
షార్ట్ ఫిల్మ్స్ నుంచి హీరోగా మారి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు మౌళి. ఇప్పుడు దొంగ నా కొడుకు అనే సినిమాతో మరోసారి అడియన్స్ ముందుకు రాబోతున్నాడు. తాజాగా ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ సినీ అభిమానులను ఆకట్టుకుంది. ఈ వేడుకలో సీనియర్ నటి రజిత భావోద్వేగ ప్రసంగం అందరి దృష్టిని ఆకర్షించింది. సినిమా ఇండస్ట్రీలో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న తాను, ఒక మంచి పాత్ర కోసం ఎదురుచూస్తున్న తరుణంలో దొంగ నా కొడుకు అవకాశం వచ్చిందని ఆమె తెలిపారు. “ఎన్నో మంచి హిట్ సినిమాలు చేశాను. పెద్ద పెద్ద హీరోలతో నటించాను. ఈ మధ్యకాలంలో ఒక మంచి క్యారెక్టర్ పడట్లేదే, నన్ను మర్చిపోతున్నారేమోనని బాధపడే సమయంలో నాకు ఈ ఆఫర్ వచ్చింది” అని రజిత చెప్పుకొచ్చారు. ఆఫర్ వచ్చిన తొలుత దానిని నమ్మలేదని, ఫేక్ కాల్ అనుకున్నానని రజిత అన్నారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్కు చెందిన నిఖిల్ కాల్ చేసినప్పుడు, “నేను కాదులే” అనుకొని ఫోన్ పెట్టేసి, నటుడు అలీకి ఫోన్ చేసి అడిగితే, “అవును రజిత, స్టోరీ చాలా బాగుంది, ఇది నిజమే” అని అలీ చెప్పడంతోనే ఆఫర్‌ను స్వీకరించినట్లు ఆమె వివరించారు. ఈ సంవత్సరం తనకు వచ్చిన మొదటి ఆఫర్ ఇదేనని, ఇది తన కెరీర్‌కు మంచి కమ్‌బ్యాక్ అవుతుందని, ప్రేక్షకుల ఆశీస్సులు కావాలని రజిత మనస్ఫూర్తిగా కోరుకున్నారు.
ఈ సినిమాలో తనకు అవకాశం కల్పించిన మౌళికి, దర్శకుడు శ్రీను కంబాల గారికి, మైత్రి మూవీ మేకర్స్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. మౌళికి తనకంటూ ఒక మంచి ఫ్యాన్ బేస్ ఉందని, దొంగ నా కొడుకు టైటిల్ వినగానే అందరి మొహంలో ఒక చిరునవ్వు వస్తుందని రజిత అన్నారు. ఈ సినిమా మౌళికి కూడా సూపర్ హిట్ కావాలని ఆమె ఆకాంక్షించారు. అలీతో కలిసి ఎన్నో సినిమాలు చేశామని, మళ్లీ చాలా రోజుల తర్వాత ఈ సినిమాలో పూర్తిస్థాయి పాత్రలు చేయడం చాలా ఆనందంగా ఉందని రజిత పేర్కొన్నారు. తనతో పాటు నటించిన బబ్లు సెట్లో చాలా హిలేరియస్‌గా ఎంటర్టైన్ చేశాడని, ప్రేక్షకులు సినిమా మొత్తం నవ్వుతూనే ఉంటారని ఆమె చెప్పారు.
అలాగే అవకాశాల గురించి స్పందిస్తూ.. తమను రెగ్యులర్ అంటూ పక్కన పెట్టేస్తున్నారని.. కానీ సీనియర్ మేల్ ఆర్టిస్టులకు మాత్రం వరుస అవకాశాలు వస్తున్నాయని అన్నారు. అదే వయసుకున్న నటీమణులను మాత్రం రెగ్యులర్ గా కనిపించే ముఖాలంటూ పక్కన పెడుతున్నారని అన్నారు. హీరోయిన్ పాత్రలు కాదు.. కనీసం బీ కేటగిరీ పాత్రలైనా మేము చేస్తాం కదా.. ఆ అవకాశాలైనా కల్పించండి.. ఇది రిక్వెస్ట్ మాత్రమే అని అన్నారు. రజిత చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.