Pandu Master: నువ్వు డ్యాన్సర్ మాత్రమే కాదు ఫైటర్ కూడా.. మళ్లీ మంచి రోజులు వస్తాయ్ పండు..

విశాఖ జిల్లా ఆనందపురం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన డ్యాన్స్ మాస్టర్ పండు ప్రస్తుతం కోలుకుంటున్నారు. రెండు కాళ్లకు విజయవంతంగా సర్జరీలు పూర్తికాగా, ఆరు నెలల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. మరోవైపు పండు మాస్టర్ ఆరోగ్య పరిస్థితిపై ఫ్యాన్స్ వర్రీ అవుతున్నారు.

Pandu Master: నువ్వు డ్యాన్సర్ మాత్రమే కాదు ఫైటర్ కూడా.. మళ్లీ మంచి రోజులు వస్తాయ్ పండు..
Pandu Master

Updated on: Jun 05, 2026 | 3:20 PM

విశాఖ జిల్లా ఆనందపురం వద్ద మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో డ్యాన్స్ మాస్టర్‌ పండు (జి.షణ్ముఖ)కు తీవ్ర గాయాలయిన విషయం తెలిసిందే. దీంతో డాక్టర్లు ఆయన రెండు కాళ్లకు సర్జరీ చేశారు. ప్రస్తుతం పండు మాస్టర్ కోలుకుంటున్నారు. ఆరు నెలల వరకు పూర్తి విశ్రాంతి తీసుకుంటే త్వరగా కోలుకుంటారని డాక్టర్లు తెలిపారు. అద్భుతమైన డ్యాన్సర్ అయిన పండు మాస్టర్‌కు ఈ రకమైన యాక్సిడెంట్ అవ్వడం చూస్తే విధి ఎంత బలీయమైనదో అర్థం అవుతుంది. అతను కాళ్లలో రాడ్లు వేసిన పరిస్థితి ఉంది. ఆయన కోలుకున్నాక అయినా ఇంతకు మందులా ఫ్లోర్ స్టెప్పులు, ప్లిఫ్ మూమెంట్స్ వంటివి వేయాలంటే ఆచి తూచి వ్యవహరించాల్సిందే. కానీ పండు మాస్టర్ ఈ పరిస్థితి నుంచి బయటపడి కచ్చితంగా గొప్ప స్థాయికి వెళ్తారు. ఎందుకంటే అతను డ్యాన్సర్ మాత్రమే కాదు.. రియల్ లైఫ్ ఫైటర్.

చిన్న వయసులోనే అమ్మను కోల్పోయి, అనేక కష్టాలను చూసిన పండు మాస్టర్, బీటెక్ చదువు కోసం చెన్నై వెళ్లినప్పుడు జీవిత పాఠాలను నేర్చుకున్నారు. ఒకానొక దశలో, సబ్బు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితిని ఎదుర్కొన్నారు. మామగారు కుటుంబ పోషణ భారం మోస్తున్నారని గ్రహించి, చదువు పక్కన పెట్టి తన అభిరుచి అయిన డ్యాన్స్‌ను కెరీర్‌గా ఎంచుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ రోజు తీసుకున్న ఆ నిర్ణయం ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది.

డ్యాన్స్ రంగంలో తొలుత బ్యాగ్రౌండ్‌లో ఆడిన పండు, ధైర్యం చేసి ఒక సోలో పోటీలో పాల్గొన్నారు. సౌత్‌లోనే పెద్దదైన ఆ పోటీలో రూ. 3,000 ప్రైజ్ మనీ గెలిచి, అందులో రూ. 2,000తో కొత్త షూ కొనుక్కున్నారు. ఆ ఒక్క షూతో ఆయన దాదాపు 30 డ్యాన్స్ పోటీల్లో విజయం సాధించారు. ఈ విజయ పరంపరతో ఆయన చేతిలో రూ. 1,20,000 ప్రైజ్ మనీ సమకూరింది. ఆ తర్వాత చెన్నైలో జరిగిన ఒక రియాలిటీ షోలో కంటెస్టెంట్‌గా పాల్గొని, బెస్ట్ ఎంటర్‌టైనర్ టైటిల్‌ను, ప్రభుదేవ చేతుల మీదుగా లక్ష రూపాయల నగదు బహుమతిని అందుకున్నారు.

