ఇది నిజంగానే క్రికెట్ ఫ్యాన్స్‌కు బిగ్ న్యూస్ అని చెప్పాలి. తనదైన శైలితో కూడిన షాట్స్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో మిస్టర్ 360గా పేరుగాంచిన ఏబీ డివిలియర్స్ త్వరలోనే రీ-ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. జాతీయ జట్టుకు సారధ్య బాధ్యతలు నిర్వర్తించేటప్పుడు.. అనుకోని విధంగా వర్క్ లోడ్ ఎక్కువైందని.. తన కుటుంబానికి తగిన వ్యవధి ఇవ్వలేకపోవడం వల్లే రిటైర్మెంట్ ప్రకటిస్తున్నానని డివిలియర్స్ చెప్పిన సంగతి తెలిసిందే.
సఫారీ గడ్డపై ఆస్ట్రేలియాతో గతేడాది జరిగిన టెస్ట్ సిరీస్ డివిలియర్స్‌కు చివరిది. ఇక అతడి తర్వాత హషిమ్ ఆమ్లా కూడా జట్టు నుంచి వైదొలగడంతో దక్షిణాఫ్రికా క్రికెట్ కొద్దిరోజులుగా గడ్డు పరిస్థితులు ఎదుర్కుంటోంది. వన్డే వరల్డ్‌కప్‌లో ఖంగుతిన్న ఈ జట్టును మళ్ళీ ఫామ్‌లోకి తేవడానికి ఆ దేశ బోర్డు సరికొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
ప్రస్తుతం సఫారీల క్రికెట్ బోర్డుకు మాజీ క్రికెటర్ గ్రేమ్ స్మిత్ 2023 వరకు డైరెక్టర్‌గా వ్యవహరించనున్నాడు. అటు కొత్త కోచ్‌గా మాజీ వికెట్ కీపర్ మార్క్ బౌచర్ నియమితుడయ్యాడు. ఇక తాజాగా ఆయన దగ్గర ఏబీ డివిలియర్స్ ప్రస్తావన రాగా.. రిటైర్మెంట్ విషయాన్ని మరోసారి పరిశీలించాలని ఏబీని కోరతానని బౌచర్ చెప్పడం విశేషం. వచ్చే ఏడాది టీ20 వరల్డ్‌కప్‌కు జట్టులో అత్యుత్తమ క్రికెటర్లను ఉంచడమే తన లక్ష్యమని.. తప్పకుండా డివిలియర్స్‌ను రప్పిస్తానని స్పష్టం చేశాడు. దీని బట్టి చూస్తే.. మిస్టర్ 360 అంతర్జాతీయ క్రికెట్ రీ-ఎంట్రీ త్వరలోనే తధ్యమన్నట్లు కనిపిస్తోంది.