
అంజాజీపేట మ్యారేజ్ బ్యాండు సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది శివానీ నగరం. అంతకు ముందు పలు షార్ట్స్ ఫిల్మ్స్ లో నటించిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఆమె నటించిన రెండో సినిమా లిటిల్ హార్ట్స్ సూపర్ హిట్ గా నిలిచింది. ఇందులో శివానీ పోషించిన కాత్యాయని పాత్ర బాగా హైలెట్ అయ్యింది. ఇక లేటెస్ట్ గా హే బలవంత్ అనే సినిమాతో మరోసారి ఆడియెన్స్ ను పలకరించిన ఈ అందాల తార ఇటీవల అనుకోకుండా ఓ వివాదంలో చిక్కుకుంది. తిరుమలలో తనకు 15 నిమిషాల పాటు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించారని ఓ ఇంటర్వ్యూలో శివానీ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. దీనిపై సామాన్య భక్తుల నుంచి కూడా విమర్శలు వచ్చాయి. దీంతో ఈ వివాదంపై క్లారిటీ ఇస్తూ మరో వీడియోను రిలీజ్ చేసింది శివాని.
‘ కొన్నిరోజుల క్రితం ఓ యూట్యూబ్ ఛానెల్‌కి నేను ఇంటర్వ్యూ ఇచ్చాను. నా ఛైల్డ్ హుడ్ జర్నీ, సినిమా కెరీర్ తో పాటు భక్తి, ఆధ్యాత్మికతకు సంబంధించి చాలా విషయాలు అందులో మాట్లాడాను. అందులో భాగంగానే కేదార్నాథ్, రామకోటి రాయడం, షిరిడి, తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయాల గురించి మాట్లాడాను. కానీ అందులో కేవలంనేను తిరుమలలో 15 నిముషాలు దర్శనం తీసుకున్నాను అని చెప్పింది మాత్రమే హైలెట్ అవుతుంది. దానికి క్లారిటీ ఇవ్వడానికి నేను ఈ వీడియో చేస్తున్నా. 2025 అక్టోబర్ లో 10,500 రూపాయలు కట్టి శ్రీవాణి దర్శనం టికెట్స్ నేను మా అమ్మ లైన్లో నిల్చొని తీసుకున్నాం. ఆ తర్వాత శ్రీవారి దర్శనం చేసుకున్నాం. తిరుమల ఆలయంలో క్యూ లైన్‌లో మొదటి నుంచి స్వామి దగ్గరకు వెళ్లేంత వరకు కొంచెం కొంచెం స్వామి వారు కనిపిస్తుంటారు. నేను ఆ సమయం ఆ మొత్తం 15 నిమిషాలు ఉంటుందని అంచనాతో అలా చెప్పాను. అంతే కానీ 15 నిముషాలు నన్ను ఎవరూ టచ్ చేయలేదు అని కాదు’
‘ నేను చాలా సార్లు రూ.300 టికెట్ తీసుకుని కుటుంబంతో కలిసి తిరుమల వెళతాను. అప్పుడు కేవలం 5 సెకన్ల పాటు స్వామిని చూస్తాను. నా జీవితంలో తొలిసారి 13 ఏళ్ల తర్వాత స్వామిని అంత సమీపం నుంచి చూశాను. ఇది నేను ఎంతో సంతోషంగా భావించి ఆత్రుతతో ఆ విషయాన్ని పంచుకున్నాను అంతే. అయితే అది కొంచెం మిస్ లీడింగ్‌గా వెళ్తోంది. నాకే కాదు మీలో ఎవరైనా సరే శ్రీవాణి దర్శనం టికెట్ తీసుకొని వెళ్తే కచ్చితంగా స్వామివారి దర్శనం దగ్గరగా, చాలా మంచిగా జరుగుతుంది. నాలాగే మీరు కూడా మంచి అనుభూతి చెందుతారు. దీనిపై క్లారిటీ ఇవ్వాలి అనేది నా బాధ్యత. ఇది నా టికెట్’ అంటూ తన శ్రీవాణి దర్శనం టికెట్ కూడా చూపించింది శివాని. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.