
టాలీవుడ్లో ఒకప్పుడు వరుస బ్లాక్‌బస్టర్ విజయాలతో స్టార్ డైరెక్టర్‌గా ఓ వెలుగు వెలిగారు జయంత్ సి పరాన్జీ. ‘ప్రేమించుకుందాం రా’, ‘బావగారు బాగున్నారా’, ‘ప్రేమంటే ఇదేరా’ వంటి హ్యాట్రిక్ హిట్లతో బాక్సాఫీస్ వద్ద తనదైన ముద్ర వేశారు. అయితే ఆ తర్వాత ఆయన తెరకెక్కించిన చిత్రాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. దీంతో సినిమాల వేగాన్ని తగ్గించిన జయంత్, గతంలో ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ జర్నీ, మొదటి ఫ్లాప్, అలాగే బాలీవుడ్ అందాల తార ఐశ్వర్య రాయ్‌తో ఉన్న అనుబంధం గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆయన చేసిన ఆ వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వరుసగా మూడు హిట్ సినిమాల పేర్లలో ‘రా’ అక్షరం ఉండటంతో, జయంత్ ఆ సెంటిమెంట్ ఫాలో అవుతున్నారని అప్పట్లో ప్రచారం జరిగింది. దీనిపై ఆయన స్పందిస్తూ.. అది కేవలం యాదృచ్ఛికమే తప్ప ఎలాంటి సెంటిమెంట్ లేదని స్పష్టం చేశారు. వరుసగా మూడు భారీ విజయాలు అందుకున్నా తానెప్పుడూ విజయాన్ని తలకెక్కించుకోలేదని, తన దృష్టి ఎప్పుడూ తర్వాతి ప్రాజెక్టును మెరుగ్గా తీర్చిదిద్దడంపైనే ఉండేదని చెప్పారు.
హ్యాట్రిక్ విజయాల తర్వాత జయంత్ తెరకెక్కించిన ‘రావోయి చందమామ’ ఆయన కెరీర్లో మొదటి ఫ్లాప్‌గా నిలిచింది. దీనికి ప్రధాన కారణం స్క్రిప్ట్ లోపమేనని జయంత్ నిజాయితీగా అంగీకరించారు. 1950ల నాటి ఆంగ్ల చిత్రం ‘యాన్ అఫైర్ టు రిమెంబర్’ స్ఫూర్తితో ఈ కథను రాసుకున్నప్పటికీ, స్క్రిప్ట్‌కు పూర్తిస్థాయిలో మెరుగులు దిద్దడానికి తగిన సమయం దొరకలేదని తెలిపారు. విడుదల తేదీ దగ్గరపడటంతో ఆతృతగా పనిచేయాల్సి వచ్చిందని, ఆ సినిమా పరాజయానికి పూర్తి బాధ్యత తనదేనని పేర్కొన్నారు. అంతేకాకుండా, ఈ చిత్రం విడుదలకు సరిగ్గా వారం రోజుల ముందే బాలీవుడ్లో అమీర్ ఖాన్ నటించిన ‘మన్’ సినిమా విడుదలవడం కూడా పెద్ద మైనస్ అయిందని, ఆ సినిమాకు కాపీ అంటూ విమర్శలు రావడం దెబ్బతీసిందని గుర్తు చేసుకున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్‌తో తనకున్న స్నేహం గురించి జయంత్ ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. ఐశ్వర్య మిస్ వరల్డ్ అయినప్పటి నుంచే తనకు పరిచయమని తెలిపారు. వెంకటేష్ హీరోగా తెరకెక్కిన ‘ప్రేమంటే ఇదేరా’ సినిమా కోసం మొదట ఐశ్వర్య రాయ్‌నే సంప్రదించారట. ఆమె కథ విని భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకుని, వెంటనే డేట్స్ ఇస్తానని చెప్పిందని జయంత్ వెల్లడించారు. అయితే, అప్పటికే ఆమె నటించిన రెండు హిందీ చిత్రాలు ఫ్లాప్ కావడంతో ఇండస్ట్రీ వర్గాలు ఆమెను తీసుకోవడానికి కాస్త వెనుకాడాయని, దాంతో ఆ స్థానంలో ప్రీతి జింటాను ఎంపిక చేసినట్లు వివరించారు.
ఆ తర్వాత ‘తాల్’, ‘హమ్ దిల్ దే చుకే సనమ్’ వంటి సినిమాలతో ఐశ్వర్య రాయ్ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు. ఆ సమయంలో జయంత్ తన సినిమాలోని ఒక స్పెషల్ సాంగ్ (ఐటెం సాంగ్) కోసం ప్రీతి జింటాను అడగడానికి ముంబై వెళ్లారట. ఈ విషయం తెలుసుకున్న ఐశ్వర్య రాయ్.. తానే స్వచ్ఛందంగా ఆ పాట చేస్తానని ముందుకు వచ్చిందట. వెంటనే నిర్మాత అశ్వనీదత్ గారికి ఫోన్ చేసి ఐశ్వర్య ఐటెం సాంగ్ చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పగా, ఆయన ఎంతో సంతోషించారని జయంత్ గుర్తు చేసుకున్నారు. తమ స్నేహం ఎన్నో ఏళ్లుగా కొనసాగుతోందని, అయితే ఇద్దరి కెరీర్ మార్గాలు వేరు కావడంతో మళ్లీ కలిసి పనిచేసే అవకాశం రాలేదని జయంత్ సి పరాన్జీ చెప్పుకొచ్చారు.
Aishwarya Rai
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి