India Vs Australia 2020: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అంటేనే రన్ మెషిన్. ఫార్మాట్ ఏదైనా కూడా దూకుడైన ఆటతీరుతో పరుగుల వరదను పారిస్తూ అవలీలగా సెంచరీలు కొట్టి పారేస్తాడు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌లో 70 శతకాలను తన ఖాతాలో వేసుకున్న కోహ్లీకి.. ఈ ఏడాది అసలు అచ్చిరాలేదని చెప్పాలి.
2020లో 9 వన్డేలు, 10 టీ20లు, మూడు టెస్టులు ఆడిన కోహ్లీ.. ఒక్క సెంచరీ కూడా నమోదు చేయకపోవడం గమనార్హం. 12 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి. 2008 నుంచి 2019 వరకు కోహ్లీ ప్రతీ ఏడాది ఒక సెంచరీ చేస్తూ వచ్చాడు. కానీ ఈ ఏడాది మాత్రం ఆ ఫీట్‌ను సాధించలేకపోయాడు. ఈ ఏడాది కోహ్లీ చేసిన అత్యధిక వ్యక్తిగత స్కోర్ 89. ఇక ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో కోహ్లీ మొదటి ఇన్నింగ్స్‌లో 74, రెండో ఇన్నింగ్స్‌లో 4 పరుగులు చేశాడు.
కాగా, ఇక ఈ ఏడాది కోహ్లీ టెస్టులు ఆడే అవకాశం లేదు. తన భార్య అనుష్క శర్మ వచ్చే నెలలో బిడ్డకు జన్మనిచ్చే అవకాశం ఉండటంతో అతడు భారత్‌కు పయనం కానున్నాడు. దీనితో టీమిండియా మిగిలిన టెస్టులను కోహ్లీ లేకుండానే ఆడనుంది. అయితే చివరి రెండు టెస్టులకు హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ అందుబాటులో ఉండే అవకాశం ఉండటం కాస్త ఊరటను ఇచ్చే అంశం.