
చిన్నారుల భవిష్యత్తు ఆరోగ్యాన్ని పరిరక్షించే దిశగా భారత ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) విప్లవాత్మక అడుగు వేసింది. ఆరు నెలల వయసు వరకు ఉండే చిన్న పిల్లల కోసం తయారు చేసే ఆహార పదార్థాలలో (Infant Nutrition Products) అదనంగా కలిపే చక్కెరపై (Added Sugars) సంపూర్ణ నిషేధం విధించాలని ప్రతిపాదించింది. ఈ మేరకు “ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ (ఫుడ్స్ ఫర్ ఇన్‌ఫాంట్ న్యూట్రిషన్) నిబంధనలు-2020” కి సవరణలు చేస్తూ కీలక ముసాయిదా నోటిఫికేషన్‌ను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. చిన్న పిల్లల ఆరోగ్యమే ప్రధాన లక్ష్యంగా ఈ ముసాయిదాను రూపొందించింది.
సుక్రోజ్, ఫ్రక్టోజ్‌ల వినియోగంపై నిషేధం: ఆరు నెలల లోపు వయసున్న శిశువులు, చిన్నారుల కోసం మార్కెట్లో లభించే ఫార్ములా మిల్క్, పౌడర్లు లేదా ఇతర ఆహార ఉత్పత్తులలో సుక్రోజ్ (Sucrose), ఫ్రక్టోజ్ (Fructose) వంటి తీపి పదార్థాలను చేర్చడాన్ని పూర్తిగా నిషేధించాలని ముసాయిదా చట్టంలో స్పష్టం చేశారు.
ఆమోదయోగ్యమైన కార్బోహైడ్రేట్లు మాత్రమే: ప్రస్తుత నిబంధనల ప్రకారం కార్బోహైడ్రేట్ల మూలం కోసం ప్రాథమికంగా ‘ల్యాక్టోజ్’ (Lactose), ‘గ్లూకోజ్ పాలిమర్స్’ లను మాత్రమే ప్రాధాన్య మూలాలుగా అనుమతిస్తున్నారు. ఇకపై సుక్రోజ్, ఫ్రక్టోజ్ వాడకానికి అడ్డుకట్ట పడనుంది.
60 రోజుల గడువు: ఈ సవరణలపై వాటాదారులు, తయారీదారులు, వైద్య నిపుణులు, సాధారణ ప్రజల నుంచి అభిప్రాయాలు, అభ్యంతరాలు స్వీకరించేందుకు 60 రోజుల సమయం కేటాయించారు.
చిన్ననాటి ఊబకాయానికి (Childhood Obesity) చెక్: చిన్న వయసులోనే పంచదార అలవాటు కావడం వల్ల పిల్లల్లో ఊబకాయం, చిన్నతనంలోనే మధుమేహం (Type-2 Diabetes) వంటి ప్రమాదకర ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని శాస్త్రీయ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఈ ముప్పును నివారించడమే ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లక్ష్యం.
అవసరమైన పోషకాహారం మాత్రమే: ఆరు నెలల లోపు పిల్లల శరీరానికి, ఎదుగుదలకు అవసరమయ్యే వయస్సుకు తగిన పోషకాలు మాత్రమే అందాలి తప్ప, వ్యాపార ప్రయోజనాల కోసం రుచిని పెంచేందుకు వాడే అదనపు చక్కెర్లు ఏమాత్రం శ్రేయస్కరం కావని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
తల్లిపాల విశిష్టతకు ప్రాధాన్యత: పుట్టిన మొదటి ఆరు నెలల పాటు శిశువులకు కేవలం తల్లిపాలు మాత్రమే (Exclusive Breastfeeding) ఇవ్వాలనే అంతర్జాతీయ – జాతీయ ఆరోగ్య మార్గదర్శకాలకు ఈ నిర్ణయాలు మరింత ఊతాన్ని ఇస్తాయి.
సైన్స్ ఆధారిత ఆహార ప్రమాణాలను రూపొందించడం, బాధ్యతాయుతమైన ఉత్పత్తి విధానాలను ప్రోత్సహించడం, నివారణాత్మక పోషకాహారానికి (Preventive Nutrition) ప్రాధాన్యత ఇవ్వడంలో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ప్రతిపాదించిన ఈ సవరణలు ప్రముఖ మైలురాయిగా నిలవనున్నాయి. ఈ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే, చిన్న పిల్లల ఆహార తయారీ రంగానికి (Baby Food Industry) అత్యంత కఠినమైన నియంత్రణలు వర్తించనున్నాయి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..