
తెలుగు సినీ ప్రేక్షకులకు కమెడియన్ అలీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తనదైన కామెడీ టైమింగ్, విభిన్నమైన హావభావాలతో దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు ఆయన. బాలనటుడిగా కెరీర్ ప్రారంభించి, కమెడియన్‌గా స్టార్‌డమ్ సంపాదించి, ఆ తర్వాత హీరోగానూ సత్తా చాటిన అలీ సినీ ప్రయాణం చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే ఆయన జీవితంలో జరిగిన ఒక ఆసక్తికరమైన సంఘటన ఆయన సంపాదించుకున్న గుర్తింపునకు, స్టార్‌డమ్‌కు నిదర్శనంగా నిలుస్తుంది. అప్పటివరకు కమెడియన్‌గా నవ్విస్తున్న అలీని హీరోగా పరిచయం చేస్తూ దర్శకుడు ఎస్.వి. కృష్ణారెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘యమలీల’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించడమే కాకుండా, అలీకి హీరోగా ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. ఆ తర్వాత వచ్చిన ‘ఘటోత్కచుడు’ వంటి చిత్రాలు కూడా మంచి విజయం సాధించడంతో అలీ ఇమేజ్ ఒక్కసారిగా మారిపోయింది.
సినిమాల్లో పెరిగిన క్రేజ్ అలీ సొంత ఇంట్లోనూ సరదా మార్పులకు కారణమైందట. యమలీల సినిమాకు ముందు వరకు కొడుకును ‘ఏరా’, ‘ఒరేయ్’ అని పిలిచే ఆయన తండ్రి, ఆ చిత్రం విజయం తర్వాత మాట్లాడే విధానాన్ని పూర్తిగా మార్చేసుకున్నారట. ఓ ఇంటర్వ్యూలో అలీ ఈ విషయాలను గుర్తుచేసుకుంటూ యమలీల హిట్ అయ్యాక తన తండ్రి తనను ‘ఏమండీ అలీ గారూ’ అని ఎంతో గౌరవంగా పిలవడం మొదలుపెట్టారని చెప్పారు. “ఏంటి నాన్న అలా పిలుస్తున్నారు?” అని అడిగితే.. “మిమ్మల్ని చూస్తుంటే భయమేస్తుందండీ” అని ఆయన తండ్రి వినయంగా సమాధానం ఇచ్చేవారట. తండ్రి మాటలకు తనకు నవ్వు వచ్చేదని అలీ సరదాగా పంచుకున్నారు.
అలీ మొత్తంగా 1200లకు పైగా సినిమాల్లో నటించారు. ఇటీవల సినిమాల స్పీడ్ తగ్గించిన అలీ.. ఇప్పుడు అడపదడపా సినిమాలు చేస్తున్నారు. అలాగే టీవీ షోల్లోనూ పాల్గొంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు ఈ స్టార్ కమెడియన్. అలీ ప్రస్తుతం మౌళి హీరోగా నటిస్తున్న దొంగనాకొడకు అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకులు ముందుకు రానుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి