Tollywood : గయ్యాళి పాత్రలతో ఇండస్ట్రీని ఏలేసిన ఛాయదేవి.. చివరి రోజుల్లో దుర్భరంగా.. ఎప్పటికీ మరచిపోలేని జీవన గాథ..

తెలుగు సినిమా స్వర్ణయుగంలో గయ్యాళి, చుప్పనాతి పాత్రలకు ప్రాణం పోసిన బహుముఖ నటి ఛాయాదేవి. సూర్యకాంతంతో పోల్చబడినప్పటికీ, ఆమెకు తగిన గుర్తింపు లభించలేదు. చిన్నతనం నుంచే కష్టాలు, భర్త మరణం, ఆపై పరిశ్రమ మద్దతు లేకపోవడం, అనారోగ్యం, కోర్టు వివాదాలతో ఆమె చివరి రోజులు దుర్భరంగా గడిచాయి. ఛాయాదేవి జీవితం ఎందరినో కదిలిస్తుంది.

Tollywood : గయ్యాళి పాత్రలతో ఇండస్ట్రీని ఏలేసిన ఛాయదేవి.. చివరి రోజుల్లో దుర్భరంగా.. ఎప్పటికీ మరచిపోలేని జీవన గాథ..
Chayadevi

Updated on: Oct 21, 2026 | 8:12 PM

తెలుగు సినిమా స్వర్ణయుగంలో ఎందరో మహానటులు వెలుగొందారు. వారిలో తన ప్రత్యేకతను చాటుకున్న నటి ఛాయాదేవి. గుండమ్మ కథ చిత్రంలో లక్ష్మి పాత్రకు పోటీగా తన పిన్ని గుండమ్మ ఇంట్లో తిష్ట వేసిన దుర్గమ్మగా ఆమె నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాలో భర్త వదిలేసిన పాత్రను ఛాయాదేవి ఎంతో అద్భుతంగా పోషించారు. కాపురాలు కూల్చేసే చుప్పనాతి పాత్రలు, గయ్యాళి పాత్రలు పోషించడంలో ఆమెది ఒక ప్రత్యేకమైన శైలి. మహానటి సూర్యకాంతమ్మతో పాటు ఆమె పేరు చెప్పగానే గుర్తుకొచ్చే నటి ఛాయాదేవి. వీరిద్దరూ ఎన్నో చిత్రాల్లో పోటీపడి నటించారు. గయ్యాళి పాత్రలు పోషించడంలో ఇద్దరూ దిట్టలే అయినప్పటికీ, ఛాయాదేవి నటనకు కొన్ని పరిమితులు ఉండేవని విశ్లేషకులు చెబుతారు. సూర్యకాంతమ్మ గయ్యాళి పాత్రలతో పాటు హాస్యం, అమాయకత్వం ఉన్న పాత్రలు కూడా పోషించారు. ఛాయాదేవి సాత్విక పాత్రలు కూడా చేసినా, ఆమెకు ఎక్కువగా కుట్రకోణం కనిపించే, విలనీ పండించే పాత్రలే దక్కాయి. సూర్యకాంతమ్మ పాత్రలు చివరికి పశ్చాత్తాపపడితే, ఛాయాదేవి పాత్రలు పోలీసులకు పట్టుబడితే బాగుండును అనిపించేవి. అయితే, తెరమీద విలనీ పండించిన ఛాయాదేవి, నిజజీవితంలో ఇతరులకు సహాయం చేసే గుణం ఉన్న గొప్ప మనసున్న వ్యక్తి. ఎవరైనా కష్టాల్లో ఉంటే అండగా నిలిచి ధైర్యం చెప్పేవారు.

