
ప్రపంచ యుద్ధాల సమయంలో గూఢచర్యానికి, రహస్య సమాచార మార్పిడికి ఉపయోగించే పద్ధతులు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. కానీ ఒక సాదాసీదా నిమ్మపండు ఒక గూఢచారిని ఎలా పట్టించిందో తెలుసా? ఒక అదృశ్య సిరా, ఒక చిన్న నిమ్మకాయ.. ఒక గూఢచారి జీవితాన్ని ఎలా ముగించాయో తెలుసుకుందాం.
ఈ నిమ్మకాయ వెనుక ఉన్నది కార్ల్ ముల్లర్. అతను 1915 జనవరిలో రష్యా షిప్పింగ్ బ్రోకర్‌గా నటిస్తూ బ్రిటన్లోకి అడుగుపెట్టారు. అతను నకిలీ పత్రాలు, గడ్డంతో బెల్జియం నుంచి వచ్చిన శరణార్థిగా తనను తాను పరిచయం చేసుకున్నాడు. వాస్తవానికి, ముల్లర్ బ్రిటిష్ సైన్యం కదలికల గురించి జర్మనీకి నివేదించే ఒక ఏజెంట్.
అతని ఆయుధం పిస్టల్ లేదా బాంబు కాదు, నిమ్మరసం. నిమ్మపండును పెన్నుతో గుచ్చి, ఆ ద్రవాన్ని తీసుకుని మామూలు లేఖల మధ్యలో రహస్య సందేశాలు రాసేవాడు. కాగితాన్ని వేడి చేస్తే మాత్రమే ఈ అదృశ్యమైన అక్షరాలు కనిపించేవి. ఇది పురాతన అదృశ్య సిరా పద్ధతి.
బ్రిటన్ పోస్టల్ సెన్సార్‌షిప్ కార్యాలయం అప్పటికే శత్రువుల కదలికల గురించి జాగ్రత్తగా ఉంది. రొట్టర్‌డామ్ పోస్ట్ ఆఫీస్ బాక్స్‌కు వచ్చిన ఒక లేఖ వారికి అనుమానం కలిగించింది. MI5 అధికారులు ఆ లేఖను వేడి చేయగా, సైన్యం కదలికలకు సంబంధించిన కోడెడ్ నోట్స్ బయటపడ్డాయి. ఈ దర్యాప్తులో ముల్లర్ సహాయకుడు, బేకరీ ఉద్యోగి జాన్ హాన్ చిక్కాడు. అతని ఇంట్లో పెన్ను గుచ్చిన నిమ్మకాయ ఒకటి దొరికింది.
దాని ఆధారంగా అధికారులు ముల్లర్‌ని అరెస్టు చేశారు. అతని ఓవర్‌కోట్ జేబులో ఒక నిమ్మపండు దొరికింది. దాంతో, దర్యాప్తు అధికారులు ముల్లర్‌కు మరిన్ని ప్రశ్నలు వేశారు. నిమ్మకాయలు ఎందుకు తీసుకువెళ్తున్నావని అడగ్గా, అతను వాటిని “పళ్లు శుభ్రం చేసుకోవడానికి” అని చెప్పాడు. ఆ సమాధానం నమ్మదగినది కాదు. ఫోరెన్సిక్ పరీక్షలో అతని పెన్ను మీద నిమ్మకాయల సెల్ ఫోర్సుల ఆనవాళ్లు దొరికాయి. ఇది నేరానికి సంబంధించిన కీలక సాక్ష్యం.
1915 జూన్‌లో ముల్లర్, హాన్ ఇద్దరికీ రహస్యంగా విచారణ జరిగింది. హాన్ ఏడు సంవత్సరాల జైలు శిక్ష అనుభవించాడు. ముల్లర్‌కు గూఢచర్య నేరం కింద మరణశిక్ష పడింది. 1915 జూన్ 23న అతను లండన్ టవర్లో కాల్పుల దళం దగ్గరకు ప్రశాంతంగా వెళ్లాడు. చివరగా ప్రతి సైనికుడితో చేతులు కలిపి కళ్లు మూసుకుని మరణించాడు.