
భారతీయ గ్రామీణ ప్రాంతాల్లో ఒక బలమైన నమ్మకం ఉంది.. అదే గర్భిణీ స్త్రీలను పాములు కరవవు అని. ఈ మాట వినడానికి ఎంత వింతగా అనిపించినా, తరతరాలుగా మన జానపద కథల్లో, అమ్మమ్మల మాటల్లో ఇది ఒక సత్యంలా పాతుకుపోయింది. సృష్టికి మూలమైన మాతృత్వాన్ని ప్రకృతి రక్షిస్తుందని కొందరు అంటే దీని వెనుక శాస్త్రీయ కారణాలు ఉన్నాయని మరికొందరు వాదిస్తారు. అసలు ఈ నమ్మకం వెనుక ఉన్న మిస్టరీ ఏంటి? మతం, జ్యోతిష్యం మరియు సైన్స్ దీని గురించి ఏం చెబుతున్నాయి?
హిందూ సంప్రదాయంలో గర్భిణీ స్త్రీని సాక్షాత్తు శక్తి స్వరూపంగా చూస్తారు. సృష్టి కార్యం జరుగుతున్నప్పుడు ఆ స్త్రీ చుట్టూ దైవికమైన రక్షణ ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. పురాణాల ప్రకారం.. సర్పాలు పిండంలోని ఆత్మను పసిగట్టగలవు. శివుడికి, విష్ణువుకు అత్యంత ప్రియమైన సర్పాలు, సృష్టికి మూలమైన గర్భిణీకి హాని చేయడం మత విరుద్ధమని భావిస్తాయి. గర్భం దాల్చడం అనేది ఒక పవిత్రమైన ప్రక్రియ కాబట్టి సర్ప జాతి ఆ స్త్రీకి మార్గం సుగమం చేస్తుందని జానపద కథల సారాంశం.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. పాములు రాహు, కేతువులకు ప్రతీకలు. గర్భిణీ స్త్రీ చుట్టూ ఒక శక్తివంతమైన ఆరా లేదా ప్రభా మండలం ఏర్పడుతుందని, ఇది ప్రతికూల గ్రహాలైన శని, రాహువుల ప్రభావాన్ని తగ్గిస్తుందని జ్యోతిష్కులు నమ్ముతారు. ఈ సానుకూల శక్తి వల్ల పాములు అటువైపు రావడానికి ఇష్టపడవని, వచ్చినా ఎటువంటి హాని చేయకుండా వెళ్లిపోతాయని చెబుతుంటారు.
మత విశ్వాసాలు ఎలా ఉన్నా, ఆధునిక సైన్స్ మాత్రం ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉంది. పాముకు ఎదుటి వ్యక్తి గర్భిణీనా లేక కాదా అనే విచక్షణ ఉండదు. తన ప్రాణానికి ముప్పు పొంచి ఉందని భావిస్తే అది ఎవరినైనా కాటు వేయగలదు. పాము కాటు వేయడం అనేది ఎదుటి వ్యక్తి చేసే కదలికల మీద ఆధారపడి ఉంటుంది. పొరపాటున కాలు వేసినా లేదా భయంతో గట్టిగా కదిలినా పాము తన ఆత్మరక్షణ కోసం దాడి చేస్తుంది. అయితే గర్భిణీ స్త్రీల శరీరంలో జరిగే హార్మోన్ల మార్పుల వల్ల వచ్చే ఒక రకమైన వాసనను పాములు పసిగడతాయని, అది వాటిని దూరంగా ఉంచుతుందని కొన్ని అనధికారిక పరిశోధనలు చెబుతున్నా, దానికి సరైన శాస్త్రీయ ఆధారాలు లేవు.
మన సంప్రదాయాలను గౌరవించడం మంచిదే.. కానీ నమ్మకం పేరుతో ప్రాణాల మీదకు తెచ్చుకోవడం అవివేకం. మాతృత్వం అనేది ప్రకృతి ఇచ్చిన వరం.. దాన్ని కాపాడుకోవడానికి విశ్వాసంతో పాటు అప్రమత్తత కూడా అవసరం. పామును చూసినప్పుడు భక్తితో నమస్కరించినా, సురక్షితమైన దూరం పాటించడం మాత్రం మర్చిపోకండి.