Ancient Currencies: డబ్బు చరిత్ర తెలుసా.. ప్రపంచంలోనే అత్యంత పురాతన కరెన్సీలు ఇవే!

నేటి కాలంలో డబ్బుకు ఉన్న విలువ మరిదేనికి లేదంటే అతిశయోక్తి కాదు. మన రోజువారీ జీవితంలో కూడా డబ్బు లేనిదే ఏ పనీ జరగదు. ఈ నేపథ్యంలో ప్రపంచంలో అత్యంత పురాతనమైన ఐదు కరెన్సీలు ఏవి ? వాటి చరిత్ర ఏంటో తెలుసుకుందాం..

Ancient Currencies: డబ్బు చరిత్ర తెలుసా.. ప్రపంచంలోనే అత్యంత పురాతన కరెన్సీలు ఇవే!
Ancient Currencies

Updated on: Nov 21, 2026 | 11:51 AM

డబ్బు.. డబ్బు.. డబ్బు.. నేటి కాలంలో డబ్బుకు ఉన్న విలువ మరిదేనికి లేదంటే అతిశయోక్తి కాదు. ఒకరకంగా చెప్పాలంటే మనిషి కన్నా డబ్బుకే ఎక్కువ విలువ ఇచ్చే రోజుల్లో బ్రతుకుతున్నాం. మన రోజువారీ జీవితంలో కూడా డబ్బు లేనిదే ఏ పనీ జరగదు. పొద్దున్నే తాగే టీ కప్పు దగ్గర నుంచి అన్ని పనులు డబ్బుతోనే ముడిపడి ఉంది. కానీ ఒకప్పుడు అసలు ఈ డబ్బు అనేది లేదు అని అందరికీ తెలిసిందే. మరి డబ్బు గురించి ఆలోచన అసలు ఎలా పుట్టింది? డబ్బు చరిత్ర ఏంటో తెలుసుకుందాం..

వస్తు మార్పిడి పద్ధతి టూ నాణేలు..

కాగా డబ్బు ఉనికిలోకి రాకముందు ప్రపంచవ్యాప్తంగా ‘వస్తు మార్పిడి’ అమల్లో ఉండేది. ఒక వస్తువు ఇచ్చి, దానికి బదులుగా మనకు అవసరమైన మరో వస్తువు తీసుకోవడం. అయితే ఆ పద్దతిలో ఇబ్బందులు ఎదురైన తరుణంలో ప్రత్యామ్నాయ మార్గాల వైపు ఆలోచించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఆఫ్రికా, ఆసియా దేశాల్లో సముద్రపు గవ్వలు, ఉప్పు, పూసలు, పశువులు, ధాన్యాన్ని కరెన్సీగా వాడటం మొదలుపెట్టారు. కాలానుగుణంగా వస్తువుల స్థానంలో విలువైన లోహాల వాడకం పెరిగింది. క్రీస్తుపూర్వం 600 ప్రాంతంలో ప్రస్తుత టర్కీ ప్రాంతంలోని ‘లిడియా’ (Lydia) రాజ్యంలో మొట్టమొదటిసారిగా అధికారిక నాణేలను ముద్రించారు. ఆ తర్వాత గ్రీకులు, రోమన్లు, భారతదేశంలోని మౌర్యులు, గుప్తులు తమ తమ రాజ్యాలలో వివిధ రకాల బంగారు, వెండి, రాగి నాణేలను చలామణిలోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత నోట్లు అందుబాటు లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రపంచంలో అత్యంత పురాతనమైన ఐదు కరెన్సీలు ఏవో తెలుసుకుందాం..

1. బ్రిటిష్ పౌండ్.. 

ప్రపంచంలో ఇప్పటికీ కొనసాగుతున్న అత్యంత పురాతన కరెన్సీగా బ్రిటిష్ పౌండ్‌కు గుర్తింపు ఉంది. దీని చరిత్ర 775వ సంవత్సరం నుంచి ప్రారంభమైంది. అప్పట్లో 240 వెండి పెన్నీ నాణేలను ఒక పౌండ్ వెండికి సమానంగా పరిగణించేవారు. ప్రస్తుతం బ్రిటన్ అధికారిక కరెన్సీగా కొనసాగుతోంది. పౌండ్‌కు GBP అనే అంతర్జాతీయ గుర్తింపు ఉంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోనూ దీనికి ప్రత్యేక స్థానం ఉంది.

2. సెర్బియన్ దినార్.. 

ప్రపంచంలోని పురాతన కరెన్సీల్లో సెర్బియన్ దినార్ కూడా ఒకటి. దీని చరిత్ర 1214వ సంవత్సరం నాటిది. సెర్బియా పాలకుడు స్టీఫెన్ ప్రథముడి కాలంలో ఈ నాణేలను మొదటిసారిగా విడుదల చేశారు. అప్పట్లో రోమన్ దినార్ నాణేల నుంచి ప్రేరణ పొంది వీటిని రూపొందించారు. ఈ నాణేలను ప్రధానంగా వెండితో తయారు చేసేవారు. ప్రస్తుతం కూడా సెర్బియా అధికారిక కరెన్సీగా దినార్‌నే ఉపయోగిస్తోంది.

3. రష్యన్ రూబుల్.. 

రష్యన్ రూబుల్‌కు కూడా వందల ఏళ్ల చరిత్ర ఉంది. ప్రారంభంలో వెండిని చిన్న ముక్కలుగా కోసి లావాదేవీలకు ఉపయోగించేవారు. రష్యన్ భాషలో ‘రూబుల్’ అనే పదానికి కోయడం లేదా ముక్కలుగా విభజించడం అనే అర్థం ఉంది. అందుకే ఈ కరెన్సీకి ఆ పేరు వచ్చింది.

4. అమెరికన్ డాలర్.. 

ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన కరెన్సీల్లో అమెరికన్ డాలర్ ఒకటి. దీని చరిత్ర 1785వ సంవత్సరం నుంచి ప్రారంభమైంది. స్పానిష్ డాలర్, ఆస్ట్రియన్ థాలర్ వంటి పాత నాణేల నుంచి ప్రేరణ పొంది అమెరికన్ డాలర్‌ను రూపొందించారు. 1785లో అమెరికా అధికారికంగా డాలర్‌ను తమ కరెన్సీగా స్వీకరించింది. ప్రస్తుతం అంతర్జాతీయ వ్యాపారాలు, విదేశీ మారక నిల్వల్లో డాలర్ కీలక పాత్ర పోషిస్తోంది.

5. హైతియన్ గౌర్డ్..

ప్రపంచంలోని పురాతన కరెన్సీల జాబితాలో హైతియన్ గౌర్డ్‌కు కూడా స్థానం ఉంది. ఫ్రాన్స్ నుంచి స్వాతంత్రం పొందిన తర్వాత హైతీ దేశం తన సొంత కరెన్సీగా గౌర్డ్‌ను ప్రవేశపెట్టింది. 1813లో ఇది అధికారికంగా చలామణిలోకి వచ్చింది.

Loading...
Unable to load recommendations.
Follow Us