
స్వర్గం అంటే కేవలం పురాణాల్లోని ఊహా ప్రపంచమేనా? లేక విశ్వంలో మనకు తెలియని ఒక భౌతిక ప్రదేశమా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం ఇస్తున్నారు మాజీ హార్వర్డ్ ఫిజిక్స్ లెక్చరర్, ప్రముఖ సైన్స్ కమ్యూనికేటర్ మైఖేల్ గిల్లెన్. మనం స్వర్గం అని పిలిచే ఆ పవిత్ర ప్రదేశం ఈ విశ్వంలోనే ఒక నిర్ణీత దూరంలో ఉండవచ్చని ఆయన తాజాగా ప్రచురించిన ఒక పరిశోధనాత్మక వ్యాసంలో తెలిపారు. మైఖేల్ గిల్లెన్ సిద్ధాంతం ప్రకారం.. స్వర్గం అనేది కాస్మిక్ హోరిజోన్‌కు అవతలి వైపున ఉంది.
ఖగోళ శాస్త్రవేత్త ఎడ్విన్ హబుల్ సిద్ధాంతం ప్రకారం.. గెలాక్సీలు ఒకదానికొకటి కాంతి వేగంతో దూరంగా జరుగుతున్నాయి. భూమి నుండి సుమారు 439 బిలియన్ ట్రిలియన్ కిలోమీటర్ల దూరంలో ఒక సరిహద్దు ఉంది. దీనినే కాస్మిక్ హోరిజోన్ అంటారు. దీనిని దాటి మనం ఎప్పటికీ చూడలేము, అక్కడికి చేరుకోలేము. కాంతి కూడా అక్కడి నుండి మనల్ని చేరుకోవడానికి సమయం సరిపోదు. అందుకే ఆ అవతల ఏముందో మనకు తెలియదు. అక్కడే స్వర్గం ఉండే అవకాశం ఉందని గిల్లెన్ వాదిస్తున్నారు.
అపరిమిత విశ్వం: మనం చూడగలిగే విశ్వం కంటే అవతల ఇంకా చాలా ఉంది. మనం చూడలేనంత మాత్రాన అక్కడ ఏమీ లేదని అర్థం కాదు.
కాలం ఆగిపోయే చోటు: ఐన్‌స్టీన్ సాపేక్షత సిద్ధాంతం ప్రకారం.. కాస్మిక్ హోరిజోన్ వద్ద కాలం ఆగిపోతుంది. అక్కడ గతం, వర్తమానం, భవిష్యత్తు ఉండవు. స్వర్గం కూడా కాలాతీతమైనది కాబట్టి ఇది సరిపోలుతుందని ఆయన భావన.
బిగ్ బ్యాంగ్ కంటే ముందే: కాస్మిక్ హోరిజోన్ వద్ద విశ్వంలోని అత్యంత పురాతన వస్తువులు ఉన్నాయి. అంటే దీనికి అవతల ఉన్నది బిగ్ బ్యాంగ్ కంటే ముందే ఉండి ఉండవచ్చు.
సృష్టి రహస్యం: బిగ్ బ్యాంగ్‌ను కేవలం ఒక పేలుడుగా కాకుండా ఒక సృష్టి కథగా చూసే శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు.
అయితే గిల్లెన్ సిద్ధాంతాన్ని ఇతర శాస్త్రవేత్తలు తోసిపుచ్చుతున్నారు. కనెక్టికట్ కళాశాల ప్రొఫెసర్ అలెక్స్ జియానినాస్ ప్రకారం.. కాస్మిక్ హోరిజోన్ అనేది ఒక భౌతిక ప్రదేశం కాదు.. అది కేవలం మన దృష్టికి ఉన్న ఒక పరిమితి మాత్రమే. ఇది విజ్ఞాన శాస్త్రం కంటే మెటా ఫిజిక్స్ కిందకు వస్తుందని మెజారిటీ సైంటిస్టుల అభిప్రాయం. కాగా స్వర్గం అనేది విశ్వంలో ఒక మూలన ఉందా లేక మన నమ్మకాల్లో ఉందా అనేది పక్కన పెడితే.. ఆధునిక భౌతిక శాస్త్రం, ఆధ్యాత్మికత మధ్య జరుగుతున్న ఈ చర్చ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.