Megastar Chiranjeevi Birthday: స్వయం కృషితో ‘విజేత’గా ఎదిగిన సుప్రీం హీరో.. మెగాస్టార్‏గా మారిన సామాన్యుడు..

|

Aug 22, 2022 | 8:49 AM

బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో హీరోగా ఎదగాలనే ఎంతోమంది యువతరానికి ఆదర్శంగా నిలిచారు చిరు. ఆయన స్పూర్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నటీనటులుగా సక్సెస్ అయినవారు అనేకం.

Megastar Chiranjeevi Birthday: స్వయం కృషితో విజేతగా ఎదిగిన సుప్రీం హీరో.. మెగాస్టార్‏గా మారిన సామాన్యుడు..
Chiranjeevi
Follow us on

మెగాస్టార్ చిరంజీవి.. కేవలం ఓ పేరు కాదు..బ్రాండ్. సినీ పరిశ్రమలో ఎంతో మంది నటీనటులకు ఆయనే ఆదర్శం. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టి.. టాలీవుడ్ ఇండస్ట్రీకి మెగాస్టార్ అయ్యారు (Megastar Chiranjeevi). నటుడిగా మొదలుపెట్టి స్టార్‏గా మారిన చిరు సినీ ప్రయాణం అంత సాఫీగా సాగలేదు. ఎన్నో అడ్డంకులు.. ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. అవమానాలను భరించి స్వయంకృషితో అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. టాలెంట్ ఉంటే సాధించలేనిది ఏది లేదని నిరూపించారు. తన నటన.. డ్యాన్స్‏తో సినీప్రియులను అలరించి సుప్రీం హీరో అనే అరుదైన గౌరవం సొంతం చేసుకున్నారు. మాస్ యాక్షన్, తనదైన కామెడీతో తెలుగు ప్రేక్షకుల మనసులలో నిలిచిపోయారు. అదిరిపోయే స్టెప్పులతో కుర్రకారును ఆకట్టుకున్నారు. ఎన్నో సవాల్లు అధిగమించి ఉన్నతస్థాయికి చేరుకున్నారు. బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో హీరోగా ఎదగాలనే ఎంతోమంది యువతరానికి ఆదర్శంగా నిలిచారు చిరు. ఆయన స్పూర్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నటీనటులుగా సక్సెస్ అయినవారు అనేకం. తమ జీవితంలో ఒక్కసారైన చిరును కలవాలని ఎదురుచూసే నటీనటులు.. ఆయన చిత్రానికి దర్శకత్వం వహించాలని ఆసక్తిగా చూసే దర్శకులు మరేందరో. నటనే కాకుండా సామాజిక సేవలో తనవంతు బాధ్యతను నిర్వహిస్తూ అభిమానులకు అన్నయ్యగా మారిన మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు నేడు (ఆగస్ట్ 22)

1955 ఆగస్ట్ 22న పశ్చిమ గోదావరి జిల్లా మొగుల్తూర్ గ్రామంలో కొణిదెల వెంకట్రావ్, అంజనా దేవి దంపతులకు ప్రథమ సంతానంగా జన్మించారు చిరంజీవి. ఆయన అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్. నటనపై ఉన్న ఆసక్తితో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే పరిశ్రమలోకి అడుగుపెట్టి ముందు ముందు చిన్న చిన్న పాత్రలు చేశారు. ఆ తర్వాత ప్రతినాయకుడిగా మెప్పించి.. హీరోగా అవకాశాలు అందుకున్నారు. బ్రేక్ డ్యాన్స్‏తో కుర్రకారును ఉర్రుతలూగించారు.

1978లో పునాది రాళ్లు చిత్రంతో ఆయన నటజీవితం ప్రారంభమైంది. కానీ ఈ సినిమా కంటే ముందే ప్రాణం ఖరీదు మూవీ రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత వచ్చిన స్వయం కృషి చిత్రం ఆయన కెరీర్‏ను మలుపు తిప్పింది. శుభలేఖ, ఖైదీ, సంఘర్షణ, ఛాలెంజ్, హీరో, దొంగ, జ్వాల, కొండవీటి రాజా, రాక్షసుడు, రుద్రవీణ, చంటబ్బాయి వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. ఆయన నటించిన రుద్రవీణలోని నమ్మకు నమ్మకు ఈరేయిని కమ్ముకు వచ్చిన ఈ మాయని అనే పాట చిరుకు ఆల్ టైమ్ ఫెవరేట్. అంతేకాకుండా ఆయనకు ఫోటోగ్రఫి అంటే చాలా ఇష్టమట. సమయం దొరికినప్పుడల్లా ప్రకృతి అందాలను తన కెమెరాలో బంధిస్తుంటారు.

అలాగే 1992లో వచ్చిన అపద్భాంధవుడు సినిమాకు మొదటిసారి అత్యధిక పారితోషికం తీసుకున్నాడు. దాదాపు రూ. 1.25 కోట్లు తీసుకున్నాడట. 2006లో సీఎన్ఎన్. ఐబిఎన్ నిర్వహించిన సర్వేలో తెలుగు చిత్రపరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటుడిగా గుర్తింపు పొందారు. కెరీర్ తొలినాళ్లలో సుప్రీం హీరోగా పేరొందిన చిరంజీవి, ఆ తర్వాత మెగాస్టార్ గా క్రేజ్ సంపాదించుకున్నాడు. మరణ మృదంగ సినిమా తర్వాత నిర్మాత కేఎస్ రామారావు చిరుకు మెగాస్టార్ అనే బిరుదు ఇచ్చారు. ఓవైపు సినిమాలు చేస్తూ.. మరోవైపు 1998లో అక్టోబర్ 2న చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించాడు. ఆ తర్వాత చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ట్రస్టులను ప్రారంభించారు. ఇక 2008 ఆగస్ట్ 26న స్వయంగా ప్రజారాజ్యం అనే పార్టీని ఆవిష్కరించి రాజకీయ ప్రవేశం చేశారు. 2009లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ 295 స్థానాలకు పోటి చేయగా 18 స్థానాలను గెలుచింది.

2013 నుంచి ఇండస్ట్రీలోకి ఖైదీ 150 సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు చిరు. దాదాపు పది సంవత్సరాల తర్వాత వెండితెరపై సందడి చేసిన చిరు.. ఆతర్వాత వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం గాడ్ ఫాదర్, భోళా శంకర్, వాల్తేరు వీరయ్య చిత్రాల్లో నటిస్తున్నారు. తెలుగు చిత్రపరిశ్రమలో మొదటి మాస్ అండ్ యాక్షన్ హీరో చిరునే. అంతేకాకుండా ఇండస్ట్రీకి బ్రేక్ డ్యాన్స్ పరిచయం చేసి అదిరిపోయే స్టెప్పులతో ప్రేక్షకులను ఆకట్టుకున్న మొదటి హీరో చిరునే అనడంలో సందేహం లేదు.