Super Subbu Review: ‘సూపర్ సుబ్బు’ వెబ్ సిరీస్ రివ్యూ.. సందీప్ కిషన్ సూపర్ అనిపించాడా లేదా..?

ఇదివరకు ఓటీటీలో కొన్ని వెబ్ సిరీస్‌లలో ప్రధాన పాత్రలు పోషించాడు సందీప్ కిషన్.. కానీ మొదటిసారి ఆయనే హీరోగా వచ్చిన వెబ్ సిరీస్ ‘సూపర్ సుబ్బు’. మల్లిక్ రామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సిరీస్‌లో మురళీ శర్మ, మిథిలా పార్కర్, మానస చౌదరి, గెటప్ శ్రీను తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఓటీటీలో అందుబాటులోకి వచ్చిన ఈ సిరీస్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం..!

Super Subbu Review: సూపర్ సుబ్బు’ వెబ్ సిరీస్ రివ్యూ.. సందీప్ కిషన్ సూపర్ అనిపించాడా లేదా..?
Super Subbu Telugu Web Series Review

Edited By:

Updated on: Jul 04, 2026 | 6:55 AM

వెబ్ సిరీస్ రివ్యూ: సూపర్ సుబ్బు

నటీనటులు: సందీప్ కిషన్, మిథిలా పాల్కర్, మానస చౌదరి, బ్రహ్మానందం, సంపూర్ణేశ్ బాబు, మురళీ శర్మ, జీవన్, గెటప్ శ్రీను, హైపర్ ఆది తదితరులు

సంగీతం: అనుదీప్ దేవ్

సినిమాటోగ్రఫీ: AJ ఆరోన్

ఎడిటింగ్: విప్లవ్ నైషధం

దర్శకుడు: మల్లిక్ రామ్

నిర్మాతలు: రాజీవ్ చిలక, భరత్ లక్ష్మీపతి

కథ:

సుబ్రహ్మణ్యం అలియాస్ సుబ్బు (సందీప్ కిషన్) ఓ సాధారణ యువకుడు. అతని తండ్రి కుక్కుటేశ్వర్ రావు (మురళీ శర్మ) ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు. కొడుకు చేతకానివాడని, ఏ పనీ సరిగ్గా చేయలేడని తండ్రికి ఎప్పుడూ చులకన భావం ఉంటుంది. ఈ క్రమంలోనే సుబ్బుకి దివ్య (మానస చౌదరి)తో వివాహం నిశ్చయం చేస్తాడు తండ్రి. కానీ, ప్రస్తుతం చేస్తున్న తాత్కాలిక ఉద్యోగాన్ని శాశ్వతం (పర్మినెంట్) చేసుకుంటేనే పెళ్లి జరుగుతుందని షరతు పెడతాడు. ఉద్యోగం పర్మినెంట్ కావాలంటే, ప్రిన్సిపాల్ మధుసూధన్ (బ్రహ్మానందం) చెప్పినట్లుగా ‘మాకీపూర్’ అనే మారుమూల గ్రామానికి సెక్స్ ఎడ్యుకేషన్ ఆఫీసర్‌గా వెళ్లాల్సి వస్తుంది. అసలు ఎలాంటి ప్రాథమిక అవగాహన లేని ఆ అమాయకపు ఊరిలో సుబ్బు అడుగుపెట్టాక ఏం జరిగింది? అక్కడ శారీరక సంబంధాలు, కుటుంబ నియంత్రణపై ప్రజలకు ఎలా అవగాహన కల్పించాడు? ఆ ప్రయాణంలో యూ ట్యూబర్ స్వాతి (మిథిలా పార్కర్) పరిచయం అతని జీవితాన్ని ఎలా మార్చింది? చివరికి సాధారణ సుబ్బు, ‘సూపర్ సుబ్బు’గా ఎలా మారాడు అనేది ఈ సిరీస్ ప్రధాన కథాంశం.

కథనం:

