ఆ స్టార్ హీరోని నేను సరదాగా అలా పిలుస్తాను.. వాళ్లంతా నా పిల్లలే: నటి సుధ

నటి సుధ మురారి చిత్ర నిర్మాణ అనుభవాలను పంచుకున్నారు. మహేష్ బాబు సెట్‌లో అందరితో సరదాగా ఎలా మాట్లాడేవారో, జోకులు వేస్తూ నవ్వించేవారని వివరించారు. తోటి నటులతో ఒక కుటుంబం వాతావరణం నెలకొందని, మహేష్ బాబును తన పిల్లల్లో ఒకడిగా చూస్తానని సుధ ఈ ఇంటర్వ్యూలో తెలిపారు.

ఆ స్టార్ హీరోని నేను సరదాగా అలా పిలుస్తాను.. వాళ్లంతా నా పిల్లలే: నటి సుధ
Sudha

Updated on: Oct 25, 2026 | 9:42 AM

నటి సుధ, మురారి చిత్ర నిర్మాణ సమయంలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో తన అనుభవాలను, సెట్‌లో నెలకొన్న అపురూపమైన వాతావరణాన్ని ఓ పాడ్‌కాస్ట్‌లో పంచుకున్నారు. కృష్ణవంశీ వంటి పర్టిక్యులర్ దర్శకుడితో పనిచేసేటప్పుడు, తాను అప్పటికే తెలుగు స్పష్టంగా మాట్లాడేవారా.? అని అడిగిన ప్రశ్నకు, మురారి చిత్రీకరణ ఒక పిక్నిక్ లాగా జరిగిందని సుధ సంతోషంగా గుర్తుచేసుకున్నారు. ఆ చిత్రం నాయిడుగారి స్టూడియోలో, పెద్ద మండప హౌస్‌లో చిత్రకరించారని ఆమె తెలిపారు. ఆ రోజుల్లో ఒక కఠినమైన నియమం ఉండేదని, సెట్ లోపల మొబైల్ ఫోన్‌లు అనుమతించేవారు కాదని సుధ వివరించారు. మొబైల్ బయట ఒక మనిషికి అప్పగించి లోపలికి వెళ్లాల్సి ఉండేదట. ఈ నిబంధన వెనుక ఉన్న కారణం, పనిపై డిస్ట్రాక్షన్ లేకుండా, అనుకున్న సమయంలో చిత్రీకరణను పూర్తి చేయాలనేదేనని ఆమె అన్నారు. ఇప్పుడున్న సౌకర్యవంతమైన వ్యాన్టీ వ్యాన్‌లు అప్పుడు లేవని, మేకప్ రూమ్‌కు వెళ్లాల్సి వచ్చేదని సుధ చెప్పారు.

లంచ్ టైమ్‌లో అందరూ కలిసిమెలిసి ఉండే సంస్కృతిని సుధ వివరించారు. సెట్‌లో ఒక కార్నర్లో ఉన్న చెట్టు కింద అన్నపూర్ణమ్మ, మారుతీరావు, కైకాల సత్యనారాయణ, లక్ష్మి వంటి సీనియర్ నటులతో పాటు తాను, ఇతర నటులు కూర్చునేవారమని ఆమె తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి నుంచి తెచ్చిన వంటకాలను ఒకరికొకరు పంచుకుంటూ, మాట్లాడుకుంటూ గడిపేవారట. ఈ అనుభవం వల్ల సీనియర్, జూనియర్ అనే భేదం లేకుండా అందరూ ఒకే చోట కూర్చొని కలిసిపోయేవారని, వారి క్యారెక్టర్లు మరింత ఫ్రీగా, కంఫర్ట్ జోన్‌లో ఉండి ఎలివేట్ అయ్యేవని సుధ పేర్కొన్నారు. అప్పుడప్పుడూ మహేష్ బాబు (అప్పుడు ఆయనకు ప్రస్తుత స్టార్‌డమ్ లేకపోయినా, హీరోగానే ఉన్నప్పటికీ ) వారి వద్దకు వచ్చి సరదాగా ఆటపట్టించేవారట. “ఏంటి మీరు మాత్రం కూర్చొని మాట్లాడుతున్నారు? ఈ ఆడవాళ్ళందరూ కలిసి ఏం మాట్లాడుతారో.?” అంటూ టీజ్ చేసేవారని సుధ గుర్తు చేసుకున్నారు.

అప్పట్లో ఆయన అంత సౌండ్ లేకుండా చాలా సరదాగా ఉండే వారని తెలిపారు. దూకుడు సినిమా సమయంలో కూడా మహేష్ బాబు తనను ఏడిపించేవారని, “ఈమె కావాలని సెటైర్లు వేసి వెళ్లిపోతుంది” అని అనేవారని సుధ నవ్వుతూ చెప్పారు. నటులతో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని సుధ వెల్లడించారు. మిగతా వారందరూ మహేష్‌ను మహేష్ లేదా మహేష్ బాబు గారు అని పిలిస్తే, తాను మాత్రం మహి అనే పిలుస్తానని అన్నారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్‌ను తారక్ అని, నాగార్జునను నాగ్ అని పిలుస్తానని చెప్పారు. “ఎందుకంటే నాకు వాళ్లు వేరేవాళ్ళు అని అనిపించరు. నా పిల్లలు, నా బ్రదర్స్, నా వాళ్ళు” అని సుధ ఆత్మీయంగా పేర్కొన్నారు. ఒకసారి నాగార్జున “నువ్వు పిన్ని పాత్రలు చేస్తుంటే అమ్మ అని పిలవలేకపోతున్నానే” అని సరదాగా అన్నారని, తమ మధ్య అలాంటి ఇంటిమసీ, కుటుంబ అనుబంధం ఉన్నందువల్లే అంత సరదాగా పనిచేశామని సుధ స్పష్టం చేశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us