ఆ క్యారెక్టర్ వల్ల జనాలు దగ్గరికి వచ్చి మాట్లాడటానికి భయపడ్డారు.. నేనే నమ్మలేకపోయా: రఘుబాబు

నటుడు రఘుబాబు తన సినీ ప్రస్థానం, ముఖ్యంగా ఓ సినిమాకు సంబంధించిన కీలక విషయాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. కెరీర్ ఆరంభం నుంచి ఆ సినిమా విజయం, ఆ తర్వాత వచ్చిన అనూహ్య సవాళ్లను ఆయన వివరించారు. అలాగే అదే సినిమాలో తన పాత్ర ప్రేక్షకులను భయపెట్టిందని అన్నారు.

ఆ క్యారెక్టర్ వల్ల జనాలు దగ్గరికి వచ్చి మాట్లాడటానికి భయపడ్డారు.. నేనే నమ్మలేకపోయా: రఘుబాబు
Raghu Babu

Updated on: Nov 19, 2026 | 12:21 PM

ప్రముఖ నటుడు రఘుబాబు తన కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన మురారి సినిమా ఆడిషన్, షూటింగ్‌ల గురించి గతంలో ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. ఒకరోజు, ఎన్. రాఘవేంద్రరావు గారి మేనేజర్ రాంప్రసాద్‌ నుంచి రఘుబాబుకు ఫోన్ వచ్చింది. కృష్ణవంశీ దర్శకత్వంలో, మహేష్ బాబు హీరోగా, సోనాలీ బింద్రే హీరోయిన్‌గా, రాఘవేంద్రరావు గారు నిర్మాతగా ఒక భారీ చిత్రం రూపొందుతోందని, దాని కోసం డేట్స్ కావాలని రాంప్రసాద్‌ అడిగాడు. మొదట రఘుబాబు ఈ ఫోన్‌కాల్‌ను అనుమానించారు. “వీడెవడో మాకు వేస్తున్నాడు” అని భావించి, రామువేనా అని నేరుగా అడిగారు. రాంప్రసాద్‌ తన నంబర్ చెప్పి, మళ్లీ కాల్ చేయమని కోరగా, రఘుబాబు తిరిగి ఫోన్ చేసి మాట్లాడి నిజమని నిర్ధారించుకున్నారట. అప్పట్లో మొబైల్ ఫోన్లు లేకపోవడంతో ల్యాండ్ లైన్ ద్వారానే ఈమాట్లాడటం జరిగింది. రాంప్రసాద్‌ ఫోన్ తీయగానే రఘుబాబుకు కొంత నమ్మకం కుదిరింది. “కృష్ణవంశీ గారు నన్ను పిలిచారా.? నా క్యారెక్టరా.? ఏంటి కృష్ణవంశీ గారు నన్ను పిలవడం.?” అని లోలోపల ఆశ్చర్యపోయారట. మరుసటి రోజు ఆడిషన్ కోసం కృష్ణానగర్‌లోని కమలాపురి కాలనీలో ఉన్న ఆఫీస్ కు వెళ్లారు. అక్కడ చిన్న, పెద్ద ఆర్టిస్టులు వందల సంఖ్యలో ఆడిషన్స్ కోసం గుమిగూడి ఉన్నారు. వాహనాలతో ఆ ప్రాంతం సందడిగా మారింది. రఘుబాబు లోపలికి వెళ్లి రాంప్రసాద్‌ను కలవగా, ఆయన వెంటనే డైరెక్టర్‌ కృష్ణవంశీ గారికి సమాచారం అందించారు. నిమిషం వ్యవధిలోనే రఘుబాబును లోపలికి పిలిచారట కృష్ణవంశీ.

