మరో కరోనా లక్షణం.. బాధితుల్లో హెయిర్ లాస్..!

|

Aug 18, 2020 | 2:09 AM

కోవిడ్ సోకినవారిలో కొత్త లక్షణాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈ మహమ్మారి బాధితుల్లో చాలామందికి హెయిర్ లాస్ సమస్య ఎదురైందని తాజాగా అధ్యయనం పేర్కొంది.

మరో కరోనా లక్షణం.. బాధితుల్లో హెయిర్ లాస్..!
Follow us on

New Symptom Hair Loss: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ లక్షణాల గురించి మరో షాకింగ్ న్యూస్‌ వెలుగులోకి వచ్చింది. కోవిడ్ సోకినవారిలో కొత్త లక్షణాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈ మహమ్మారి బాధితుల్లో చాలామందికి హెయిర్ లాస్ సమస్య ఎదురైందని తాజాగా అధ్యయనం పేర్కొంది. కరోనా బాధితుల్లో జుట్టు రాలడం దీర్ఘకాలిక సమస్యగా మారినట్లు పరిశోధనల్లో తేలింది.

ఇండియానా యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్, కోవిడ్ 19 సర్వైవర్ గ్రూప్ కలిసి ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనంలో జుట్టు రాలడాన్ని కరోనా వైరస్ దీర్ఘకాలిక లక్షణంగా గుర్తించారు. ఫేస్‌బుక్‌ పోల్ ద్వారా 1,500 మందికి పైగా రోగులను సర్వే చేసి డాక్టర్లు.. 98 లక్షణాలను కనుగొన్నారు. ఇక వాటిల్లో జుట్టు రాలడం కూడా ఓ లక్షణంగా తేలింది.

ఈ విషయంపై రీసెర్చ్ ప్రొఫెసర్ డాక్టర్ నటాలీ లాంబెర్ట్ మాట్లాడుతూ.. ” తీవ్రమైన నరాల నొప్పి, ఏకాగ్రతను కోల్పోవడం, నిద్రపోవడంలో ఇబ్బంది, దృష్టి మసకబారడం, జుట్టు రాలడం వంటి కొత్త లక్షణాలను మేము చేసిన తాజా అధ్యయనంలో గుర్తించాం” అని అన్నారు. అంతేకాకుండా సర్వే పోల్‌లో పాల్గొన్నవారిలో దాదాపు మూడో వంతు మంది జుట్టు రాలడాన్ని వైరస్ లక్షణం అని తేల్చి చెప్పారు. 

సైన్స్ వరల్డ్‌కు ఇంకా తెలియని ఎన్నో కొత్త లక్షణాలు ఒక్కొక్కటిగా బయటపడుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. హాలీవుడ్ నటి అలైస్స మిలానో తాను కరోనా బారిన పడటం వల్ల జుట్టు ఊడిపోయిందని వివరిస్తూ సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను షేర్ చేసింది. ఇక అటు కరోనా రాకపోయినా జుట్టు ఊడిపోయే ఛాన్స్ ఉంది. తీవ్రమైన ఒత్తిడి, ఆహారపు అలవాట్లలో మార్పులు, హార్మోన్లలో హెచ్చుతగ్గుల వల్ల జుట్టు రాలడం జరుగుతుంది. కాగా, కరోనా పేషంట్లలో ఎక్కువగా జలుబు, జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు, వాసనలు పసిగట్టలేకపోవడం, రుచి చూడలేకపోవడం, వికారం లేదా వాంతులు, డయేరియా, ముక్కు కారడం వంటి లక్షణాలు కనిపిస్తాయన్న సంగతి తెలిసిందే.