మాయాబజార్‌లో రేవతి పాత్రలో, పరమానందయ్య శిష్యుల కథలో కాంతం పాత్రలో, కన్యాశుల్కంలో పూటకూళ్ళమ్మగా ఛాయాదేవి నటన అందరినీ ఆకట్టుకుంది. మాయాబజార్‌లో బొద్దుగా ఉన్న సావిత్రి తల్లి పోలిక అని చెప్పడానికి ఛాయాదేవిని కె.వి. రెడ్డి ఎంపిక చేయడం ఆమె అభినయానికి నిదర్శనం. లాహిరి లాహిరిలో పాటలో గుమ్మడితో కలిసి ఆమె నౌకా విహారం చేసే సన్నివేశం, ఆమె ముఖంలోని భావాలు చిరస్మరణీయం. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు వంటి అగ్ర హీరోల చిత్రాల్లో దాదాపు 200 సినిమాల్లో నటించి, తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరుచుకున్నారు. పిచ్చిపుల్లయ్యలో వితంతువు పాత్ర, పాండురంగ మహత్యంలో వేశ్యమాత పాత్ర ఆమె సినీ జీవితాన్ని మలుపు తిప్పాయి. ఎన్టీఆర్ ఆమెను ప్రోత్సహించి మంచి వేషాలు ఇచ్చారు.

1928లో గుంటూరు దగ్గరున్న వెంగళాయపాలెంలో జన్మించిన ఛాయాదేవి, తల్లిదండ్రులు చిన్నతనంలోనే మరణించడంతో చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్నారు. భర్త మరణంతో బాల్యంలోనే వితంతువు అయ్యారు. ఆర్థిక ఇబ్బందులు, తోబుట్టువుల నిర్లక్ష్యం ఆమెను కృంగదీశాయి. తన కాళ్ళ మీద తను నిలబడాలని నిర్ణయించుకొని భరతనాట్యం నేర్చుకొని ప్రదర్శనలు ఇచ్చారు. నాటకాల ద్వారా జీవనం సాగించారు. 14 ఏళ్ల వయసులో దీనబంధు చిత్రంతో సినీ ప్రవేశం చేసినా, అవకాశాలు దొరకక చిత్తూరు వి. నాగయ్య ఆఫీసులో వంట చేస్తూ ఐదేళ్లు గడిపారు. ఆ తర్వాత 1948లో సాయిబాబా చిత్రంతో తిరిగి నటనలోకి ప్రవేశించారు.

వ్యక్తిగత జీవితంలో పెళ్లి చేసుకోని ఛాయాదేవి, ఒక వ్యక్తితో కొంతకాలం సహజీవనం చేశారు. మహానటుడు ఎస్.వి. రంగారావుతో ఆమెకున్న స్నేహం గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉండేవి. మాంబళంలో పెద్ద ఇల్లు కట్టుకున్న ఛాయాదేవి, కష్టపడి సంపాదించిన డబ్బును వడ్డీలకు ఇచ్చేవారు. అయితే, 1974లో ఎస్.వి. రంగారావు మరణించడంతో ఆమెకు పెద్ద దిక్కు పోయినట్లయింది. ఇదే అదనుగా ఆమె దగ్గర అప్పులు తీసుకున్నవారు డబ్బు ఎగ్గొట్టారు. ఆమె ఉంటున్న ఇల్లు తమదేనంటూ ముగ్గురు వ్యక్తులు కోర్టుకు వెళ్ళడం ఛాయాదేవిని మరింత బాధించింది. ఆ సమయంలో పరిశ్రమ నుంచి ఎవరూ ఆమెకు అండగా నిలవలేదు. అనారోగ్యం, మధుమేహం వల్ల ఒక కాలు తీసేయాల్సి వచ్చింది. చివరికి తన సొంత ఇంట్లో మూడో వంతుకే ఆమె యజమానురాలని కోర్టు తీర్పు ఇవ్వడంతో తీవ్ర షాక్‌కు గురయ్యారు. 1983 సెప్టెంబర్ 4న ఆదరించే దిక్కులేక, అలమటిస్తూ కన్నుమూశారు. ఛాయాదేవి గొప్ప ప్రతిభావంతురాలు అయినప్పటికీ, సూర్యకాంతమ్మలా సూర్యప్రభతో వెలగలేక, తన పేరులోనే ఉన్నట్టుగా నీడలోనే నడవాల్సి వచ్చింది.

Loading...
Unable to load recommendations.
Follow Us