
తెలుగు సినీ చరిత్రలో కొందరు నటులు తమదైన ముద్ర వేసి, కాలాతీతంగా ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయారు. అలాంటి వారిలో హాస్యనటుడు కేవీ చలం ఒకరు. ఈ తరం ప్రేక్షకులకు ఆయన అంతగా పరిచయం లేకపోవచ్చు, కానీ ఆయన పోషించిన పాత్రలు, హాస్య చతురత, ప్రత్యేకమైన వ్యక్తిత్వం పరిశ్రమలో ఆయనకు అరుదైన గౌరవాన్ని సంపాదించి పెట్టాయి. కేవీ చలం నోటి వెంట వచ్చిన ప్రతి మాట జోకుగానే ఉండేది. ఎందరో మూడీ మనుషులకు ఆయన జోక్స్ ఓ టానిక్లా పనిచేసేవి. మనసు బాగోలేని ఆర్టిస్టులు, కాలక్షేపం కావాలనుకునే దర్శకులు ఆయన్ను ప్రత్యేకంగా పిలిపించుకుని జోక్స్ చెప్పించుకునేవారు. ముఖ్యంగా దాసరి నారాయణరావు, శోభన్ బాబు వంటి వారితో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉండేది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పక్కన ఉన్న చివటం గ్రామంలో పుట్టిన కేవీ చలం, విజయవాడ రేడియో స్టేషన్లో కొంతకాలం పనిచేశారు. అక్కడి నుంచి మద్రాస్ చేరి దాదాపు ఏడేళ్ల పాటు కష్టాలు పడి రంగస్థల నటుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో వచ్చిన తేనె మనసులు చిత్రంతో తెరపై నటుడిగా ప్రయాణం ప్రారంభించారు. ఈ చిత్రంలో ఇంగ్లీషును తెలుగులా మాట్లాడే మేనేజర్ పాత్రలో ఆయన నటనకు మంచి స్పందన లభించింది. కమ్ము హీరో వాట్ డు యు వాంట్ టు.. వంటి డైలాగులు జనంలోకి వెళ్ళాయి. అలాగే బందిపోటు దొంగలు చిత్రంలో మిస్టర్ అమెరికా వేషం కూడా అందరినీ అలరించింది.
తెరపై నవ్వులు పంచే కేవీ చలం, ఇంట్లో మాత్రం చాలా సీరియస్గా ఉండేవారు. అందరిలాగే ఆయనకూ ఇంటి బాధలు, భరించలేని ఆందోళనలు ఉండేవి. అయితే, గడప దాటి బయటకు వచ్చారంటే ఆ బాధలన్నీ స్విచ్ ఆఫ్ చేసి, ఆయనలోని హాస్య నటుడు బయటకు వచ్చేసేవాడు. దాసరి నారాయణరావు తీసిన పెద్ద ఇల్లు, చిన్న ఇల్లు సినిమాలో ఒకరికి అన్యాయం చేసి మరో ఇంటికి ప్రేమ చూపినట్లు, కేవీ చలం నిజ జీవితంలోనూ రెండు కుటుంబాలను కలిగి ఉండేవారు. ఇద్దరి భార్యలకు న్యాయం చేయడానికి ప్రయత్నించేవారు. ఇదే ఆయన జీవితంలో గొప్ప ఆందోళనకు కారణమైంది. కేవీ చలం హాస్యం కేవలం మాటలకే పరిమితం కాలేదు. ఆయనకు రకరకాల యాసల్లో మాట్లాడటం ఓ సరదా. మద్రాసులో ఇంటి అద్దె కోసం తిరుగుతున్నప్పుడు, ఇంటి యజమాని వచ్చి రాని తెలుగులో మాట్లాడే విధానాన్ని ఆయన బాగా గమనించారు. దాన్నే ప్రాక్టీస్ చేసి, అల్లూరి సీతారామరాజు చిత్రంలో సంతానం పిళ్లై పాత్రకు ఉపయోగించారు. “పెద్దసార్ వాడు ఆ ఫారెస్ట్ గార్డ్ వాడు నిండా కుక్క మాదిరి ఉంటాడో ఈ డివిజన్లో ఉండే ఆడవాండ్లో మగవాండ్లో సీతారామరాజు కాళ్ళ మీద పడి మొక్కుతాండ్లు సార్ వాడు” అంటూ ఆయన చెప్పిన డైలాగులు ఇప్పటికీ గుర్తుండిపోతాయి. శివరంజని చిత్రంలో తమిళ చిత్ర నిర్మాత పాత్రలో కూడా ఆయన బాగా నవ్వించారు. 1972 జూన్ 30న చివటంలో నరసమాంబతో ఆయన వివాహం జరిగింది. వారికి ఇద్దరు ఆడపిల్లలు, ఒక కొడుకు ఉన్నారు. రత్నకుమారి అనే మరో మహిళతోనూ ఆయన సహజీవనం చేసేవారు. రెండు ఇళ్ల మధ్య ఆయన జీవితం కొనసాగింది.
1980 డిసెంబర్ 5 రాత్రి, మాంబళం రైల్వే ట్రాక్ దాటుతుండగా రైలు ఢీ కొట్టడంతో కేవీ చలం దుర్మరణం పాలయ్యారు. మరణించే నాటికి ఆయన వయసు కేవలం 35 ఏళ్లు. రోజులాగే షూటింగ్కు రాని చలం గురించి దాసరి ఆరా తీయగా, ఆయన మరణవార్త తెలిసింది. ఈ విషయం తెలిసి దాసరి, శోభన్ బాబుతో సహా చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. మద్రాసులోని తెలుగు చిత్రాల షూటింగ్స్ ఆపేశారు. కేవీ చలం అంతిమయాత్రకు దాసరి, శోభన్ బాబు, మురళీమోహన్, మోహన్ బాబు, కైకాల సత్యనారాయణ, అల్లు రామలింగయ్య వంటి ప్రముఖులు హాజరయ్యారు. చాయాగ్రాహకుడు కేఎస్ మణి ఈ అంతిమయాత్రను చిత్రీకరించగా, దాసరి దర్శకత్వంలో రూపొందిన అద్దాల మేడ చిత్రం చివరలో ఆ దృశ్యాలను చేర్చారు. కేవీ చలం కుమార్తె దేవిని ఎమ్మెల్యే ఏడుకొండలు చిత్రంతో నటిగా పరిచయం చేశారు దాసరి. తన హాస్యంతో అందరినీ నవ్వించిన కేవీ చలం జీవితం మాత్రం విషాదంగా ముగిసింది.