Twist: టాలీవుడ్‌లో సరికొత్త సక్సెస్ మంత్ర.. కథలను మలుపు తిప్పే ‘ట్విస్టుల’ ట్రెండ్..!

అనగనగా ఒక కథ.. అందులో ఎవరూ ఊహించని ఒక మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఇప్పుడు మన టాలీవుడ్‌లో నడుస్తున్న సరికొత్త సక్సెస్ ఫార్ములా ఇదే. కథను అమాంతం మలుపు తిప్పేలా ఒక అదిరిపోయే ట్విస్ట్ రాసుకుని, ఆ తర్వాతే దానికి ముందు వెనుక కథలు అల్లుకుంటున్నారేమో అనిపించేలా ఇప్పటి సినిమాలు వస్తున్నాయి.

Twist: టాలీవుడ్‌లో సరికొత్త సక్సెస్ మంత్ర.. కథలను మలుపు తిప్పే ట్విస్టుల ట్రెండ్..!
Tollywood

Edited By:

Updated on: Jul 27, 2026 | 11:53 AM

ప్రస్తుత ఇండస్ట్రీ సిట్యువేషన్ చూస్తుంటే, చిన్న బడ్జెట్ సినిమాల హీరోల నుంచి పాన్ ఇండియా స్థాయి స్టార్ల వరకు అందరూ ఇదే దారిలో ప్రయాణిస్తున్నారు. కథలో ఒక బలమైన మెలిక ఉంటే చాలు, ప్రేక్షకులు ఖచ్చితంగా థ్రిల్ ఫీల్ అవుతారనేది డైరెక్టర్ల గట్టి నమ్మకం. తెలుగు సినిమాల్లో క్లైమాక్స్ ట్విస్ట్ అనగానే సగటు ప్రేక్షకుడికి ముందుగా గుర్తొచ్చే సినిమా ‘పోకిరి’. దర్శకుడు పూరీ జగన్నాథ్ అప్పటి వరకు మహేష్ బాబును ఒక అల్లరి చిల్లరి పోకిరిగా, మాఫియా గ్యాంగ్‌లో ఒకడిగా చూపించి.. క్లైమాక్స్‌లో అతను కృష్ణ మనోహర్ ఐపీఎస్ అంటూ ఇచ్చిన ట్విస్ట్‌కు థియేటర్లలో ప్రేక్షకుల బుర్రలు గిర్రున తిరిగిపోయాయి.

ఆ ఒక్క ట్విస్ట్ అప్పట్లో టాలీవుడ్ రికార్డులన్నింటినీ షేక్ చేసింది. తెలుగు సినిమాకు 40 కోట్ల షేర్ అందుకునేలా చేసింది. అయితే సరిగ్గా పోకిరి తరహాలో హీరో ఐడెంటిటీని దాచిపెట్టి క్లైమాక్స్‌లో రివీల్ చేసే ట్విస్ట్ 1984లో చిరంజీవి నటించిన ‘రుస్తుం’ సినిమాలో కూడా ఉండటం విశేషం. ఇక రీసెంట్ టైమ్స్‌లో ట్విస్ట్ అనగానే అందరికీ ‘ఉప్పెన’ సినిమానే ముందుగా గుర్తుకొస్తుంది. హీరో పాత్రకు సంబంధించి ఆ సినిమాలో ఇచ్చిన మేజర్ మెలిక ఎంతలా వర్కవుట్ అయ్యిందంటే.. ఈ ట్విస్ట్ మీద గత కొన్నేళ్లలో వచ్చినన్ని మీమ్స్ మరే సినిమాపై రాలేదు. ఆ ఒక్క ముగింపుతో సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడమే కాకుండా, ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ఇక అదే దర్శకుడు బుచ్చిబాబు రీసెంట్‌గా రామ్ చరణ్ లాంటి గ్లోబల్ స్టార్‌తో చేసిన ‘పెద్ది’ సినిమాలో కూడా మరో అదిరిపోయే ట్విస్ట్ రాసుకున్నారు.

