
దేవీ శ్రీ ప్రసాద్ అలియాస్ డీఎస్పీ అలియాస్ రాక్‌స్టార్.. ఈ పేరుకు మూవీ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉంది. ఏదైనా మూవీ పోస్టర్‌పై ఆయన పేరు ఉందంటే చాలు.. సినిమా సగం హిట్టు అని చాలామంది అభిప్రాయపడుతుంటారు. ఏ హీరోతో పనిచేసినా.. వారికి గుర్తుండిపోయే ఆల్బమ్‌ను ఇస్తుంటారు డీఎస్పీ. ఇది పక్కన పెడితే ఆయన కంపోజ్ చేసిన పాటలు ఇప్పుడు అంతర్జాతీయంగానూ గుర్తింపును సాధిస్తున్నాయి. ముఖ్యంగా డ్యాన్స్ షోలతో పాటు క్రికెట్ వేడుకల్లోనూ దేవీ పాటలు వినిపిస్తున్నాయి. ఆయన బీట్లు అక్కడ కూడా చాలామంది చేత స్టెప్పులు వేయిస్తున్నాయి. తాజాగా మెల్బోర్న్లో జరిగిన మహిళల టీ 20 వేడుకల్లో దేవీ కంపోజ్ చేసిన పక్కా లోకల్ సాంగ్‌ను ప్లే చేశారు. దానికి సంబంధించిన వీడియోను దేవీ తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. అందరికీ థ్యాంక్స్ చెప్పారు. అయితే ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ సినిమా కోసం రాక్‌స్టార్ ఈ పాటను కంపోజ్ చేయగా.. ఆ సినిమా విడుదల సమయంలోనూ ఇది పెద్ద హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే.
కాగా అంతర్జాతీయంగా రాక్‌స్టార్ పాటలకు క్రేజ్ రావడం ఇది తొలిసారేం కాదు. ఖైదీ నంబర్.150లోని సుందరి సుందరి, సర్ధార్ గబ్బర్ సింగ్‌లోని వాడెవడన్న.. వీడెవడన్న సర్దార్ అన్నకి సాటెవరన్నా పాటలు పలు అంతర్జాతీయంగా పలు డ్యాన్స్ షోల్లో వినిపించాయి. అలాగే అమెరికాలో జరిగిన హౌడీ మోడీ కార్యక్రమంలోనూ పక్కా లోకల్ సాంగ్‌కు అక్కడి వారు డ్యాన్స్ వేశారు. అంతేకాదు ఆర్య 2లోని రింగ రింగ సాంగ్‌కు షారూక్‌తో పాటు పలువురు క్రికెటర్లు డ్యాన్స్ వేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరుతో మొదటి హిట్‌ను ఖాతాలో వేసుకున్న దేవీ శ్రీ ప్రసాద్., ప్రస్తుతం ఉప్పెన, రంగ్‌దే, గుడ్‌లక్ సఖి, ఏఏ 20, బెల్లంకొండ శ్రీనివాస్ చిత్రాలకు సంగీతాన్ని అందిస్తున్నారు. అలాగే పవన్ కల్యాణ్ హీరోగా హరీష్ శంకర్ తెరకెక్కించబోతున్న PSPK 28 చిత్రానికి సంగీత దర్శకుడిగా రాక్‌స్టార్ ఖరారు అయినట్లు తెలుస్తోంది.
Read This Story Also: AA20:సేతుపతి కీ రోల్.. విలన్లుగా ఇద్దరు స్టార్లు.. ఎవరో తెలుసా..?