
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు సినిమాలతో పాటు కళల పట్ల కూడా ప్రత్యేక ఆసక్తి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రముఖ చిత్రకారుడు తోట వైకుంఠం రూపొందించిన ఓ అరుదైన కళాఖండాన్ని తారక్ తన సొంతం చేసుకున్నారు. సాధారణంగా అందుబాటులో ఉండే పెయింటింగ్ కాకుండా.. తన అభిరుచికి అనుగుణంగా ప్రత్యేకంగా ఓ ఒరిజినల్ పెయింటింగ్‌ను తయారు చేయించుకున్నట్లు సమాచారం. ప్రముఖ చిత్రకారుడు తోట వైకుంఠం తనదైన ప్రత్యేక శైలితో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా తెలంగాణ గ్రామీణ జీవనశైలి, సంప్రదాయాలు, పల్లెటూరి మనుషుల రూపాలను తన చిత్రాల్లో అద్భుతంగా ఆవిష్కరిస్తుంటారు. ఆయన వేసే చిత్రాలకు కళాభిమానుల్లో మంచి ఆదరణ ఉంది.
అలాంటి కళాకారుడితో ఎన్టీఆర్ ప్రత్యేకంగా ఓ పెయింటింగ్ రూపొందించుకోవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తారక్ కోరిక మేరకు తోట వైకుంఠం ఈ ఒరిజినల్ పెయింటింగ్‌ను ప్రత్యేకంగా రూపొందించినట్లు తెలుస్తోంది. పెయింటింగ్ పూర్తయిన అనంతరం చిత్రకారుడు స్వయంగా ఎన్టీఆర్ నివాసానికి వెళ్లి దానిని అందజేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ తనకు నచ్చిన కళాఖండాన్ని సొంతం చేసుకోవడం విశేషంగా నిలిచింది.
మొత్తానికి సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఎన్టీఆర్.. మరోవైపు విలువైన కళాఖండాలపై తనకున్న ఆసక్తిని చాటుకున్నారు. ప్రముఖ చిత్రకారుడి చేతుల మీదుగా ప్రత్యేకంగా రూపొందిన ఈ పెయింటింగ్ ఇప్పుడు సినీ, కళాభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అలాగే తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు తారక్. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లోనూ ఓ సినిమాలో నటిస్తున్నారు ఎన్టీఆర్. త్వరలోనే ఈ సినిమాల నుంచి వరుసగా అప్డేట్స్ రానున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి