కేరళ ఎన్నికల్లో టికెట్ లభించని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు లతికా సుభాష్ తాను ఇండిపెండెంటుగా పోటీ చేస్తానని ప్రకటించారు. పార్టీ తనకు టికెట్ ఇవ్వనందుకు నిరసనగా ఆమె ఇటీవల తిరువనంతపురంలోని పార్టీ కార్యాలయం ముందు శిరోముండనం చేయించుకున్నారు. పార్టీకి కూడా రాజీనామా చేశానని ఆమె అన్నారు. ఎట్టుమన్నూర్ నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేయగోరుతున్నారు. తను ఏ పార్టీలోనూ చేరడం లేదని చెప్పిన ఆమె.. కాంగ్రెస్ పార్టీ 86 మంది అభ్యర్థుల పేర్లతో జాబితా విడుదల చేసిందని, కానీ అందులో తొమ్మిది మంది మహిళలు మాత్రమే ఉన్నారని అన్నారు. కనీసం ఒక్కో నియోజకవర్గం నుంచి ఒక్కో మహిళకు టికెట్ ఇఛ్చినా సరిపోయేదని లతికా సుభాష్ వ్యాఖ్యానించారు. పార్టీ కోసం పని చేసి, శ్రమించిన మహిళలకు మొండి చెయ్యి చూపారని ఆమె ఆరోపించారు. పూర్తిగా వారిని నిర్లక్ష్యం చేశారని దుయ్యబట్టారు.
తనలాగే పలువురు మహిళా కార్యకర్తలకు అన్యాయం జరిగిందని లతికా సుభాష్ విచారం వ్యక్తం చేశారు. కేరళ ఎన్నికలు ఏప్రిల్ 6 న జరగనున్నాయి. మే 2 న ఫలితాలను ప్రకటిస్తారు. ఇలా ఉండగా.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రస్తుతం కేరళ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. మంగళవారం కొట్టాయం లో జరిగిన ర్యాలీలో ప్రసంగించిన అయన..తమ పార్టీ అధికారంలోకి వస్తే న్యాయ్ పథకాన్ని అమలు చేసి తీరుతామని హామీ ఇచ్చారు. ఈ పథకం కింద ప్రతి వారికీ ఏడాదికి వారి బ్యాంకు ఖాతాల్లో 72 వేలు జమ అవుతాయని, ఇది వారి అభివృధ్దికి దోహద పడుతుందని ఆయన అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ ప్రజలకు చేసిందేమీ లేదని, ఈ సర్కార్ రైతులు, కార్మికులు, ఇతర అన్ని వర్గాల విశ్వాసాన్ని కోల్పోయిందని ఆయన విమర్శించారు.
మరిన్ని చదవండి ఇక్కడ :సూపర్ మార్కెట్ లో చిలిపిదొంగ..పట్టపగలు అందరూ చూస్తుండగానే దొంగతనం..వైరల్ అవుతున్న వీడియో..:Bird thief video.