
బరువు తగ్గాలనే ఆరాటంలో చైనాలో ఒక వింతైన, అత్యంత ప్రమాదకరమైన ట్రెండ్ వెలుగులోకి వచ్చింది. అదే ప్లాస్టిక్ తినడం. వినడానికి చాలా వింతగా, అసహ్యంగా ఉన్నా.. అక్కడ కొందరు యువత బరువు తగ్గడానికి ఈ ప్రాణాంతకమైన మార్గాన్ని ఎంచుకుంటున్నారు. మెదడును మోసం చేసి బరువు తగ్గవచ్చని భావించే ఈ పద్ధతి వెనుక ఉన్న అసలు నిజాలు, ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్న భయంకరమైన పరిణామాల గురించి వివరంగా తెలుసుకుందాం.
ఈ వింత ట్రెండ్‌లో భాగంగా ప్రజలు ఆహారం తినే ముందు నోటిలో ఒక సన్నని ప్లాస్టిక్ పొరను లేదా కవర్‌ను ఉంచుకుంటున్నారు. ఆ ప్లాస్టిక్ ద్వారానే ఆహారాన్ని నమలుతారు, కొంతసేపు నోట్లోనే ఉంచుకుని ఆ తర్వాత ఆహారంతో సహా ఆ ప్లాస్టిక్ ముక్కను బయటకు తీసేస్తారు. అంటే ఆహారాన్ని నమిలిన అనుభూతి కలుగుతుంది కానీ, అది కడుపులోకి వెళ్లదు. దీనివల్ల కడుపు నిండినట్లు మెదడుకు సంకేతాలు పంపి, ఆహారం తీసుకోకుండా బరువు తగ్గవచ్చని వారు భావిస్తున్నారు. కానీ ఈ క్రమంలో వారు శరీరానికి అందాల్సిన పోషకాలకు బదులుగా అత్యంత ప్రమాదకరమైన మైక్రో ప్లాస్టిక్స్‌ను శరీరంలోకి పంపిస్తున్నారు.
దీనివల్ల స్వల్పకాలంలో బరువు తగ్గినట్లు అనిపించినా, అది ఆరోగ్యకరమైన మార్పు కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ పద్ధతిలో శరీరంలోని కొవ్వు కరగదు, కేవలం నీరు, కండరాలు, అవసరమైన పోషకాలు మాత్రమే తగ్గిపోతాయి. దీనివల్ల మెటబాలిజం మందగించి శరీరం బలహీనపడుతుంది. తిరిగి సాధారణ ఆహారం తీసుకోవడం ప్రారంభించగానే, మునుపటి కంటే వేగంగా బరువు పెరుగుతారు.
కడుపు నిండినట్లు అనిపించే సతైటీ అనే అనుభూతి కేవలం నమలడం వల్ల మాత్రమే రాదు. మనం ఎంత నెమ్మదిగా తింటున్నాం, కడుపు ఎంత వరకు సాగుతోంది, శరీరంలోని లెప్టిన్, గ్రెలిన్ వంటి హార్మోన్లు ఇచ్చే సంకేతాల మీద ఇది ఆధారపడి ఉంటుంది. ప్లాస్టిక్ ద్వారా ఆహారం నమలడం వల్ల లాలాజలంతో కలిసి హానికరమైన రసాయనాలు శరీరంలోకి ప్రవేశిస్తాయి. అంతేకాకుండా ఆ ప్లాస్టిక్ పొర గొంతులో చిక్కుకుని ఊపిరి ఆడక ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంది. నిజమైన సంతృప్తి ఆహారం జీర్ణమైనప్పుడే లభిస్తుంది తప్ప, ఇలాంటి మోసపూరిత పద్ధతుల వల్ల కాదు.
ఈ ట్రెండ్ మానసిక ఆరోగ్యాన్ని కూడా తీవ్రంగా దెబ్బతీస్తుంది. అందంగా కనిపించాలనే ఒత్తిడి వల్ల ఆందోళన, ఆత్మన్యూనత, విపరీతమైన ఒత్తిడి పెరుగుతాయి. ఆహారం పట్ల ఒక రకమైన భయం ఏర్పడి, ఈటింగ్ డిజార్డర్స్‌కు దారితీస్తుంది. శరీరానికి తగినంత పోషణ అందకపోవడం వల్ల చిరాకు, విచారం, అలసట, ఏకాగ్రత లేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. బరువు తగ్గడం అనేది ఒక ప్రయోగంలా కాకుండా, సమతుల్య ఆహారం, వ్యాయామంతో కూడిన ఆరోగ్యకరమైన జీవనశైలిలా ఉండాలి. శరీరం కోరుకునేది మోసపూరిత ట్రిక్స్ కాదు, సరైన పోషకాలున్న ఆహారం మాత్రమేనని గుర్తుంచుకోవాలి.