
తెలుగు సినిమా చరిత్రలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న అమ్మోరు చిత్రం కేవలం ఒక సినిమా కాదు, అది దర్శకుడు కోడి రామకృష్ణ అకుంఠిత దీక్షకు, నమ్మకానికి ప్రతీక. గతంలో దివంగత డైరెక్టర్ కోడి రామకృష్ణ ఈ సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ బ్లాక్‌బస్టర్ సినిమా నిర్మాణానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన, సవాలుతో కూడిన వివరాలను పంచుకున్నారు. అమ్మోరు ప్రారంభానికి ముందు, కోడి రామకృష్ణ శ్యామ్ గారికి ఒక దెయ్యం కథ చెప్పాలని సంప్రదించారు. అయితే, శ్యామ్ గారు మొదట దెయ్యం కథల పట్ల ఆసక్తి చూపలేదు. కానీ, కోడి రామకృష్ణ మాటల్లోని నమ్మకం, కథ పట్ల ఆయనకున్న అవగాహన శ్యామ్ గారిని ఆలోచింపజేసింది. పది నిమిషాల తర్వాత శ్యామ్ గారే తిరిగి ఫోన్ చేసి కథ ఎంత భయంకరంగా ఉంటుందని అడిగారు. అప్పుడు కోడి రామకృష్ణ, “శ్యామ్ గారూ, మీరు ఊహించలేనంత భయంకరంగా ఉంటుంది. మీ అంకుశం సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో, ఇది అంతకు మించిన హిట్ అవుతుంది” అని పూర్తి నమ్మకంతో చెప్పారు. కోడి రామకృష్ణ మాటల్లోని ఆత్మవిశ్వాసం శ్యామ్ గారికి నచ్చింది, వెంటనే కథ వినడానికి అంగీకరించారు. కథ విన్న తర్వాత శ్యామ్ గారికి బాగా నచ్చినా, క్లైమాక్స్ లో కొన్ని మార్పులు సూచించారు. ఆ మార్పులు చేసిన తర్వాతే సినిమా నిర్మాణం మొదలైంది.
అమ్మోరు సినిమా విజయానికి మేకప్ ఎంతో కీలకమని కోడి రామకృష్ణ అన్నారు. అమ్మోరు పాత్రకు ఒక ప్రత్యేకమైన, సహజమైన రూపాన్ని ఇవ్వడానికి ఆయన చాలా రీసెర్చ్ చేశారు. చివరికి, పల్లెటూరి అమ్మాయి పసుపు రాసుకున్నట్టు ఉండేలా ఆ పాత్రకు మేకప్ డిజైన్ చేశారు. ఈ మేకప్ వేయడానికి రమ్యకృష్ణకు ప్రతిరోజూ రెండు నుంచి మూడు గంటల సమయం పట్టేదని, ఆ ప్రక్రియ చాలా అలసటతో కూడుకున్నదని ఆయన గుర్తు చేసుకున్నారు. అయితే, సినిమా అవుట్‌పుట్ అద్భుతంగా రావాలనే తపనతో రమ్యకృష్ణ ఎంతో ఓపికగా, సహనంతో ఆ కష్టాన్ని భరించిందని దర్శకుడు అన్నారు.
మేకప్ తో పాటు, సినిమాలోని గ్రాఫిక్స్ కూడా అప్పటి టెక్నాలజీకి ఒక సవాలుగా నిలిచాయి. ముఖ్యంగా క్లైమాక్స్ లో అమ్మోరు నీళ్లలో నుంచి పైకి లేచే షాట్ కోసం చిత్ర బృందం చాలా శ్రమించింది. ఆ రోజుల్లో ఇప్పుడున్నంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేకపోవడంతో, ఆ ఎఫెక్ట్ ను సాధించడానికి అసాధారణమైన కృషి చేయాల్సి వచ్చింది. చెరువులో నుంచి చేయి పైకి వచ్చే సీన్ తీయడానికి ఏకంగా 40 రోజులు పట్టిందని వెల్లడించారు. ఆ సన్నివేశాన్ని కేవలం రాత్రి సమయాల్లోనే చిత్రీకరించాల్సి వచ్చిందని, దాని కోసం చెరువు లోపల (అండర్ వాటర్‌లో) ప్రత్యేకంగా 79 వాటర్ ప్రూఫ్ లైట్లను అమర్చి షూటింగ్ చేశామని వివరించారు. నిర్మాత ఎంతో స్పోర్టివ్‌గా సహకరించడం, టీమ్ వర్క్ వల్లే ఆ అద్భుతాన్ని తెరపైకి తీసుకురాగలిగామని గుర్తుచేసుకున్నారు. అయినప్పటికీ, చిత్ర బృందం పట్టుదలతో పని చేసి ఆ విజువల్స్ ను అద్భుతంగా తెరకెక్కించగలిగింది.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : 1965లోనే లక్షలతో తీసిన బాలనాగమ్మ సినిమా.. షూటింగ్ పూర్తైన ఎందుకు రిలీజ్ కాలేదంటే..
ఎక్కువ మంది చదివినవి : Cinema : మెంటలెక్కించే ట్విస్టులు.. క్లైమాక్స్ చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.. ఓటీటీని షేక్ చేస్తున్న 7 ఎపిసోడ్స్..