శ్రీవారి భక్తులకు శుభవార్త… గతంలో ఒక్క రోజే.. ఇక నుంచి పది రోజులు..టీటీడీ బోర్డు కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి భక్తులకిది శుభవార్త. శనివారం సమావేశమైన తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డు తీసుకున్న నిర్ణయం మేరకు గతంలో సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే వుండే…

  • Rajesh Sharma
  • Publish Date - 4:33 pm, Sat, 28 November 20

Good News for Srivari devotees: తిరుమల శ్రీవారి భక్తులకిది శుభవార్త. శనివారం సమావేశమైన తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డు తీసుకున్న నిర్ణయం మేరకు గతంలో సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే వుండే ఓ ప్రత్యేక దర్శనం ఇకపై సంవత్సరానికి పది రోజుల పాటు అందుబాటులోకి రానున్నది. ఈ విషయాన్ని టీటీడీ ట్రస్టు బోర్డు ఛైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి స్వయంగా వెల్లడించారు.

శనివారం సమావేశమైన టీటీడీ ట్రస్టు బోర్డు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుమల ఆలయంలోని మహాద్వారం, బలిపీఠం, ధ్వజ స్థంభాలకు బంగారు తాపడం వేయాలని నిర్ణయం తీసుకున్నారు. తిరుమలలో పనిచేసే ప్రైవేట్ సెక్యూరిటీకి రూ.2 వేల రూపాయలు యూనిఫాం అలెవెన్స్‌గా ఇవ్వాలని నిర్ణయించారు. అలిపిరి కాలినడక మార్గం ఆధునీకరణ పనులు కొనసాగుతున్నాయని, ఆ మార్గంలోని గాలి గోపురాన్ని ఆధునీకరించాలని నిర్ణయించామని ఛైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

‘‘ తిరుమలలో ప్లాస్టిక్ నిషేధం విజయవంతమైంది.. తిరుమలలో పర్యావరణాన్ని కాపాడటానికి ఎలక్ట్రిక్ బస్సులు వేయాలని ముఖ్యమంత్రి జగన్‌కు విన్నవించాం.. 100 నుండి 150 బస్సులు కేటాయిస్తామని సీఎం హామీ ఇచ్చారు.. ’’ అని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ప్రతి ఏటీ వైకుంఠ ఏకాదశి రోజున ఒక్క రోజు మాత్రమే భక్తులకు కల్పిస్తున్న వైకుంఠ ద్వారా దర్శనం ఈసారి పది రోజుల పాటు కల్పించనున్నట్లు వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. ‘‘ వైకుంఠ ద్వారాన్ని 10 రోజుల పాటు తెరిచేందుకు పీఠాధిపతులు, మఠాధిపతుల అభిప్రాయం తీసుకున్నాం.. వారందరూ వైకుంఠ ద్వారాన్ని తెరిచేందుకు సమ్మతించారు.. డిసెంబర్ 25వ తేదీ నుంచి నుండి జనవరి 3వ తేది వరకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాన్ని భక్తుల దర్శనార్థం తెరుస్తాం’’ అని టీటీడీ బోర్డు ఛైర్మెన్ వెల్లడించారు.

తిరుమలలో పర్యావరణ సంరక్షణకు గ్రీన్ పవర్ వినియోగించాలని బోర్డు నిర్ణయించిందని ఛైర్మెన్ వివరించారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారికి 11 కిలోల బంగారంతో సూర్యప్రభ వాహనం చేయించాలని నిర్ణయించామని చైర్మెన్ తెలిపారు. భక్తుల రద్దీ తక్కువగా ఉండటంతో తిరుమలలో కాటేజీల ఆధుకరణ చేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ‘‘ రాజ శేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు టీటీడీ ఆధ్వర్యంలో కళ్యాణమస్తు కార్యక్రమం జరిగేది.. ప్రస్తుతం జిల్లా కేంద్రాల్లో కళ్యాణమస్తు కార్యక్రమాన్ని పునరుద్ధరించాలని నిర్ణయించాం.. కళ్యాణమస్తు కార్యక్రమం ద్వారా పేదల వివాహాలకు ఆర్థిక సాయం చేస్తాం.. తిరుపతిలోని బాలమందిరంలో అదనపు హాస్టల్ భవనం నిర్మాణం చేస్తాం.. ఆనంద నిలయం అనంత స్వర్ణమయం ప్రాజెక్టును తిరిగి ప్రారంభించే ఆలోచనలేదు.. గరుడ వారధి పనులకు నిధులు విడుదల చేస్తాం.. గరుడవారధి పనులను కొనసాగించాలని విజ్ఞప్తి చేశాం.. ’’ అని టీటీడీ బోర్డు నిర్ణయాలను వివరించారు ఛైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి.

ALSO READ: బీజేపీ నోట మధ్యంతరం మాట.. సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కమల నాథులు