హర్యానా ఎన్నికల ప్రచారంలో వాడిన అస్త్రాలనే మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ ప్రయోగిస్తోంది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో గ్యారంటీలు అమలు కావడం లేదని ప్రతి చోట ప్రచారం చేస్తున్నారు. అయితే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు కౌంటరిస్తున్నారు.
మహారాష్ట్రలో కాంగ్రెస్‌ని గెలిపిస్తే మరో తెలంగాణలా అవుతుందని బీజేపీ అంటుంటే.. మహారాష్ట్ర తెలంగాణ అయితే మంచిదే అంటోంది కాంగ్రెస్. ఎన్నికల ప్రచారంలో గ్యారంటీలపై కాంగ్రెస్ , బీజేపీ నేతల మధ్య డైలాగ్‌వార్ నడుస్తోంది. ఆరు గ్యారంటీల అమలుపై సాక్షాత్తూ భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి. ముంబైలో కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, హిమాచల్ సీఎం సుఖ్వింద్‌రు సుక్కుతో కలిసి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు అమలు చేస్తున్న గ్యారంటీలపై వివరణ ఇచ్చారు. రైతులను మోదీ అదానీ, అంబానీకి అప్పగించే కుట్ర చేస్తే తాము రుణమాఫీతో అన్నదాతలు ఆదుకుంటున్నామని అన్నారు.
మహారాష్ట్ర ఎన్నికల కోసం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల నుంచి వేల కోట్ల తరలిస్తున్నారని ఆరోపించారు. మహారాష్ట్రలో ఇలాంటి పరిస్థితి రాకుండా చూస్తానని అన్నారు. కర్నాటక నుంచే మహారాష్ట్ర ఎన్నికల కోసం రూ.700 కోట్లు తరలించారని ఆరోపించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ ఇదే ఫార్మూలాను వాడింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణ , కర్నాటక , హిమాచల్‌ప్రదేశ్‌లో ఎక్కడ కూడా ఎన్నికల హామీలు అమలు కావడం లేదని ప్రధాని మోదీతో సహా బీజేపీ నేతలంతా ప్రచారం చేశారు. మహారాష్ట్రలో కూడా ప్రతిసభలో ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. హర్యానాలో మాదిరి కాకుండా ముల్లును ముల్లు తోనే తీయాలన్న ఆలోచనతో కాంగ్రెస్ ఎదురుదాడి ప్రారంభించింది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలతో మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో గ్యారంటీలపై వివరణ ఇస్తున్నారు. అందుకే తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి , హిమాచల్ సీఎం సుక్కు , కర్నాటక డిప్యూటీ సీఎం శివకుమార్ ముంబైలో ప్రచారం చేశారు.
అయితే కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలను నాందేడ్ సభలో మరోసారి తీవ్రంగా ఖండించారు మోదీ.. రైతుల ఆదాయాన్ని తమ ప్రభుత్వం రెట్టింపు చేసిందన్నారు. ఆర్టికల్ 370ని పునరిద్దరిస్తామని ఇండియా కూటమి దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందన్నారు. దేశానికి పదేళ్లుగా ఓబీసీ ప్రధానిని చూసి కాంగ్రెస్ ఓర్వడం లేదన్నారు. ఓబీసీల్లో చీలిక తెచ్చేందుకు కాంగ్రెస్ కుట్ర చేసిందన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..