయింట్ల పట్టికలోకి దూసుకొచ్చింది.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది. వరుసగా ఐదోసారి ప్లేఆఫ్స్‌కు చేరిన మూడో జట్టుగా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. బెంగళూరుతో ఎలిమినేటర్‌ పోరుకు సై అంటే సై అంటోంది. గతంలోనూ ఇలాంటి పరిస్థితుల్నే ఎదుర్కొన్న వార్నర్‌ సేన.. 2016 మ్యాజిక్‌ను రిపీట్‌ చూస్తుందా అని ఫ్యాన్స్ తెగ ట్వీట్ చేస్తున్నారు. నెట్టింట్లో పోరు పెడుతున్నారు.

ఆశలు సన్నగిల్లిన సమయంలో స్ఫూర్తిదాయక విజయాలు సాధించి ప్లేఆఫ్స్‌ చేరుకున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఎలిమినేటర్‌ సమరంలో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుని ఢీ కొట్టేందుకు రెడీ అవుతోంది.

ఈ రోజు జరుగనున్న మ్యాచ్‌లోనూ ఫామ్‌ను కొనసాగించి ఫైనల్‌కు చేరువ కావాలని వార్నర్‌సేన తెగ పట్టుదలగా ఉంది. మరోవైపు టాప్‌ ప్లేస్‌కు పోటీలో ఉన్న సమయంలో వరుసగా నాలుగు ఓటములతో నాలుగో స్థానానికి పడిపోయిన కోహ్లీసేన పుంజుకోవాలని చూస్తున్నది.

మొత్తంగా బెంగళూరుపై హైదరాబాద్‌కు మంచి రికార్డే ఉంది. ఈ రెండు జట్లు ఇప్పటి వరకు 16 సార్లు తలపడగా 8-7తో వార్నర్‌సేనదే గెలుచుకుంది. ప్లేఆఫ్స్‌ పరంగా చూసుకున్నా 2016 ఫైనల్లో ఆ జట్టును వార్నర్‌ సేన చిత్తు చేయడం సానుకూల అంశం అని చెప్పవచ్చు. ఈ సీజన్లో రెండు మ్యాచుల్లో తలపడి చెరో విజయం సాధించాయి.

తొలి మ్యాచులో బెంగళూరు నిర్దేశించిన 164 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక వార్నర్‌ సేన 153కే కుప్పకూలింది. అయితే రెండో మ్యాచులో 5 వికెట్ల తేడాతో ప్రతీకారం తీర్చుకుంది. కోహ్లీసేన నిర్దేశించిన 121 పరుగుల లక్ష్యాన్ని 14.1 ఓవర్లకే ఛేదించింది. సీజన్లో ఫామ్‌ చూసుకుంటే మాత్రం చివరి 5 మ్యాచుల్లో హైదరాబాద్‌ 4 గెలిచింది. టాప్‌-3 జట్లైన ఢిల్లీ, ముంబై, బెంగళూరును వరుసగా ఓడించింది. బెంగళూరు మాత్రం చివరి 5 మ్యాచుల్లో వరుసగా 4 ఓడిపోయింది. ఆఖరి లీగ్‌ మ్యాచులో హైదరాబాద్‌ 17 ఓవర్ల కన్నా ముందే లక్ష్యాన్ని ఛేదించివుంటే కోహ్లీసేన ప్లేఆఫ్‌ ఆశలకు గండిపడేది. ఎలిమినేటర్‌ జరుగుతున్న అబుదాబిలో 3 మ్యాచులాడిన వార్నర్‌ సేన ఒక మ్యాచే గెలిచింది. మిగతా రెండూ కోల్‌కతాతో ఆడి ఓటమి పాలైంది. అందులో ఒకటి సూపర్‌ ఓవర్‌కు దారితీసింది. ఇక బెంగళూరు 4 ఆడి 2 గెలిచింది.