సింగిల్ లైఫ్‌తో విసిగిపోయా.. పెళ్లిపై యంగ్ బ్యూటీ ఆసక్తికర కామెంట్స్

ప్రస్తుతం టాలీవుడ్‌లో యంగ్ హీరోయిన్స్ సందడి చేస్తున్నారు. కొత్త కొత్త అందాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నారు. ఇతర భాషల ముద్దుగుమ్మలు కాదు.. తెలుగమ్మాయిలు కూడా తమ నటనతో, అందంతో మంచి క్రేజ్ తెచ్చుకుంటున్నారు. అలాగే అవకాశాలు కూడా ఫుల్ గా వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓ ముద్దగుమ్మ హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుంది.

సింగిల్ లైఫ్‌తో విసిగిపోయా.. పెళ్లిపై యంగ్ బ్యూటీ ఆసక్తికర కామెంట్స్
Actress

Updated on: Oct 08, 2026 | 9:24 PM

టాలీవుడ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అయితే ఆమె కుమార్తె సుప్రీత నాయుడు కూడా సోషల్ మీడియా ద్వారా భారీగా పాపులారిటీ సంపాదించుకుంది. సినిమాల్లోకి పూర్తిస్థాయిలో ఎంట్రీ ఇవ్వకముందే తన గ్లామర్, స్టైల్, సోషల్ మీడియా కంటెంట్‌తో యూత్‌లో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. తల్లి సురేఖ వాణితో కలిసి సుప్రీత చేసే సందడి సోషల్ మీడియాలో ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటుంది. వీరిద్దరూ కలిసి వెకేషన్స్‌కు వెళ్లడం, ఫొటోషూట్స్ చేయడం, ట్రెండింగ్ పాటలకు రీల్స్ చేయడం వంటివి తరచూ నెట్టింట హాట్ టాపిక్‌గా మారుతుంటాయి. తల్లీకూతుళ్ల కంటే అక్కాచెల్లెళ్లలా కనిపిస్తారంటూ నెటిజన్లు కూడా కామెంట్స్ చేస్తుంటారు. సోషల్ మీడియాలో ఇప్పటికే మంచి ఫాలోయింగ్ ఉన్న సుప్రీత.. కవర్ సాంగ్స్, షార్ట్ ఫిల్మ్స్ వంటి వాటితో తన కెరీర్‌ను ప్రారంభించింది. తాజాగా బుల్లితెరపై కూడా తన సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది. ఇదిలా ఉంటే, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సుప్రీత తన వ్యక్తిగత జీవితం, ప్రేమ, పెళ్లి గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

యాంకర్ వర్ష హోస్ట్ చేస్తున్న ఓ కార్యక్రమంలో పాల్గొన్న సుప్రీత.. తన ప్రస్తుత రిలేషన్‌షిప్ స్టేటస్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది. తాను ప్రస్తుతం సింగిల్‌గానే ఉన్నానని చెప్పిన ఆమె.. ఒంటరి జీవితంతో కొంత బోర్‌గా అనిపిస్తోందని చెప్పుకొచ్చింది. అంతేకాదు, తనకు సరైన వ్యక్తి దొరకడం లేదంటూ తన పెళ్లి విషయాన్ని కూడా ప్రస్తావించింది. తనకు వెంటనే ఓ మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయాలని తల్లిని అడిగినట్లు సుప్రీత చెప్పింది. దీంతో పెళ్లి విషయంలో సుప్రీత ఎంత సీరియస్‌గా ఉందో అర్థమవుతోంది. అయితే తన కుమార్తె పెళ్లి విషయంలో సురేఖ వాణి మాత్రం అంతగా ఆసక్తి చూపడం లేదని సుప్రీత తెలిపింది. ప్రస్తుత కాలంలో పెళ్లిళ్ల తర్వాత ఎదురవుతున్న సమస్యలు, పెరుగుతున్న బ్రేకప్స్, విడాకుల కారణంగా తన తల్లి వివాహ వ్యవస్థపై కొంత ఆందోళనతో ఉన్నట్లు చెప్పింది.

అయితే తన విషయంలో మాత్రం అలాంటి భయం లేదని సుప్రీత స్పష్టం చేసింది. పెళ్లి తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వాటిని ధైర్యంగా ఎదుర్కొనే సత్తా తనకు ఉందని చెప్పింది. అంతేకాదు.. పెళ్లి తర్వాత తన భర్తను తన కంట్రోల్‌లోనే ఉంచుకుంటానంటూ సరదాగా చేసిన వ్యాఖ్యలు ఇంటర్వ్యూలో నవ్వులు పూయించాయి. ఇక సినిమాల విషయానికి వస్తే.. సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినప్పటికీ సుప్రీత ప్రస్తుతం వెండితెర కంటే బుల్లితెరపై ఎక్కువగా దృష్టి పెడుతోంది. టెలివిజన్ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలనే ప్రయత్నంలో ఉంది. మొత్తానికి సుప్రీత చేసిన పెళ్లి వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తనకు పెళ్లిపై ఉన్న ఆసక్తిని ఆమె ఓపెన్‌గా చెప్పడంతో.. సురేఖ వాణి కుమార్తెకు పెళ్లి ఎప్పుడు జరుగుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us