పబ్లిక్‌లో ముద్దు.. ఇండియాలో నిజంగా నేరమా ? రూల్స్ ఏంటంటే ??

సాధారణంగా ప్రేమను ఒక్కొక్కరు ఒక్కోలా వ్యక్తపరుస్తుంటారు. పబ్లిక్ ప్లేసులలో ముద్దులు పెట్టుకుంటూ, రొమాన్స్ చేస్తున్న జంటల వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. బహిరంగ ప్రదేశాల్లో ముద్దులు పెట్టుకోవడం మన దేశంలో నేరమా? పోలీసులు కేసు పెట్టవచ్చా? మరి ఈ అంశాలపై భారత చట్టాలు ఏం చెబుతున్నాయో తెలుసా..

పబ్లిక్‌లో ముద్దు.. ఇండియాలో నిజంగా నేరమా ? రూల్స్ ఏంటంటే ??

Updated on: Nov 25, 2026 | 2:48 PM

సాధారణంగా ప్రేమను ఒక్కొక్కరు ఒక్కోలా వ్యక్తపరుస్తుంటారు. కొందరు మాటలతో తమ ప్రేమను చెబితే.. మరికొందరు కౌగిలింతలు, ముద్దులతో ప్రేమను తెలియజేస్తారు. అయితే ఏ విషయాన్ని ఎంత వరకు కొనసాగించాలి అనే విషయంపై మాత్రం ఒక పరిధి ఉంటుంది. పబ్లిక్ ప్లేసులలో ముద్దులు పెట్టుకుంటూ, రొమాన్స్ చేస్తున్న జంటల వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. పార్కులు, బీచ్‌లు, రోడ్లు వంటి బహిరంగ ప్రదేశాల్లోనూ కొన్ని ప్రేమ జంటలు ఇలా రెచ్చిపోతూ కనిపిస్తున్నారు. మరికొందరు అయితే ఏకంగా బైక్‌పై వెళ్తూనే ప్రియురాలితో ముద్దులు పెట్టుకుంటూ హద్దుమీరి ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. ఈ తరహా ఘటనలు చూసినప్పుడు అందరికీ వచ్చే అనుమానం ఏంటంటే.. బహిరంగ ప్రదేశాల్లో ముద్దులు పెట్టుకోవడం మన దేశంలో నేరమా? పోలీసులు కేసు పెట్టవచ్చా? మరి ఈ అంశాలపై భారత చట్టాలు ఏం చెబుతున్నాయో మీకోసం ప్రత్యేకంగా..

పబ్లిక్‌గా ముద్దులు పెట్టుకోవడం నేరమా?

భారతదేశంలో బహిరంగ ప్రదేశాల్లో ప్రేమ జంటలు ముద్దులు పెట్టుకోవడాన్ని నేరంగా చెప్పే ప్రత్యేక చట్టం లేదు. చేతులు పట్టుకోవడం, కౌగిలించుకోవడం, ముద్దులు పెట్టుకోవడం వంటివి మాత్రమే నేరాలు కావు. అయితే బహిరంగ ప్రదేశాల్లో ఎలా ప్రవర్తిస్తున్నారనేది ముఖ్యం. ఇతరులకు ఇబ్బంది కలిగించేలా అసభ్యకరంగా ప్రవర్తిస్తే మాత్రం చట్టపరమైన సమస్యలు ఎదురుకావచ్చు.

భారత చట్టం ఏం చెబుతోంది?

గతంలో ఇలాంటి ఘటనలకు సంబంధించి ఐపీసీ సెక్షన్ 294 గురించి చెప్పేవారు. అయితే 2024 జూలై 1 నుంచి భారతీయ న్యాయ సంహిత (BNS) అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం ఇలాంటి సందర్భాల్లో BNS సెక్షన్ 296ను పరిశీలిస్తారు. ఈ సెక్షన్ ప్రకారం.. బహిరంగ ప్రదేశంలో ఇతరులకు ఇబ్బంది కలిగించేలా అసభ్యకరమైన పనులు చేస్తే శిక్ష పడే అవకాశం ఉంది. అలాంటి చర్యలకు పాల్పడినట్లు రుజువైతే మూడు నెలల వరకు జైలు శిక్ష లేదా రూ.1,000 వరకు జరిమానా లేదా రెండూ విధించవచ్చు. అయితే ఇద్దరు వ్యక్తులు ముద్దు పెట్టుకున్నంత మాత్రాన ఈ సెక్షన్ కింద కేసు పెట్టలేరు. ఆ చర్య అసభ్యకరమైనదా? దాని వల్ల ఇతరులకు ఇబ్బంది కలిగిందా? అనే విషయాలను కూడా పోలీసులు పరిశీలించాలి.

పోలీసులు అరెస్ట్ చేస్తారా?

బహిరంగ ప్రదేశంలో సాధారణంగా ముద్దులు పెట్టుకోవడం లేదా కౌగిలించుకోవడం మాత్రమే అరెస్ట్‌కు కారణం కాదు. కానీ ఇతరులకు ఇబ్బంది కలిగించేలా అసభ్యంగా ప్రవర్తిస్తే పోలీసులు చర్యలు తీసుకోవచ్చు. ప్రతి ఘటనలోనూ పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి పబ్లిక్‌గా ముద్దు పెట్టుకుంటే తప్పనిసరిగా అరెస్ట్ చేస్తారనడం సరైంది కాదు. కొంతమంది యువతీ యువకులు బైక్‌పై ప్రయాణిస్తున్న సమయంలోనే ముద్దులు పెట్టుకుంటూ కనిపిస్తుంటారు. మరికొందరు ప్రియురాలిని ముందు కూర్చోబెట్టుకుని బైక్ నడుపుతుంటారు. ఇలాంటి పనుల వల్ల డ్రైవింగ్‌పై దృష్టి తగ్గి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. దీంతో నిర్లక్ష్యంగా లేదా ప్రమాదకరంగా వాహనం నడిపితే మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 184 కింద పోలీసులు చర్యలు తీసుకోవచ్చు.

ఈ విషయాలు గుర్తుంచుకోండి..

ప్రేమను వ్యక్తపరచడం కోసం ఒక సమయం, సందర్భం ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇతరులకు ఇబ్బంది కలిగించేలా అసభ్యంగా ప్రవర్తిస్తే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు. పర్సనల్ లైఫ్ విషయాలను పబ్లిక్ లోకి తీసుకొచ్చి ఇబ్బంది పడడం కంటే మీ ఏకాంత సమయాలను మీ ఇంట్లోనే ప్లాన్ చేసుకొని సంతోషంగా గడపడం ఉత్తమమని సూచిస్తున్నారు. మైనర్లు ఇలాంటి పనులకు పాల్పడితే వారి తల్లిదండ్రుల సమక్షంలో మందలింపు చర్యలు పాల్పడతారు. పద్దినిమిదేళ్లు దాటితే వారిని వ్యక్తిగతంగా మందలిస్తారు.

Loading...
Unable to load recommendations.
Follow Us