
బుల్లితెరపై ప్రసారమయ్యే ప్రముఖ కామెడీ షో ‘జబర్దస్త్’ ఎంతో మందికి లైఫ్ ఇచ్చిన వేదికగా నిలిచింది. ఈ షో ద్వారా కమెడియన్లుగా గుర్తింపు తెచ్చుకున్న వారు ప్రస్తుతం వెండితెరపై కూడా రాణిస్తున్నారు. ఒకప్పుడు కేవలం అబ్బాయిలే లేడీ గెటప్స్ వేసి అలరించిన ఈ వేదికపై, ఇప్పుడు అమ్మాయిలు కూడా తమ కామెడీ టైమింగ్‌తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటున్నారు. అలా జబర్దస్త్ ద్వారా మంచి పాపులారిటీ తెచ్చుకున్న నటి శ్రీవిద్య తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన జీవిత ప్రయాణం గురించి సంచలన విషయాలు వెల్లడించారు. బి టెక్ పూర్తి చేసిన శ్రీవిద్య సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె చేసిన వీడియోలను చూసిన మేకర్స్ జబర్దస్త్ షోలో అవకాశం ఇవ్వడంతో ఆమె ఒక్కసారిగా హైదరాబాద్‌కు ప్రయాణమయ్యారు. అయితే ఇంట్లో కేవలం రెండు వేల రూపాయలు మాత్రమే తీసుకుని, అర్ధరాత్రి ట్రైన్ ఎక్కి హైదరాబాద్‌కు వచ్చానని ఆమె గుర్తుచేసుకున్నారు. ప్రయాణంలో అందులో ఐదు వందల రూపాయలు పోగొట్టుకున్నానని, అప్పుడు తనకు నగరంలో ఎవరూ పరిచయం లేకపోయినా ఎన్నో ఇబ్బందులు పడి ఈ స్థాయికి వచ్చానని ఆమె తెలిపారు.
శ్రీవిద్య హైదరాబాద్‌లో ఉండటం ఊర్లో చాలామందికి నచ్చలేదు. ఆమె తల్లిని రకరకాలుగా బాధపెట్టారని శ్రీవిద్య గుర్తు చేసుకున్నారు. తండ్రి లేని పిల్లను హైదరాబాద్‌లో ఉంచారని, ఆమె అక్కడ ఏం చేస్తోందో, ఎక్కడ తిరుగుతోందో ఎవరికి తెలుసని మాట్లాడుతూ తల్లిని ఇబ్బంది పెట్టారని ఆమె వెల్లడించారు. అమ్మ ఒంటరిగా ఇబ్బంది పడుతున్న సమయంలో తాను ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ఎంతో కష్టపడ్డానని చెప్పారు.
ఇటీవల శ్రీవిద్య ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ వెబ్ సిరీస్‌లో నటించారు. హర్ష చెముడు ప్రధాన పాత్రలో వచ్చిన ఈ కామెడీ సిరీస్ అక్టోబర్ 9న ఈటీవీ విన్లో విడుదలైంది. ఆరు ఎపిసోడ్లు ఉన్న ఈ సిరీస్‌కు బాబు దర్శకత్వం వహించారు. ఇది ఆ తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లోనూ అందుబాటులోకి వచ్చింది. డేటా ప్రకారం, అక్టోబర్ 17 నుంచి 23 మధ్య ఏడు రోజుల్లో ఈ సిరీస్‌ను 8.10 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.