పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చిందా.. వెంటనే ఇలా చేయండి.. చట్టం ఏం చెప్తుందంటే?

కొత్త నంబర్ నుంచి ఫోన్.. అవతలి వైపు నుంచి నేను ఫలానా పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నా, వెంటనే స్టేషన్‌కు రా అనే మాట. సాధారణంగా ఇలాంటి ఫోన్ కాల్ రాగానే ఎంతటి వారైనా ఒక్కసారిగా కంగారుపడటం, భయంతో వణికిపోవడం సహజం. అయితే నిజంగానే పోలీసులు ఫోన్ చేసి రమ్మంటే వెంటనే వెళ్లాలా? చట్టం దీనిపై ఏం చెప్తుంది? అనేది తెలుసుకుందాం..

పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చిందా.. వెంటనే ఇలా చేయండి.. చట్టం ఏం చెప్తుందంటే?
What To Do If Police Call You To The Station

Updated on: Aug 07, 2026 | 1:12 PM

సాధారణ పౌరులకు పోలీసుల నుంచి ఫోన్ కాల్ రాగానే ఒకరకమైన భయం, ఆందోళన కలగడం సహజం. ‘‘పోలీస్ స్టేషన్‌కు వెంటనే రావాలి’’ అని అవతలి నుంచి వినబడగానే చాలామంది కంగారుపడి, తమకున్న చట్టపరమైన హక్కులేంటో తెలియక ఇబ్బందులు పడుతుంటారు. పోలీసులు ఎప్పుడు ఫోన్ చేయవచ్చు? నోటీస్ లేకుండా స్టేషన్‌కు పిలవవచ్చా? ఇలాంటి సందర్భాల్లో సామాన్య పౌరుడికి ఉన్న హక్కులు ఏంటి? అనే అంశాలపై చట్టపరమైన నిబంధనలు ఏం చెబుతున్నాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం. చట్టం ప్రకారం.. కేవలం ఒక ఫోన్ కాల్ ఆధారంగా ఏ వ్యక్తి కూడా వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిన చట్టపరమైన నిబంధన లేదు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లేదా నూతన భారతీయ నాగరిక్ సురక్ష సంహిత ప్రకారం.. పోలీసులు ఒక వ్యక్తిని విచారణకు లేదా వివరాల సేకరణ కోసం పిలవాలనుకుంటే అధికారికంగా రాతపూర్వక నోటీసు ఇవ్వడం తప్పనిసరి. ఫోన్ కాల్ ద్వారా పిలవడం అనేది కేవలం ప్రాథమిక సమాచారం లేదా సున్నితమైన విషయాల కోసం చేసే ఒక విజ్ఞప్తి మాత్రమే తప్ప, అది చట్టబద్ధమైన ఆదేశం కాదు.

మిమ్మల్ని ఏ ప్రాతిపదికన పిలుస్తున్నారు?

ఫోన్ కాల్ వచ్చినప్పుడు కంగారుపడకుండా మిమ్మల్ని ఏ హోదాలో పిలుస్తున్నారో స్పష్టంగా అడిగి తెలుసుకోవాలి.

సాక్షిగానా ? : ఒకవేళ మిమ్మల్ని ఏదైనా కేసులో సాక్షిగా విచారించాలనుకుంటే, రాతపూర్వక నోటీసు ఇవ్వాల్సిందే.

నిందితుడిగానా ? : ఏదైనా ఫిర్యాదు లేదా కేసులో నిందితుడిగా పిలుస్తుంటే, నోటీసులో ఆ కేసు సంఖ్య, నమోదు చేసిన పోలీస్ స్టేషన్ వివరాలు ఉండాలి.

మహిళలు, పిల్లలు – వయోవృద్ధులకు ప్రత్యేక రక్షణలు

చట్టం మహిళలకు, చిన్నపిల్లలకు ప్రత్యేక హక్కులను కల్పించింది

మహిళలు: మహిళలను విచారించాల్సి వస్తే, వారిని పోలీస్ స్టేషన్‌కు పిలవడానికి వీల్లేదు. మహిళా పోలీసుల సమక్షంలో నిందితురాలు లేదా సాక్షి నివాసం ఉండే చోటనే విచారణ జరపాలి.

15 ఏళ్లలోపు పిల్లలు – 65 ఏళ్లు దాటిన వారు: 15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను, 65 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లను విచారణ పేరుతో పోలీస్ స్టేషన్‌కు రమ్మని బలవంతం చేయకూడదు. వారి ఇంటి వద్దే విచారించాలి.

పోలీసుల నుంచి ఫోన్ వస్తే మీరు చేయాల్సిన పనులు..

శాంతంగా మాట్లాడండి: భయపడకుండా మాట్లాడండి. ఫోన్ చేసిన అధికారి పేరు, హోదా , ఏ పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నారో అడిగి తెలుసుకోండి.

విషయం అడగండి: ఏ వ్యవహారంలో లేదా ఏ కేసు విషయమై ఫోన్ చేశారో స్పష్టత తీసుకోండి.

రాతపూర్వక నోటీసు కోరండి: ‘‘నేను చట్టాన్ని గౌరవిస్తాను, విచారణకు సహకరిస్తాను. దయచేసి నాకు చట్టప్రకారం అధికారిక రాతపూర్వక నోటీసు పంపించండి’’ అని మర్యాదగా చెప్పవచ్చు.

లాయర్ లేదా స్నేహితుడిని సంప్రదించండి: అవసరమైతే చట్టపరమైన సలహా కోసం న్యాయవాదిని సంప్రదించడం లేదా స్టేషన్‌కు వెళ్లాల్సి వస్తే కుటుంబ సభ్యులు, న్యాయవాదితో కలిసి
వెళ్లడం సురక్షితం.

బాధ్యతాయుత పౌరుడిగా సహకరించాలి

పోలీసులు చట్టబద్ధమైన విచారణలో భాగంలో రాతపూర్వక నోటీసు ఇచ్చినప్పుడు, పౌరుడిగా విచారణకు సహకరించడం మన బాధ్యత. అయితే చట్టం పౌరులకు కల్పించిన హక్కులపై అవగాహన ఉండటం వల్ల అనవసరమైన భయాందోళనల నుంచి, ఇబ్బందుల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు.

Loading...
Unable to load recommendations.
Follow Us