కాంగ్రెస్‌ పార్టీని కాపాడేదెవరు?

కాంగ్రెస్‌ పార్టీకి భవిష్యత్తు ఉండాలంటే, ఇప్పుడున్న నాయకత్వాన్ని వెంటనే మార్చాలంటున్నారు సీనియర్లు. పార్టీకి ఫుల్‌ టైమ్‌ అధ్యక్షులు ఉండాలని, దూర దృష్టి, క్రియాశీలకంగా వ్యవహరించే శక్తి ఉన్నారికి పార్టీ పగ్గాలు అప్పగించాలంటున్నారు.

  • Balaraju Goud
  • Publish Date - 1:25 pm, Sun, 23 August 20
కాంగ్రెస్‌ పార్టీని కాపాడేదెవరు?

కష్టాల్లో ఉన్న కాంగ్రెస్‌ను గట్టెక్కించేదెవరు? పార్టీకి పునరుజ్జీవం పోసి, ప్రజల్లో విశ్వాసాన్ని పెంచేది ఎవరు? మళ్లీ గాంధీ కుటుంబమే కాంగ్రెస్‌కు నాయకత్వం వహిస్తుందా? లేక ప్రియాంక చెప్పినట్టు గాంధీకుటుంబేతర వ్యక్తులు పార్టీని ముందుకు నడిపిస్తారా? ఇలాంటి ప్రశ్నలే సోమవారం జరిగే CWC సమావేశాన్ని చుట్టుముట్టాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాహుల్‌ గాంధీ, మళ్లీ ఆ కుర్చీ కావాలని ఆశించడం లేదని కుండ బద్దలు కొట్టేశారు. అప్పటి నుంచి తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీనే బాధ్యతలు చేపట్టారు. కానీ! అధికార బీజేని ఎదుర్కోవడంలో, నిలదీయడంతో మునపటి వేగం కాంగ్రెస్‌లో కరువైంది. ప్రభుత్వాన్ని నిలదీయడానికి, ఇరుకున పెట్టడానికి అనేక అవకాశాలున్నా.. నాయకత్వ లేమితో గొంతెత్తలేని స్థితికి చేరింది. ఈ నేపథ్యంలోనే పార్టీకి కొత్త నాయకత్వం కావాలంటూ 23 మంది సీనియర్లు అధినేత్రి సోనియాగాంధీ లేఖ రాశారు. CWC సమావేశానికి ముందే వెలుగులోకి వచ్చిన ఈ లేఖ ఇప్పుడు దేశ వ్యాప్తంగా అతి పెద్ద చర్చకు దారి తీసింది.

కాంగ్రెస్‌ సీనియర్ల లేఖ నేపథ్యంలో సోమవారం ఉదయం 11 గంటలకు కాంగ్రెస్‌ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరగున్న ఈ సమావేశంలో కాంగ్రెస్‌ వర్కింగ్ కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. పార్టీని బలోపేతం చేయాలంటే సంస్థాగత మార్పులు తప్పవన్న సీనియర్ల సూచనల నేపథ్యంలో కొత్త అధ్యక్షుడి నియామకం, పార్టీ సమూల ప్రక్షాళన వంటి అంశాలపై కీలకంగా చర్చిస్తారని తెలుస్తోంది. ఏది ఏమైనా చుక్కాని లేని నావలా తయారైన కాంగ్రెస్‌ పార్టీకి రేపటి వర్కింగ్ కమిటీ సమావేశం సరికొత్త మార్గాన్ని నిర్ధేశిస్తుందని పార్టీ వర్గాలు బావిస్తున్నాయి.

