జాదవ్ పై ఐసీజే తీర్పు.. ఎవరి విజయం ? ఇండియాదా ? పాకిస్తాన్ దా ?

పాకిస్తాన్ అధీనంలో ఉన్న భారత నేవీ మాజీ అధికారి కుల్ భూషణ్ జాదవ్ మరణశిక్షపై అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు పట్ల ఇండియా హర్షం వ్యక్తం చేయగా.. పాక్ మీడియా దీనికి భిన్నంగా స్పందిస్తూ ప్రశంసలు కురిపించింది. ఇది తమ విజయమని అక్కడి పత్రికలు పేర్కొన్నాయి. జాదవ్ విషయంలో ఇండియా కోరిన అన్ని కోర్కెలనూ ఈ తీర్పు తోసిపుచ్చినట్టయిందని అవి వ్యాఖ్యానించాయి. ‘ ఇది ఇండియాకే లాస్ అని ‘ పాకిస్తాన్ టుడే ‘ డైలీ అభివర్ణిస్తూ.. జాదవ్ ను విడుదల చేయాలన్న భారత డిమాండును కోర్టు తిరస్కరించిందని తన ఆర్టికల్ లో పేర్కొంది. జాదవ్ దోషి అని, అతనికి మరణశిక్షే సబబు అని ఈ తీర్పు స్పష్టం చేస్తోందని, పైగా ఇది వియన్నా ఒప్పందాన్ని అతిక్రమించలేదని అభిప్రాయపడిందని ఈ పత్రిక తెలిపింది. ఎక్స్ ప్రెస్ ట్రిబ్యూన్ తన వెబ్ సైట్ హోమ్ పేజీలో.. జాదవ్ పై ఎనిమిది వార్తలను ప్రచురించింది. అతడ్ని అంతర్జాతీయ న్యాయస్థానం జోక్యంతో విడిపించగలమని భారత్ పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయని ఈ సైట్ ‘ చాటింది ‘. ఇలాగే ది న్యూస్, డాన్ వంటి డైలీలు తమ హెడ్ లైన్స్ లో ఈ తీర్పు పట్ల ప్రశంసల జల్లు కురిపించాయి. అయితే బ్రిటిష్ మీడియా లాంటి విదేశీ పత్రికలు భారత్ కు అనుకూలంగా స్పందించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *