
సీనియర్ నటుడు, నిర్మాత జీవీ నారాయణరావు తమ సుదీర్ఘ సినీ ప్రస్థానాన్ని, మెగాస్టార్ చిరంజీవితో ఉన్న అనుబంధాన్ని ఓ ఇంటర్వ్యూలో వివరించారు. చిరంజీవితో నారాయణరావు నటించిన తొలి చిత్రం కుక్క కాటుకి చెప్పు దెబ్బ. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి నటించిన చట్టానికి కళ్ళు లేవు సినిమా అద్భుత విజయం సాధించింది. ఈ సినిమాను పూర్ణచంద్రరావు నిర్మించగా, హిందీలో అంధా కానూన్ పేరుతో రీమేక్ చేశారు. ఇందులో నారాయణరావు పోషించిన క్యారెక్టర్‌ను అమితాబ్ బచ్చన్ చేయగా, చిరంజీవి క్యారెక్టర్‌ను రజనీకాంత్ పోషించారు. తన పాత్ర నచ్చడంతోనే అమితాబ్ హీరో పాత్రను కాదని, తన క్యారెక్టర్‌ను ఎంచుకున్నారని నారాయణరావు గుర్తు చేసుకున్నారు.
నారాయణరావు తన తల్లి పేరున దమయంతి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్‌ను స్థాపించి దేవాంతకుడు చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ద్వారానే చిరంజీవి, విజయశాంతి తొలిసారిగా జంటగా నటించారు. ఇందులో నారాయణరావుదే లీడ్ క్యారెక్టర్ అని తెలిపారు. దేవాంతకుడు విజయవంతమయ్యాక, చిరంజీవి తన సినిమాలకు సబ్జెక్టులు చూసే బాధ్యతను నారాయణరావుకు అప్పగించారట. అనంతరం, యముడికి మొగుడు చిత్రాన్ని సుధాకర్, హరిప్రసాద్‌లతో కలిసి ముగ్గురు భాగస్వాములుగా నిర్మించారు. సుధాకర్, హరిప్రసాద్‌లకు నిర్మాణ అనుభవం లేకపోవడంతో, చిరంజీవే స్వయంగా నారాయణరావును ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామి కావాలని కోరారు.
నారాయణరావు కుటుంబానికి మొదటి నుంచీ సినిమా ఇండస్ట్రీతో సంబంధం ఉంది. ఆయన తండ్రి దుర్గా ప్రసాదరావు, జె.డి. ప్రసాదరావుగా ప్రసిద్ధి చెందారు, పెద్ద డిస్ట్రిబ్యూటర్. నవయుగ ఫిల్మ్స్, నవయుగ విడుదల వంటి సంస్థలు వారివే. అంతేకాకుండా, ఆయన తండ్రి సారథి స్టూడియోస్‌కు మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. నారాయణరావు బావ గారపాటి సాంబశివరావు, త్రిమూర్తి ప్రొడక్షన్స్ పతాకంపై కృష్ణతో కలిసి 13 సినిమాలు నిర్మించారు. ఆయన తండ్రి అన్నదమ్ముల సవాల్, ఇద్దరూ అసాధ్యులే వంటి చిత్రాలను నిర్మించారు, ఇందులో కృష్ణ, రజనీకాంత్ కలిసి నటించారు.