ఆడిషన్‌కు పిలిచి అవసరం లేదని అన్నారు.. సినిమా నుంచి తీసేశారనుకుని బాధపడ్డ హీరోయిన్.!

టాలీవుడ్‌లో మొదటిసారి ఆడిషన్ చేసిన అనుభవాన్ని పంచుకుంది ఓ యంగ్ హీరోయిన్ గతంలో ఆమె ఓ సినిమా సినిమా సక్సెస్ మీట్ లో ఆమె ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ మూవీ కోసం తనకు 2024 ఏప్రిల్‌లో ప్రొడక్షన్ నుంచి కాల్ వచ్చిందని చెప్పింది.

ఆడిషన్‌కు పిలిచి అవసరం లేదని అన్నారు.. సినిమా నుంచి తీసేశారనుకుని బాధపడ్డ హీరోయిన్.!
Actress

Updated on: Oct 16, 2026 | 9:20 PM

టాలీవుడ్‌లో అవకాశాలు దక్కించుకోవడం, ఇక్కడి ప్రేక్షకులకు దగ్గరవడం ఇతర భాషల నుంచి వచ్చే నటీనటులకు అంత సులభమైన విషయం కాదు. ముఖ్యంగా తెలుగు భాష తెలియని సమయంలో ఆడిషన్స్‌కు హాజరవడం, కొత్త వాతావరణానికి అలవాటు పడటం కొంత సవాలుతో కూడుకున్నదే. తాజాగా హీరోయిన్ అనశ్వర రాజన్ తన టాలీవుడ్ ఎంట్రీకి సంబంధించిన ఓ ఆసక్తికరమైన అనుభవాన్ని పంచుకుంది. ఛాంపియన్ సినిమా కోసం తొలిసారి ఆడిషన్‌కు వెళ్లినప్పుడు జరిగిన సంఘటనలను గుర్తుచేసుకుంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఛాంపియన్ సినిమా కోసం 2024 ఏప్రిల్‌లో చిత్ర నిర్మాణ సంస్థ నుంచి తనకు ఫోన్ వచ్చిందని అనశ్వర రాజన్ వెల్లడించింది. ఆ తర్వాత లుక్ టెస్ట్ నిర్వహించారని, అందుకోసం తాను హాఫ్ శారీ ధరించి వెళ్లినట్లు తెలిపింది.

అక్కడ నిర్మాత సాయి, కో-డైరెక్టర్ తనకు కొన్ని డైలాగ్స్ ఉన్న స్క్రిప్ట్ ఇచ్చి రిహార్సల్స్ చేయమని సూచించారట. అయితే తనకు తెలుగు భాష రాదని అనశ్వర చెప్పడంతో, ఇంగ్లీష్‌లోనే డైలాగ్స్ చెప్పవచ్చని వారు భరోసా ఇచ్చారట. దీంతో ఆమె అక్కడే డైలాగ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఆడిషన్‌కు సిద్ధమైంది. దర్శకుడు ప్రదీప్ అద్వైతం కూడా అక్కడే ఉన్నారని ఆమె గుర్తుచేసుకుంది. అనశ్వర డైలాగ్స్ సిద్ధం చేసుకుంటున్న సమయంలో స్వప్న దత్ అక్కడికి వచ్చి ఆమెను చూసి ఓకే అని చెప్పి వెళ్లిపోయారట. ఆ తర్వాత దర్శకుడు ప్రదీప్ అద్వైతం, నిర్మాత సాయి సహా అక్కడున్నవారంతా వెళ్లిపోయారు. కొద్దిసేపటికి నిర్మాత సాయి మళ్లీ వచ్చి, ఆడిషన్ అవసరం లేదని, ఇక డైలాగ్స్ చెప్పాల్సిన పని లేదని చెప్పారట. దీంతో అనశ్వర ఒక్కసారిగా అయోమయానికి గురైందట. అసలు ఏమైందో అర్థం కాక, తనను ఎంపిక చేయలేదేమోనని అనుకుందట.

సినిమా నుంచి తనను తప్పించేశారని, ఇక ఇంటికి వెళ్లిపోవచ్చని భావించినట్లు తెలిపింది. తాను పదేపదే కారణం అడిగినా, నిర్మాత మాత్రం ఆడిషన్ అవసరం లేదని చెబుతూనే ఉన్నారట. మొదట్లో జరిగిన ఈ పరిణామాలతో తన తొలి ఆడిషన్ విఫలమైందని అనశ్వర రాజన్ భావించిందట. అయితే అసలు విషయం తెలిసిన తర్వాత ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తనను తిరస్కరించారని అనుకున్న సమయంలోనే, ఆడిషన్ చేయాల్సిన అవసరం లేకుండా తాను ఎంపికైనట్లు తెలుసుకోవడం ఎంతో సంతోషాన్నిచ్చిందని ఆమె వెల్లడించింది. మలయాళ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న అనశ్వర రాజన్, తెలుగు సినిమాతో ప్రేక్షకులకు మరింత చేరువయ్యే ప్రయత్నం చేసింది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..

Loading...
Unable to load recommendations.
Follow Us