కాంగ్రెస్‌ పార్టీకి భవిష్యత్తు ఉండాలంటే, ఇప్పుడున్న నాయకత్వాన్ని వెంటనే మార్చాలంటున్నారు సీనియర్లు. సోనియాగాందీకి రాసిన లేఖలో ఇదే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. పార్టీకి ఫుల్‌ టైమ్‌ అధ్యక్షులు ఉండాలని, దూర దృష్టి, క్రియాశీలకంగా వ్యవహరించే శక్తి ఉన్నారికి పార్టీ పగ్గాలు అప్పగించాలని చాలా క్లియర్‌గా లేఖలో తెలిపారు. అంతేకాదు, CWCకి ఎన్నికలు నిర్వహించి సమిష్టిగా పార్టీకి మార్గనిర్దేశం చేయగల సమర్థవంతమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. ఇప్పటికే పార్టీపై యువతకు విశ్వాసం సన్నగిల్లిందని, కాంగ్రెస్‌ శ్రేణుల్లో నిరుత్సాహం నెలకొని, పార్టీ బలహీనపడిందని లేఖలో రాశారు. కాంగ్రెస్‌ పార్టీ విశ్వాసం కోల్పోవడం వల్లే గత ఎన్నికల్లో యువత మొత్తం మోదీకి ఓటేసిందని, ఈవిషయాన్ని గుర్తించాలని కూడా సోనియాగాంధీకి రాసిన లేఖలో తెలిపారు.

సోమవారం జరుగుబోయే సీడబ్ల్యూసీ సమావేశానికి ముందు పార్టీలోని సమస్యలన్నింటినీ ఏకరువు పెడుతూ 23 మంది సీనియర్లు సోనియాగాంధీకి లేఖ రాయడం రాజకీయంగా అతి పెద్ద చర్చకు దారితీసింది. ఈ లేఖపై సంతకం చేసినా వారిలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేతా గులాంనబీ ఆజాద్‌, మాజీ కేంద్ర మంత్రులు ఆనంద్‌శర్మ, కపిల్‌ సిబల్‌, మనీష్‌ తివారి, శశిథరూర్‌, ఏఐసీసీ ఆఫీస్‌ బేరర్లు, రాజ్యసభ సభ్యులు కూడా ఉన్నారు. పార్టీని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసి, కార్యకర్తల్లో విశ్వాసం, నమ్మకం కగించే వ్యక్తులకు కాంగ్రెస్‌ పార్టీ బాధ్యతలు అప్పగించాలని చాలా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేశారు. సోమవారం తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ నేతృత్వంలో కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం నేపథ్యంలో ఈ లేఖ కీలకంగా మారింది. ప్రభుత్వ విధానాలు, కరోనా సంక్షోభం, దేశ ఆర్థిక పరిస్థితులు, చైనాతో వివాదాలు వంటి అంశాలు CWC అజెండాలో ఉన్నా.. చర్చ మాత్రం పూర్తిగా పార్టీ అధ్యక్షల ఎన్నికపైనే ఉంటుందని తెలుస్తోంది.

ఇదిలావుంటే, పార్టీ అధ్యక్ష బాధ్యతలు రాహుల్‌ గాంధీకే కట్టబెట్టాలని కాంగ్రెస్‌ శ్రేణులు కోరుతున్నాయి. పార్టీని నడిపించే శక్తి సామర్థ్యాలు రాహుల్ గాంధీకి ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇప్పుడు అధినేత్రి సోనియాకు లేఖ రాసిన 23 మంది సీనియర్లు మాత్రం అందులో రాహుల్‌ గాంధీ గురించి ఒక్క ముక్క కూడా చెప్పలేదని సమాచారం. రెండోసారి పార్టీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత గతేడాడి ఆగస్టు 9న రాహుల్‌ గాంధీ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఇప్పటి వరకు సోనియగాంధీ పార్టీ బాధ్యతలు స్వీకరిస్తున్నారు. రాహుల్‌ రాజీనామా తర్వాత మహారాష్ట్ర, హరియాణ, జార్ఖండ్‌, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగడం, ఆ తర్వాత కోరోనా సంక్షోభం ఏర్పడటంతో కాంగ్రెస్‌ పార్టీకి పూర్తిస్థాయి అధ్యక్షుల ఎన్నిక వాయిదా పడుతూనే వస్తోంది. ఇప్పుడు పార్టీ సీనియర్ల లేఖతో సోమవారం కొత్త అధ్యక్షుల ఎన్నికతోపాటు, పార్టీలో సంస్థాగ మార్పులపైనా కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ చర్చించే అవకాశం ఉంది.

పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని కాంగ్రెస్‌ వర్గాలు కోరుతున్నా.. రాహుల్‌ గాంధీకి ఇష్టం లేనట్టు తెలుస్తోంది. తను అధ్యక్ష బాధ్యతల్లో కొనసాగాలంటే స్వతహాగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండాలని చెప్పుకొస్తున్నారు రాహుల్‌ గాంధీ. ఇటు రాహుల్‌ గాంధీని కాదని ప్రియాంకకు పార్టీ పగ్గాలు అప్పజెప్పాలనే ఆలోచన సోనియాగాంధీకి లేదని తెలుస్తోంది. ఎందుకుంటే రాహుల్‌ గాంధీనే పార్టీ భవిష్యత్‌ నాయకుడిగా ఎదగాలని ఆమె భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం జరిగే కాంగ్రెస్‌ వర్కింగ్ కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారుతోంది.

ఇటు, ప్రియాంకా గాంధీ ఏడాది క్రితం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో ట్రోల్‌ అవుతున్నాయి. కాంగ్రెస్‌ పార్టీకి గాంధీకుటుంబేతర వ్యక్తులు అధ్యక్షులుగా వస్తారన్న ఆమె మాటలు కాంగ్రెస్‌ పార్టీని ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి. రాహుల్‌ గాంధీనే మళ్లీ పార్టీకి అధ్యక్షుడిని చేయాలని పార్టీ డిమాండ్‌ చేస్తున్నతరుణంలో ప్రియాంక వ్యాఖ్యలపై చర్చ మొదలైంది. నిజంగానే గాంధీ కుటుంబాన్ని కాదని కాంగ్రెస్‌ అధ్యక్ష బాధ్యతలు ఇతరులకు అప్పగిస్తారా? ఆ అవకాశం ఉందా? అనే చర్చ కూడా నడుస్తోంది. అయితే కాంగ్రెస్‌ శ్రేణులు మాత్రం ప్రియాంక వ్యాఖ్యలను సోషల్మీడియాలో తిప్పడం వెనుకు బీజేపీ కుట్ర ఉందని విమర్శలు చేస్తున్నాయి.

గాంధీ కుటుంబం లేకుపోతే కాంగ్రెస్‌ పార్టీ లేదనే చర్చ మొదటి నుంచీ ఉంది. కానీ.. గాంధీ కుటుంబం నుంచి వచ్చిన రాహుల్‌ గాంధీతోకూడా గత ఎన్నికల్లో ఎవరూ కలిసి నడవలేదు. ఈనేపథ్యంలో పార్టీని కాపాడే శక్తి ఒక్క సోనియాగాంధీకి మాత్రమే ఉందని కొందరు నేతలు చెప్పుకొస్తున్నారు. అయితే ప్రస్తుతం సోనియా ఆరోగ్య పరిస్థితులు సరిగా లేనందున ఆమె పార్టీని నడిపించే అవకాశం కనిపించడం లేదు. సోనియా కాకుంటే గాంధీ కుటుంబంలో రాహుల్‌, ప్రియాంకలకే ఎక్కువ అవకాశాలున్నాయి. కానీ! ప్రియాంకకు పార్టీ పగ్గాలు ఇవ్వడం సోనియాకు ఇష్టం లేని పరిస్థితుల్లో రాహుల్‌ను ఒప్పిస్తారా? మళ్లీ బలవంగంగా అధ్యక్ష పీఠంపై కూర్చోబెడతారా? అన్నది ఆసక్తికరంగా మారింది.