దిగ్గజ దర్శకుడు, నిర్మాత వీబీ రాజేంద్ర ప్రసాద్ వారసుడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు జగపతిబాబు. అయితే తండ్రిలా కాకుండా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అనతికాలంలోనే తన అభినయంతో టాప్ హీరోల్లో ఒకరిగా పేరు పొందాడు. ముఖ్యంగా కుటుంబ కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయారు. మావిడాకులు, శుభలగ్నం, ఆయనకు ఇద్దరు, పెళ్లిపీటలు, మనోహరం, బడ్జెట్ పద్మనాభం తదితర కుటుంబ కథా చిత్రాలు ఆయన కెరీర్లో ఉన్నాయి. ఇక సెకెండ్ ఇన్నింగ్స్‌లోనూ జెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్నారు జగ్గూభాయ్. 2014లో బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన ‘లెజెండ్’ సినిమా జగపతి బాబుతో జాతకం పూర్తిగా మారిపోయింది. ఆ చిత్రంలో ఆయన పోషించిన పవర్ ఫుల్ విలన్ పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. విలన్‌గా, తండ్రిగా, సపోర్టింగ్ రోల్స్‌తో మెప్పిస్తోన్న జగ్గూభాయ్ తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో వరుస సినిమాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన జగపతి బాబు.. ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్‌కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అలాగే జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. రాజకీయలోకి వెళ్లిన నటుల్లో పవన్ అంటే అభిమానమని పేర్కొన్నారు జగ్గూభాయ్.
‘నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం రాజకీయలతో సంబంధం ఉన్న నటుల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే నాకు ఇష్టం. నాకు నచ్చిన హీరో అని కాకుండా రాజకీయాల్లోకి వెళ్లిన నటుల్లో ఇష్టమైన వ్యక్తి అంటే పవన్ కల్యాణ్. అలాగే నాకు ఇష్టమైన హీరోయిన్ సౌందర్య. ఇక విలన్ పాత్రలో నటించిన హీరోయిన్లలో రమ్యకృష్ణ అంటే ఇష్టం. అలాగే ఇష్టమైన పాటల విషయానికి వస్తే.. పెద్దరికం సినిమాలో ‘ప్రియతమా!’ అనే సాంగ్ ఇష్టం’ అని జగపతిబాబు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..