హీరో రామ్ చరణ్ కాలు తీసేయడం అనేది ఈ సినిమాలో అతిపెద్ద ట్విస్ట్. ఇది చూసిన మీమర్స్ ఏకంగా బుచ్చిబాబుకు ‘కట్టింగ్ మాస్టర్’ అనే బిరుదు కూడా ఇచ్చేశారు. తన తర్వాతి సినిమాలో ఏ హీరోకి ఏం కట్ చేస్తాడో అంటూ సోషల్ మీడియాలో తెగ ఛలోక్తులు పేలుస్తున్నారు. కొత్త తరం హీరోలు సైతం ట్విస్టులనే నమ్ముకుని హిట్లు కొడుతున్నారు. కిరణ్ అబ్బవరం కెరీర్‌కు గట్టి పునాది వేసిన ‘క’ సినిమా మొత్తం ఒకే ఒక్క ట్విస్ట్ చుట్టూ తిరుగుతుంది. సినిమా అంతా ఒకెత్తు అయితే, చివరి రెండు నిమిషాలు మరో ఎత్తు. అప్పటి వరకు జరిగిన కథ అంతా అమ్మ కడుపులో నుంచి జరుగుతోందని తెలిసిన తర్వాత ఆడియన్స్ షాక్ అవ్వడం ఖాయం. ‘క’ భారీ విజయంలో ఆ ట్విస్ట్‌దే కీలక పాత్ర.

ఇక అఖిల్ నటించిన ‘లెనిన్’ సినిమాలో హీరోనే హీరోయిన్‌ని చంపేస్తాడనే ఊహించని మలుపు చుట్టూ డైరెక్టర్ మురళీ కిషోర్ కథను నడిపించారు. కాకపోతే ఇదే ట్విస్ట్ పాతికేళ్ళ కింద బాలయ్య నటించిన కృష్ణబాబు సినిమాలో ఉంటుంది. అందులో కూడా సేమ్ టూ సేమ్ హీరో కళ్లలో విలన్ కారం కొడతాడు.. తెలియకుండా హీరోయిన్ మీనాను హీరో బాలయ్యే చంపేస్తాడు. అదే ట్విస్ట్ లెనిన్ సినిమాలోనూ ఉంటుంది. పైగా క్లైమాక్స్‌లో హీరోకు కళ్లు తీసేయడం కూడా మరో ట్విస్ట్. ఇది కూడా బాగానే వర్కవుట్ అయింది. ‘దివానా’ సినిమాలో అయితే హీరోయిన్‌కు కాళ్లు లేవు అనే అతిపెద్ద నిజాన్ని ఇంటర్వెల్ తర్వాతే రివీల్ చేసి ప్రేక్షకుల సానుభూతిని గెలుచుకున్నారు. తాజాగా వచ్చిన కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్ స్టోరీ’లోనూ ఇంటర్వెల్ ట్విస్టే సినిమాకు ప్రాణంగా నిలిచింది. కళ్లు చెదిరిపోయే, చెమర్చే ట్విస్ట్ ఇంటర్వెల్‌కే ఇచ్చేసాడు దర్శకుడు రవి నంబూరి. అదే సినిమాకు హెల్ప్ అవుతుంది కూడా.

కథలో ట్విస్టులు ఉన్న ప్రతీసారి సినిమా హిట్ అవ్వాలని రూల్ లేదు.. కానీ కొన్ని ఫ్లాప్ సినిమాల్లోని మలుపులు కూడా ఆడియన్స్‌కు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఉదాహరణకు సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన మహేష్ బాబు ‘1 నేనొక్కడినే’ సినిమా. ఇందులో అసలు మనం చూస్తున్నది నిజమా కాదా, హీరో భ్రమలో ఉన్నాడా అనే సైకలాజికల్ ట్విస్టులతోనే సినిమా అంతా సాగుతుంది. అప్పట్లో వడ్డే నవీన్ నటించిన ‘నా ఊపిరి’, గోపీచంద్ ‘ఒంటరి’ సినిమాల్లోనూ హీరోకు ఇలాంటి మానసిక సమస్యతో ముడిపడిన ట్విస్టులే ఉంటాయి. అలాగే జ్యోతికృష్ణ తెరకెక్కించిన ‘ఆక్సీజన్’ సినిమాలో శత్రువుల మధ్యనే వాళ్లలో ఒకడిగా ఉంటూ గోపీచంద్ పగ తీర్చుకునే సీన్ రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తుంది. ఇక కళ్యాణ్ రామ్ నటించిన ‘ఓం’ సినిమాలో అయితే, అప్పటి వరకు చూసిన కథను మొత్తం తలకిందులు చేస్తూ క్లైమాక్స్‌లో వచ్చే నెక్స్ట్ లెవెల్ ట్విస్ట్ ప్రేక్షకులను ఇప్పటికీ ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. మొత్తానికి ట్విస్టుల చుట్టూ అలా తిరుగుతుందిప్పుడు మన టాలీవుడ్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Follow Us