
తెలుగు ప్రేక్షకులకు నటి స్నిగ్ధ నయని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తనదైన నటనతో, విభిన్నమైన హావభావాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆమె.. సినిమాల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ముఖ్యంగా ప్యాంట్, షర్ట్ వేసుకొని మగరాయుడిలా కనిపిస్తూ తనదైన శైలిలో నటించి మెప్పించారు. అయితే ఇటీవల ఆమెకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో ఆమె ఓ అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్లుగా కనిపించడంతో నెటిజన్లు రకరకాలుగా చర్చించుకున్నారు. తాజాగా ఈ వీడియోపై స్నిగ్ధ స్పందిస్తూ అసలు విషయం వెల్లడించారు. స్నిగ్ధ నయని అలా మొదలైంది సినిమాతో తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత మేం వయసుకు వచ్చాం, దమ్ము, ప్రేమ ఇష్క్ కాదల్, ‘చందమామ కథలు’, ‘టైగర్’, ‘కళ్యాణ వైభోగమే, ఓ బేబీ వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. తనకు వచ్చిన పాత్రల్లో ప్రత్యేకత చూపిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రస్తుతం సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినా, సింగర్‌గా పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
ఇటీవల స్నిగ్ధ నయని ఓ అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్లుగా ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఆమె నిజంగానే పెళ్లి చేసుకున్నారా? అంటూ చాలామంది ప్రశ్నలు లేవనెత్తారు. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె, ఆ వీడియో వెనుక ఉన్న అసలు విషయాన్ని వివరించారు. చిన్న చిన్న గొడవలకే ప్రేమలో ఉన్నవారు విడిపోతున్నారని, అలా చేయకుండా మంచి బంధాలను కాపాడుకోవాలనే సందేశంతో తాను ఓ రీల్ చేసినట్లు స్నిగ్ధ తెలిపారు. అందులో భాగంగానే ఓ అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్లు నటించానని చెప్పారు. అయితే ఆ వీడియోను చూసిన చాలామంది నిజంగానే తనకు పెళ్లయిపోయిందని భావిస్తున్నారని అన్నారు.
తన గురించి పూర్తిగా తెలిసిన బంధువులు సైతం ఫోన్ చేసి పెళ్లి చేసుకున్నావా.? మాకు ఎందుకు చెప్పలేదని అడుగుతున్నారని ఆమె వెల్లడించారు. మంచి సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో చేసిన వీడియో ఇలా వైరల్ అవుతుందని అనుకోలేదని తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో తన శరీరంలో కనిపించే కొన్ని మార్పుల గురించి మాట్లాడుతూ.. పీసీఓడీ కారణంగా రెండు మూడు నెలలకు ఒకసారి పీరియడ్స్ వస్తాయని స్నిగ్ధ వివరించారు. ముఖంపై అవాంఛిత రోమాలు రావడం కూడా చాలామంది మహిళల్లో కనిపించే సాధారణ సమస్యేనని పేర్కొన్నారు. ఇక పెళ్లి గురించి అడిగినప్పుడు స్నిగ్ధ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. తనకు మంచి మనసున్న వ్యక్తి దొరికితే తప్పకుండా పెళ్లి చేసుకుంటానని తెలిపారు. ఆ వ్యక్తి అమ్మాయా, అబ్బాయా అనే విషయంతో సంబంధం లేదని, తనకు మంచి తోడు కావడమే ముఖ్యమని చెప్పారు. అలాంటి వ్యక్తి దొరికితే పెళ్లి చేసుకుంటానని, లేదంటే సింగిల్‌గానే ఉంటానని స్పష్టం చేశారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.