కృష్ణవంశీ గారు రఘుబాబును అలా చూస్తూ కూర్చున్నారట. “ఏంటి సార్, సిగ్గేస్తుంది సార్, అలా చూస్తున్నారు నన్ను” అని రఘుబాబు అనగా, కృష్ణవంశీ “ఏంటయ్యా, అమ్మాయిలనా చూడాలి? నిన్ను ఎవడు కొడతా?” అని సరదాగా బదులిచ్చారట. “ఒక మంచి క్యారెక్టర్ ఉంది, పెద్ద ఎక్కువ సీన్లు ఉండవు, మూడు నాలుగు సీన్లు ఉంటాయి, చేస్తావా?” అని కృష్ణవంశీ అడిగారట. రఘుబాబు వెంటనే “సార్, తను చెప్పిందంతా నిజమేనండి” అని అన్నారు. కృష్ణవంశీ “ఎందుకు డౌట్ వస్తుంది నీకు.? మహేష్ బాబు గారే హీరో, సోనాలీ బింద్రే గారే హీరోయిన్, మిగతా క్యాస్టింగ్ మొత్తం పెద్ద పెద్దోళ్లు” అని వివరించారు. లక్ష్మి గారి దగ్గర నుంచి నాగబాబు గారు సహా అందరూ పెద్ద నటీనటులు ఉన్నారని తెలిపారు. అప్పటికి రఘుబాబుకు తన బుర్ర సరిగా పనిచేయలేదని, ఒక ట్రాన్సిట్ లో ఉన్నానని పేర్కొన్నారు. “మీ డైరెక్షన్‌లో రెండు సీన్లు చేసినా చాలు సార్” అని రఘుబాబు అనగా, కృష్ణవంశీ “నేను నాలుగు సీన్లు  అంటుంటే, నువ్వు రెండు సీన్లు అంటావేంటి?” అని సరదాగా అడిగారు. హెయిర్‌కట్ చేయించుకు రమ్మని చెప్పగా, రఘుబాబు అలాగే చేశారు.

మురారి సినిమా షూటింగ్ దాదాపు 35 రోజుల పాటు జరిగింది. ఆ సినిమా సెట్ ప్రతిరోజు ఒక ఉత్సవంలా, జాతరలా ఉండేది. దాదాపు 20-30 కార్లలో ప్రతిరోజు నటీనటులను పికప్ చేసేవారని, సినిమా మొత్తం కుటుంబ సభ్యులతో నిండి ఉందని, ఏనుగు కూడా ఉందని రఘుబాబు వివరించారు. నానక్రామ్‌గూడ స్టూడియోలో ప్యాలెస్ సెట్ వేసి, అక్కడ షూటింగ్ జరిగిందని గుర్తు చేసుకున్నారు. అప్పట్లో స్వర్గస్తులైన లక్ష్మీపతి గారు రఘుబాబును చూసి, “నువ్వు డేట్స్ చూసుకోవడానికి ఒక మేనేజర్ ని పెట్టుకోవాలి” అని తరచుగా అనేవారని, ఇప్పుడు నీకు మేనేజర్ ని పెట్టుకునే టైం వచ్చిందని చెప్పేవారని రఘుబాబు గుర్తు చేసుకున్నారు. మురారి సినిమా పెద్ద విజయం సాధించింది. సినిమా విడుదలైన తర్వాత రెండు మూడు నెలల వరకు రఘుబాబుకు ఎవరూ కాల్ చేయలేదు. థియేటర్‌కు వెళ్లి ప్రేక్షకులతో పాటు సినిమా చూసినప్పుడు, తన పాత్ర వచ్చినప్పుడు ప్రేక్షకుల రియాక్షన్ ఎలా ఉందో గమనించారట. చాలామంది చాలా సీరియస్‌గా చూసేవారని, బయటకు వచ్చినప్పుడు కూడా “ఏయ్!” అని పిలిచేవారే తప్ప, దగ్గరికి వచ్చి పలకరించేవారు కాదని రఘుబాబు అన్నారు. మొదట దీనిని అర్థం చేసుకోలేకపోయినా, తర్వాత తన పాత్ర అంత ఇంపాక్ట్ ఇచ్చిందని, జనం తనను చూసి భయపడేంతగా ఆ క్యారెక్టర్ ప్రభావం చూపిందని తెలుసుకున్నారట. తన క్యారెక్టరైజేషన్ దెబ్బ వల్లనే ప్రేక్షకులు దగ్గరికి వచ్చి మాట్లాడటానికి భయపడ్డారని రఘుబాబు వివరించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us