
సౌర కుటుంబంలో సూర్యుడికి అత్యంత దగ్గరగా, అత్యంత చిన్న గ్రహమైన బుధుడు శాస్త్రవేత్తల అంచనాలకు మించి వేగంగా తన పరిమాణాన్ని కోల్పోతున్నాడని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఈ పరిశోధన బుధ గ్రహం భౌగోళిక పరిణామంపై కీలకమైన ఆధారాలను అందిస్తోంది. జర్మన్ ఏరోస్పేస్ సెంటర్‌కు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు నిర్వహించిన ఒక అధ్యయనం గత అంచనాలతో పోలిస్తే బుధ గ్రహం కుచించుకుపోయే రేటు 10 శాతం నుంచి 30 శాతం వరకు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించింది.
జియో ఫిజికల్ రీసెర్చ్ లెటర్స్ లో ప్రచురితమైన ఈ అధ్యయనం ప్రకారం, బుధుడు సుమారు 4.5 బిలియన్ల సంవత్సరాల క్రితం ఏర్పడినప్పటి నుంచి దాని వ్యాసం కనీసం 10 కిలోమీటర్ల మేర తగ్గిపోయింది. ఇంతకు ముందు అంచనాలు కేవలం ఎనిమిది కిలోమీటర్ల తగ్గుదలను సూచించాయి. 4,900 కిలోమీటర్ల వ్యాసం మాత్రమే కలిగిన ఈ చిన్న గ్రహానికి 10 కిలోమీటర్ల తగ్గుదల అనేది గణనీయమైన మార్పు అని అధ్యయన ప్రధాన రచయిత నిషియామ స్పష్టం చేశారు. ద్రాక్ష పండు ఎండకు ఎండుతూ కిస్మిస్ లా ఎలా ముడుచుకుపోతుందో, బుధుడి పరిస్థితి కూడా అలాగే తయారైంది.
సంకోచనానికి కారణం: చల్లబడుతున్న కోర్
ఈ సంకోచనానికి ప్రధాన కారణం బుధ గ్రహ అంతర్గత నిర్మాణం. ఈ గ్రహం కేంద్రంలో అత్యంత వేడిగా ఉండే ఇనుప ధాతువుతో కూడిన కోర్ ఉంటుంది. ఈ కోర్ కాలక్రమేణా తన వేడిని కోల్పోయి నెమ్మదిగా చల్లబడుతోంది. కోర్ చల్లబడే కొద్దీ అది కుచించుకుపోవడం మొదలవుతుంది. దానితోపాటు పైన ఉన్న మాంటిల్, క్రస్ట్ కూడా లోపలికి లాగబడి గ్రహం ఉపరితలంపై ముడతలు, లోతైన పగుళ్ళు ఏర్పడుతున్నాయి. బుధుడి ఉపరితలంపై నిరంతరం పడే గ్రహ శకలాల శిధిలాల కింద ఈ ముడతలు చాలా కాలం పాటు దాగి ఉండటం వల్లే శాస్త్రవేత్తలు ఈ సంకోచ వేగాన్ని సరిగ్గా అంచనా వేయలేకపోయారని పరిశోధకులు భావిస్తున్నారు. బుధ గ్రహం తన వేడిని పూర్తిగా కోల్పోయి చుట్టూ ఉన్న అంతరిక్ష వాతావరణం ఉష్ణోగ్రతకు సమానం అయ్యే వరకు ఈ కుచించుకుపోయే ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది.
బేపి కొలంబో మిషన్: భవిష్యత్ ఆశలు
ఈ మిస్టరీని పూర్తిగా చేధించేందుకు అంతర్జాతీయ అంతరిక్ష సంస్థలు సన్నద్ధమవుతున్నాయి. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA), జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ (JAXA) సంయుక్తంగా చేపట్టిన బేపి కొలంబో వ్యోమనౌక ఇందులో కీలక పాత్ర పోషించనుంది. వచ్చే నవంబర్‌లో ఇది బుధుడి కక్ష్యలోకి ప్రవేశించి లేజర్ పరికరాల ద్వారా గ్రహం ఉపరితలాన్ని అత్యంత కచ్చితంగా కొలవనుంది. గతంలో 1970లలో నాసాకు చెందిన మారినర్ టెన్, ఆ తర్వాత మెసెంజర్ స్పేస్‌క్రాఫ్ట్‌లు మాత్రమే బుధుడిని అధ్యయనం చేశాయి. ఇప్పుడు బేపి కొలంబో పంపే డేటా ద్వారా బుధ గ్రహం అంతర్గత నిర్మాణం ఎంత వేగంగా చల్లబడుతోంది, లోపల ఎలాంటి భౌగోళిక మార్పులు జరుగుతున్నాయి అనే విషయాలపై శాస్త్రవేత్తలకు మరింత స్పష్టత రానుంది. ఈ మిషన్ సౌర వ్యవస్థలోని గ్రహాల పరిణామం, వాటి అంతర్గత ప్రక్రియలపై లోతైన అవగాహనను పెంపొందించడంలో సహాయపడుతుంది.