PCB Shocking Decision: గత కొంతకాలంగా పాకిస్థాన్ వన్డే కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌కు గడ్డుకాలం నడుస్తోందని చెప్పాలి. ఇప్పటికే పీసీబీ అతన్ని టెస్టు, టీ20ల కెప్టెన్సీ పదవుల నుంచి తప్పించింది. ఇక వన్డే జట్టులో కొనసాగుతున్న అతడు భారంగా మారాడన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఓపెనర్ అజహర్ అలీ టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా.. టీ20లకు స్టార్ ప్లేయర్ బాబర్ ఆజమ్ సారధ్య బాధ్యతలు చేపడుతున్నాడు.
ఇదిలా ఉండగా పాకిస్థాన్ ఏప్రిల్‌లో బంగ్లాదేశ్‌తో ఏకైక వన్డే ఆడనుంది. ఆ మ్యాచ్‌కు సర్ఫరాజ్‌ను తొలగించి కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేయాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు భావిస్తోందట. అంతేకాక జట్టులో కూడా అతడ్ని తీసుకోవడానికి సుముఖంగా లేరని తెలుస్తోంది. టీ20 ఫార్మాట్‌కు సారధిగా వ్యవహరిస్తున్న బాబర్ ఆజామ్‌నే వన్డేలకు కూడా కెప్టెన్‌గా ఎన్నుకోవాలని పీసీబీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
ఇక సర్ఫరాజ్‌ను తప్పించాలని వార్తలు సోషల్ మీడియాలో ప్రచారం కావడంతో ఆ దేశ మాజీ ప్లేయర్లు దీనిపై స్పందించారు. గతేడాది వరుసగా ఆరు వన్డేల్లో విజయాలు అందించిన సర్ఫరాజ్‌ను ఎలా తొలగిస్తారని.. బోర్డు తీసుకున్నది సరైన నిర్ణయం కాదని వారు మండిపడుతున్నారు. అతడి నేతృత్వంలోనే 2017లో పాకిస్థాన్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడమే కాకుండా టీ20ల్లో జట్టు అగ్రస్థానానికి చేరుకుందని గుర్తు చేశారు.