విజయం సాధించిన తర్వాత కూడా పండు మాస్టర్ తన తోటివారికి సహాయం చేయడంలో ముందున్నారు. తన అసిస్టెంట్లు శ్రావణ్, శివకు అవకాశాలు లభించనప్పుడు, వారికి ధైర్యం చెప్పి, సరైన వ్యక్తులకు సిఫార్సు చేసి, వారిని కొరియోగ్రాఫర్లుగా ఎదగడానికి తోడ్పడ్డారు. సక్సెస్ అనేది స్వయంకృషితోనే వస్తుందని, ఇతరులపై ఆధారపడకూడదని ఆయన గట్టిగా నమ్ముతారు.

నకిలీస్ గొలుసు పాట అద్భుత విజయం సాధించినప్పటికీ, దాని క్రెడిట్ తనకే దక్కాలని పండు మాస్టర్ ఎప్పుడూ కోరుకోలేదు. ఆ పాట సక్సెస్‌తో చిత్ర బృందం, మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె, దుర్గారావు వంటి వారు ఆనందించడమే తనకు ముఖ్యమని, అందుకే ఎలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వలేదని ఆయన గతంలో వెల్లడించారు. టాలెంట్ ఉంటే అవకాశాలు అవే వస్తాయని, డబ్బులిచ్చి అవకాశాలను కొనుగోలు చేయకూడదని ఆయన యువతకు సందేశం ఇచ్చారు. తన జీవితంలో ఎదురైన కష్టాలే తనను ముందుకు నడిపించే స్ఫూర్తి అని, ఆ సవాళ్లే తనను బలంగా మార్చాయని పండు మాస్టర్ అన్నారు.

పండు మాస్టర్‌కు యాక్సిడెంట్ జరిగిందన్న వార్త విని అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఈ పరిస్థితిని అదనుగా చేసుకుని, కొందరు ఆయన ఆరోగ్యంపై తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ అవాస్తవాలు అభిమానులలో మరింత భయాందోళనలను సృష్టించాయి. ఈ నేపథ్యంలో ఢీ హోస్ట్, నటుడు నందు స్వయంగా నిజనిజాలను ఎంక్వైరీ చేసి నెటిజన్లతో పంచుకున్నారు.

యాక్టర్ నందు ఇచ్చిన అప్‌డేట్ ప్రకారం, పండు మాస్టర్‌కు రెండు సర్జరీలు విజయవంతంగా పూర్తయ్యాయి. వైద్యులు అత్యంత నైపుణ్యంతో ఈ శస్త్రచికిత్సలను నిర్వహించారని, వాటి ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నాయని నందు తెలిపారు. పండు మాస్టర్ ఆరోగ్యానికి ఎటువంటి ప్రమాదం లేదని, కొన్ని వారాల్లోనే ఆయన పూర్తిగా కోలుకుని, మళ్లీ అందరినీ అలరించడానికి తిరిగి వస్తారని వైద్యులు స్పష్టం చేశారని నందు వెల్లడించారు. “పండు మాస్టర్ హెల్త్ కి ఎటువంటి డేంజర్ లేదు” అని ఆయన బలంగా చెప్పారు.

పండు మాస్టర్ శారీరకంగా కోలుకోవడంతో పాటు, మానసికంగా కూడా ఎంతో దృఢంగా ఉన్నారని నందు ప్రశంసించారు. నిజానికి, ఆయన్ను పరామర్శించడానికి వెళ్ళిన వారిని, సర్జరీకి ముందు, “టీలు, కాఫీలు తాగారా, టిఫిన్లు ఏమన్నా తినండి” అని పండు మాస్టరే అడిగారని నందు తెలిపారు. ఆయనకు జరిగిన రెండు సర్జరీలు విజయవంతమయ్యాయని, ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదని, ఆరోగ్యానికి ఎటువంటి ముప్పు లేదని నందు వెల్లడించారు.

Follow Us