మన సమాజంలో ‘సెక్స్ ఎడ్యుకేషన్’ అనే పదం పలకడానికి కూడా ఆలోచిస్తారు.. మాట్లాడినా వింతగా చూస్తుంటారు. అలాంటిది అదే టాపిక్‌తో సిరీస్ చేయడం అంటే మాటలు కాదు.. అది కూడా చిన్న బూతు కూడా లేకుండా కుటుంబం అంతా కలిసి కూర్చుని చూసేలా తీయడం అంటే కత్తి మీద సామే. అది చేసి చూపించారు మల్లిక్ రామ్. నగరాల్లో సెక్స్ ఎడ్యూకేషన్ మీద కొంతవరకు అవగాహన ఉన్నప్పటికీ, పల్లెటూళ్లలో మాత్రం ఇది ఇప్పటికీ ఒక బూతులాగే చూస్తారు. ఇలాంటి సున్నితమైన పాయింట్‌ను ఎంచుకున్న దర్శకుడు మల్లిక్ రామ్, దాన్ని ఎక్కడా అసభ్యతకు చోటు లేకుండా చాలా హుందాగా తెరపైకి తీసుకురావడంలో విజయం సాధించారు. ఓ మారుమూల గ్రామానికి వెళ్లిన అధికారికి ఎదురయ్యే సవాళ్లను, అక్కడి ప్రజల అమాయకత్వాన్ని వినోదాత్మకంగా చూపించారు. ముఖ్యంగా కష్టమైన శాస్త్రీయ విషయాలను సైతం పామరులకు అర్థమయ్యేలా చెప్పిన తీరు ఆకట్టుకుంటుంది. ఉదాహరణకు, మగ పిల్లాడు పుట్టాలనే కోరికతో మహిళలు పడే ఇబ్బందులను గమనించిన హీరో.. వారికి క్రోమోజోముల గురించి సైన్స్ క్లాస్ పీకకుండా, రెండు పూల కుండీల ఉదాహరణతో అద్భుతంగా వివరిస్తాడు.
“కుండీల్లోని మట్టి ఒకటే అయినప్పటికీ, మనం నాటే విత్తనాన్ని బట్టే మొక్క వస్తుంది కదా.. అలాంటప్పుడు పిల్లల లింగ నిర్ధారణలో స్త్రీల తప్పు ఏముంటుంది?” అని వివరించిన తీరు ఆలోచింపజేస్తుంది. ఇలాంటి అర్థవంతమైన సన్నివేశాలు సిరీస్‌కు ప్రధాన బలం. అయితే, కథనంలో కొన్ని లోపాలు కూడా స్పష్టంగా కనిపిస్తాయి. కొన్ని సన్నివేశాలు లాజిక్‌కు దూరంగా అనిపిస్తాయి. అలాగే, కథను అనవసరంగా సాగదీసిన భావన కలుగుతుంది. పాత్రల మధ్య ఉండాల్సిన భావోద్వేగ బంధం బలహీనంగా ఉండటంతో, ప్రేక్షకులు కథలో పూర్తిగా లీనం కాలేరు. అయినప్పటికీ, మధ్యమధ్యలో వచ్చే హాస్య సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ, ఆ సాగదీతను కొంతవరకు కవర్ చేస్తాయి. ఒక అడల్ట్ పాయింట్‌ను కుటుంబమంతా కలిసి చూసేలా క్లీన్ కామెడీతో నడపడం దర్శకుడి ప్రతిభకు అద్దం పడుతుంది. మురళీ శర్మ, సందీప్ కిషన్ మధ్య సన్నివేశాలు బాగానే ఉంటాయి కానీ చాలా తక్కువకే పరిమితం చేసారు. మరోవైపు మానస చౌదరితో సీన్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి.

నటీనటులు:

సందీప్ కిషన్ తన అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో సిరీస్‌ను నడిపించాడు. సున్నితమైన పాత్ర అయినప్పటికీ ఎక్కడా పరిధి దాటకుండా చాలా సహజంగా నటించాడు. కథానాయికగా మిథిలా పార్కర్ తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. మానస చౌదరి పాత్ర బాగున్నప్పటికీ, ఆమెకు నిడివి తక్కువగా లభించింది. ఇక తండ్రిగా మురళీ శర్మ, హాస్యనటులు గెటప్ శ్రీను, సంపూర్ణేశ్ బాబు తమ నటనతో చాలా చోట్ల నవ్వులు పూయించారు. గ్రామంలో కనిపించే రమేష్ బాబుగా జీవన్, రజినీ పాత్ర చేసిన నటితో పాటు ఇతర సహాయ నటులంతా తమ పరిధి మేరకు చక్కగా నటించి మెప్పించారు.

టెక్నికల్ టీం:

సంగీతం విషయానికి వస్తే పాటలు పర్లేదు.. ఆర్ఆర్ బాగుంటుంది.. ఓటీటీ ప్లాట్‌ఫారమ్ కాబట్టి వాటిని స్కిప్ చేసే అవకాశం ఉంటుంది. అరోన్ సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. పల్లెటూరి వాతావరణాన్ని, అక్కడి అందాలను చాలా సహజంగా కెమెరాలో బంధించారు. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా ఉన్నతంగా ఉన్నాయి. మాటలు రాసిన తీరు బాగుంది.. సెక్స్ ఎడ్యూకేషన్‌ అయినా కూడా ఎక్కడా ఇబ్బందికర పదాలు పడకుండా చూసుకున్నారు. క్లిష్టమైన విషయాలను కూడా సులభంగా అర్థమయ్యేలా డైలాగ్స్ రాశారు. అయితే మొదటి సీజన్ ముగింపులో తండ్రీకొడుకుల మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశాలు ఇంకా బలంగా ఉంటే బాగుండేది. అక్కడ కాస్త నిరాశ ఎదురవుతుంది. మిగిలింది అంతా ఓకే..

పంచ్ లైన్:

ఓవరాల్‌గా ‘సూపర్ సుబ్బు’.. బోల్డ్ టాపిక్.. నీట్ ఎగ్జిగ్యూషన్.. ప్రశాంతంగా నవ్వుకోవడానికి వీకెండ్ ఛాయిస్..!

Follow Us