
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నారు. పవన్ సాధినేని దర్శకత్వంలో ఆయన నటించిన “ఆకాశంలో ఒక తార” మూవీ రీసెంట్ గానే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో సాత్విక వీరవల్లి హీరోయిన్ గా నటించగా.. శృతిహాసన్, రుహాని శర్మ కీలకపాత్రలు పోషించారు. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్బాక్స్ మీడియా బ్యానర్లపై నిర్మించిన ఈ మూవీ ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ దక్కించుకుంది.
కాగా స్ఫూర్తిదాయకమైన కథాంశంతో వచ్చిన ఈ చిత్రంలో.. దుల్కర్ నటన నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. భార్యకు అండగా నిలబడిన ఒక భర్తగా మర్చిపోలేని పర్ఫామెన్స్తో అదరగొట్టారు. అలానే సాత్విక తన సహజ నటనతో పాత్రకు ప్రాణం పోసింది. శ్రుతి, రుహానీ సైతం తమ పాత్రలకు పూర్తి న్యాయం చేయడంతో ప్రేక్షకులతో పాటు విమర్శకులను సైతం మెప్పించింది. ఈ క్రమంలోనే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సైతం సినిమా బృందాన్ని తన ఇంటికి ఆహ్వానించి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది.
తెలుగులో ఏదైనా సినిమా మంచి సక్సెస్ సాధిస్తే.. చిన్న మూవీ, పెద్ద మూవీ అనే తారతమ్యం లేకుండా అభినందించే వారిలో మెగాస్టార్ ముందుంటారు. ఇప్పుడు కూడా అదే ఆనవాయితీని కొనసాగిస్తూ “ఆకాశంలో ఒక తార” మూవీ ప్రధాన నటీనటులతో పాటు నిర్మాత స్వప్న దత్ కూడా చిరంజీవిని కలిశారు. చిరు ఇంట్లో ఈ సమావేశం జరగ్గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైతం వారిని సాదరంగా ఆహ్వానించి కంగ్రాట్స్ తెలియజేశారు. కాగా ఈ విషయాన్ని ‘ఆకాశమంత విజయం.. ఆకాశమంత అభినందన’ అంటూ చిత్ర యూనిట్ షేర్ చేసింది.
మరోవైపు రామ్ చరణ్ – సుకుమార్ కాంబినేషన్లో RC 17 తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్ కొట్టిన వీరి కాంబోలో మళ్లీ మూవీ వస్తుండడంతో అనౌన్స్ మెంట్ నుంచే భారీ అంచనాలు నెలకున్నాయి. కాగా ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే సాత్విక ఈ మూవీలో నటించబోతున్నారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే విషయం గురించి సాత్విక స్పందిస్తూ తాను ఈ సినిమా ఆడిషన్ కి వెళ్లినట్టు తెలిపారు. కానీ తనని కన్ఫర్మ్ చేశారా లేదా అనే విషయం మాత్రం తెలియదని ఓపెన్ అయ్యారు. మరి చరణ్ కి జోడిగా సాత్విక కనిపిస్తారా లేదా అనేది తెలియాలంటే అఫిషియల్ అనౌన్స్ మెంట్ వరకు వేచి చూడాల్సిందే.