ఇంజక్షన్స్ వాడుతున్నారా? ఈ ప్రమాదం పొంచి ఉందని తెలీదా ఏంటి

బరువు పెరగడం అనేది కేవలం శారీరక సమస్యే కాదు, అది తీవ్రమైన మానసిక ఒత్తిడికి కూడా దారితీస్తుంది. పెరిగిన బరువును ఎలాగైనా తగ్గించుకోవాలనే తపనతో చాలా మంది అడ్డదారులు తొక్కుతుంటారు. ప్రజల ఈ బలహీనతనే పెట్టుబడిగా మార్చుకుని ప్రస్తుతం మార్కెట్లోకి బరువు తగ్గించే ఇంజెక్షన్లు విపరీతంగా వస్తున్నాయి.

ఇంజక్షన్స్ వాడుతున్నారా? ఈ ప్రమాదం పొంచి ఉందని తెలీదా ఏంటి
Weight Loss Injections1.jpg

Updated on: Apr 29, 2026 | 6:00 AM

అంతర్జాతీయ సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల ప్రచారం వల్ల ఈ ఇంజెక్షన్లకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. అయితే ఇదే అదనుగా నకిలీ మరియు నాసిరకం ఇంజెక్షన్లు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. ఇవి ప్రాణాలను కాపాడటం పక్కన పెడితే, శరీరంలోని అంతర్గత అవయవాలపై తీవ్రమైన విష ప్రభావాన్ని చూపుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

అంతర్గత అవయవాలపై విష ప్రభావం

పరిశోధనల ప్రకారం, నకిలీ బరువు తగ్గించే ఇంజెక్షన్లలో అసలైన ఔషధ గుణాలు ఉండవు. బదులుగా వీటిలో ప్రమాదకరమైన రసాయనాలు లేదా కలుషితమైన ద్రవాలు ఉండే అవకాశం ఉంది. దీనివల్ల ఆశించిన ఫలితం రాకపోగా, శరీరంలో ఇన్ఫెక్షన్లు పెరిగి ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ మందుల వల్ల కాలేయం, మూత్రపిండాలు శాశ్వతంగా దెబ్బతినే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

అంతేకాదు, ఈ నకిలీ మందులు శరీరంలో యాంటీబయాటిక్ నిరోధకతను పెంచుతాయి. అంటే భవిష్యత్తులో ఏదైనా నిజమైన ఇన్ఫెక్షన్ సోకినప్పుడు సాధారణ మందులు మీ శరీరంపై పని చేయవు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గణాంకాల ప్రకారం, తక్కువ ఆదాయ దేశాల్లో చలామణి అవుతున్న ప్రతి పది మందుల్లో ఒకటి నకిలీదని అంచనా. బరువు తగ్గాలనే తొందరలో ఇలాంటి నాసిరకం ఉత్పత్తుల వైపు మొగ్గు చూపడం ప్రాణాంతకమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ఎలా గుర్తించాలి?

నకిలీ మందుల మాఫియా ప్యాకేజింగ్‌ను అసలైన మందుల మాదిరిగానే తయారు చేస్తోంది. అయినప్పటికీ, కొద్దిగా అప్రమత్తంగా ఉంటే వీటిని గుర్తించవచ్చు:

  • ప్యాకేజింగ్ పరిశీలన : మందు డబ్బాపై ఉన్న అక్షర దోషాలు, అసాధారణ రంగులు లేదా లేబుల్స్‌ను గమనించాలి.
  • QR కోడ్ ధృవీకరణ: ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అనేక మందులపై క్యూఆర్ కోడ్‌లను తప్పనిసరి చేసింది. దీనిని స్కాన్ చేయడం ద్వారా మందు అసలైనదో కాదో తెలుసుకోవచ్చు.
  • అసాధారణ ధరలు: మార్కెట్ ధర కంటే అతి తక్కువ ధరకే మందులు వస్తున్నాయంటే ఖచ్చితంగా అనుమానించాలి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

బరువు తగ్గించే ఇంజెక్షన్లను ఎప్పుూ ఆన్‌లైన్ వెబ్‌సైట్లు లేదా సోషల్ మీడియా విక్రేతల నుండి నేరుగా కొనకూడదు. కేవలం లైసెన్స్ పొందిన ఫార్మసీల నుండి మాత్రమే కొనుగోలు చేయాలి. ముఖ్యంగా, ఎండోక్రినాలజిస్ట్ లేదా బారియాట్రిక్ సర్జన్ వంటి నిపుణుల పర్యవేక్షణ లేకుండా సొంతంగా ఇలాంటి ఇంజెక్షన్లను వాడటం ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే.

బరువు తగ్గడానికి శస్త్రచికిత్సలు లేదా ఇంజెక్షన్లు అనేవి చివరి ఆప్షన్లుగా ఉండాలి. సహజమైన పౌష్టికాహారం, క్రమబద్ధమైన వ్యాయామం ద్వారా బరువు తగ్గడం అత్యంత సురక్షితమైన మార్గం. ఫలితాల కోసం ఆరాటపడి ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని వైద్యులు సూచిస్తున్నారు. మీరు ఏదైనా ఇంజెక్షన్ వాడుతున్నప్పుడు వికారం, తీవ్రమైన కడుపునొప్పి లేదా వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

Follow Us