
తెలుగు సినిమా చరిత్రను పరిశీలిస్తే ఎందరో అద్భుతమైన నటీమణులు మనల్ని అలరించారు. అయితే బాలీవుడ్ లెజెండ్ దేవానంద్ నటించిన మొట్టమొదటి సినిమా ‘హమ్ ఏక్ హై’ (1946) లో హీరోయిన్‌గా నటించింది ఒక తెలుగు నటి అనే విషయం చాలా మందికి తెలియదు. ఆమె అలనాటి మేటి నటి కమలా కొట్నీస్. బ్రిటీష్ అధికారికి, తెలుగు మహిళకు జన్మించిన కమల.. ఆ రోజుల్లోనే ఎంతో మోడ్రన్‌గా, స్వతంత్ర ఆలోచనలు కలిగిన మహిళగా పేరు తెచ్చుకున్నారు. తెలుగులో ‘భాగ్యలక్ష్మి’, ‘చెంచులక్ష్మి’, ‘చూడామణి’ వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో కమల నటించారు. తెలుగు చిత్రసీమలో ప్లేబ్యాక్ సింగింగ్ (నేపథ్య గానం) ప్రారంభమైన కొత్తలో.. రావు బాలసరస్వతి దేవి పాడిన మొట్టమొదటి పాట వెండితెరపై కమలా కొట్నీస్ పైనే చిత్రీకరించడం ఒక విశేషం. కేవలం నటనకే పరిమితం కాకుండా, ఆమె ఆ రోజుల్లోనే ఎంతో వేగంగా కార్లు, మోటార్ బైకులు నడిపేవారు. హార్స్ రైడింగ్, టెన్నిస్, స్పోర్ట్స్ కార్ రేసింగ్ లలో కూడా ఆమె పాల్గొనేవారు.
జీవితంలో ఎదురైన ఒడిదొడుకులు:
కమల కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు బాంబేకి చెందిన ప్రముఖ ఫోటోగ్రాఫర్ డి.ఎస్. కొట్నీస్ సోదరుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ 1949లో ఆమె భర్త ఆమె సంపాదన, నగలతో పారిపోవడంతో తీవ్ర నమ్మకద్రోహానికి గురయ్యారు. ఆ తర్వాత ఆ ‘కొట్నీస్’ అనే పేరును తీసేసి, చంద్రదేవ్ సింగ్ అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకున్నారు. అయితే 1967లో ఆయన కూడా ఒక ప్రమాదంలో సరస్సులో పడి చనిపోవడం ఆమె జీవితంలో పెద్ద విషాదం.
ఆ తర్వాత ఆమె ‘సతీ అహల్య’ అనే సినిమాను నిర్మించి భారీ నష్టాలను చవిచూశారు. జీవితంలో ఇన్ని కష్టాలు వచ్చినప్పటికీ ఆమె ఎంతో ధైర్యంగా ఎదురొడ్డి నిలిచారు. గ్లామర్ ప్రపంచంలో ఎంతో రాయల్‌గా బతికి, ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన కమలా కొట్నీస్ ప్రస్థానం నిజంగా విలక్షణం.
ఎక్కువమంది చదివినవి : Cinema : ఇదెక్కడి డిమాండ్ రా బాబూ.. ప్రేమ, ద్రోహం, ప్రతీకారం.. ఓటీటీలో దూసుకుపోతున్న వెబ్ సిరీస్..