Tollywood: ఆ స్టార్ హీరోకు పెద్ద ఫ్యాన్.. కానీ అప్పుడు నన్ను అలా అనేసరికి షాకయ్యా..

నటుడు సురేష్ తన సినీ ప్రస్థానం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తోటి నటుల మధ్య ఆరోగ్యకరమైన పోటీని, పాత్రల ఎంపికలో స్క్రీన్ టైమ్ కన్నా ప్రాధాన్యతను వివరించారు. చిరంజీవితో తన తొలి పరిచయం, కలిసి పనిచేసిన అనుభవాలు, అలాగే విలన్ పాత్రల్లో నటిస్తున్నప్పుడు ఎదురైన సవాళ్లను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

Tollywood: ఆ స్టార్ హీరోకు పెద్ద ఫ్యాన్.. కానీ అప్పుడు నన్ను అలా అనేసరికి షాకయ్యా..
Actor Suresh

Updated on: May 09, 2026 | 1:43 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు లవర్ బాయ్‌గా, యాక్షన్ హీరోగా వెలిగిపోయిన నటుడు సురేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సుదీర్ఘ సినీ ప్రస్థానంలో వందలాది చిత్రాల్లో నటించిన ఆయన, తాజాగా తన కెరీర్‌లోని ఆసక్తికర మలుపులను, మెగాస్టార్ చిరంజీవితో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. అప్పటి తరం నటుల మధ్య పోటీ ఎలా ఉండేది? విలన్ పాత్రలు చేసేటప్పుడు ఎదురైన ఇబ్బందులేంటి? వంటి అంశాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సురేష్ తన తోటి నటులైన సుమన్, భానుచందర్, వినోద్ కుమార్ లాంటివారితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. “మా మధ్య పోటీ ఉండేది కానీ, అది చాలా ఆరోగ్యకరంగా ఉండేది. ఎవరికి ఎక్కువ స్క్రీన్ టైమ్ ఉంది? ఎవరికి ఎక్కువ సీన్లు ఉన్నాయి? అని మేము ఎప్పుడూ ఆలోచించలేదు. కేవలం కథలో మా పాత్రకు ఉన్న ప్రాముఖ్యత, నటనకు ఉన్న స్కోప్ మాత్రమే చూసేవాళ్లం” అని ఆయన స్పష్టం చేశారు. అయితే, కేవలం సపోర్టింగ్ క్యారెక్టర్ల పేరుతో తమ ఇమేజ్‌ను వాడుకోవాలని చూసే దర్శకులను మాత్రం తాము దూరం పెట్టేవారమని కుండబద్దలు కొట్టారు.

ఇది చదవండి: ఆ టైంలో చిరంజీవి కంటే ఎక్కువ హిట్స్ నాకే ఉన్నాయ్.. కానీ ఆయన ఏం చేశాడంటే.!

‘పరువు ప్రతిష్ట’ సినిమాలో సుమన్‌తో కలిసి నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేయడం వెనుక ఉన్న కథను సురేష్ వివరించారు. “దర్శకుడు గుహనాథన్ ఆ పాత్ర గురించి చెప్పినప్పుడు నాకు చాలా స్ఫూర్తినిచ్చింది. సినిమాలో మనం ఎంతసేపు కనిపిస్తామనేది ముఖ్యం కాదు, ఉన్నంత సేపు ఎంత ప్రభావం చూపామనేదే ముఖ్యం అని ఆయన అనేవారు. తండ్రి గుర్తింపు లేని ఒక రెబెల్ యువకుడిగా ఆ పాత్రలో నటనకు చాలా ఆస్కారం ఉంది. అందుకే స్క్రీన్ టైమ్ గురించి ఆలోచించకుండా ఆ సినిమా చేశాను” అని సురేష్ తెలిపారు. చిరంజీవి అంటే తనకు మొదటి నుంచి అమితమైన ఇష్టమని సురేష్ చెప్పారు. ఒక కమర్షియల్ హీరో అంటే ఎలా ఉండాలో ఆయన ప్రపంచానికి చూపించారని కొనియాడారు. ‘ఇద్దరు మిత్రులు’ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక మధుర జ్ఞాపకాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. “విజయవాహిని స్టూడియోలో నా డాన్స్ చూసి చిరంజీవి స్వయంగా వచ్చి అభినందించారు. ఆయనను మొదటిసారి దగ్గరగా చూసినప్పుడు ఒక కొండను చూసిన అనుభూతి కలిగింది. ఆయన అంత పెద్ద స్టార్ అయ్యుండి, నన్ను ప్రోత్సహించిన తీరు చూసి ఆశ్చర్యపోయాను” అని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఒక సీన్‌లో సురేష్ తన స్టైల్‌గా ‘టచక్’ అనే పదాన్ని వాడాలనుకున్నారట. అది చిరంజీవికి ఎంతగా నచ్చిందంటే, ఆ సినిమాలో ప్రతి సీన్‌లో సురేష్ ఆ పదాన్ని వాడేలా స్వయంగా చిరంజీవి ప్రోత్సహించారట. తోటి నటుడు కొత్తగా ఏదైనా చేస్తే స్వాగతించే గొప్ప గుణం చిరంజీవి సొంతమని సురేష్ ప్రశంసించారు. నెగటివ్ పాత్రలు చేసేటప్పుడు నటులు ఎదుర్కొనే ఇబ్బందుల గురించి చెబుతూ శివాజీ గణేషన్ చెప్పిన ఒక సామెతను సురేష్ ప్రస్తావించారు. ‘తునై’ అనే తమిళ చిత్రంలో లెజెండరీ యాక్టర్ శివాజీ గణేషన్‌ను సురేష్ తోసివేయాల్సి ఉంటుంది. అప్పుడు సురేష్ వెనుకాడగా.. శివాజీ గణేషన్ జోక్యం చేసుకుని, “మనం కుక్క వేషం వేసినప్పుడు మొరగక తప్పదు నాయనా.. పాత్రకు న్యాయం చేయాలంటే మొహమాటాలు ఉండకూడదు” అని ధైర్యం చెప్పారట. అయితే ఈ విలన్ ఇమేజ్ వల్ల చిక్కులు కూడా ఎదురయ్యాయి. ‘సూర్యుడు’ సినిమా విడుదలైన తర్వాత రాజమండ్రి వెళ్ళినప్పుడు, అక్కడి ప్రజలు తన పాత్రను చూసి నిజంగానే తిట్టారని ఆయన గుర్తు చేసుకున్నారు. తనకు హీరో ఇమేజ్ అనే బేషజాలు లేవని, నటుడిగా సంతృప్తినిచ్చే ఏ పాత్రనైనా చేస్తానని సురేష్ ముగించారు.

ఇది చదవండి: 40కిపైగా సినిమాలు.. స్టార్ హీరో అవ్వాల్సినోడు.. చివరికి కమెడియన్‌గా మిగిలిపోయాడు..

Follow Us