మరాఠీ గడ్డపై తెలుగు నేతల హవా.. ప్రచారంలో దూసుకుపోతున్న ఏపీ, తెలంగాణ పొలిటికల్‌ స్టార్స్

|

Nov 16, 2024 | 7:51 AM

తెలుగు ఓటుబ్యాంకుల్ని కొల్లగొట్టడానికి మరాఠీ పార్టీలు పోటీపడుతున్నాయి. తెలుగు పొలిటికల్ ఐకాన్లకు ప్రత్యేకంగా షెడ్యూలిచ్చి మరీ ప్రచారాలు చేయించుకుంటున్నారు.

మరాఠీ గడ్డపై తెలుగు నేతల హవా.. ప్రచారంలో దూసుకుపోతున్న ఏపీ, తెలంగాణ పొలిటికల్‌ స్టార్స్
Chandrababu Revanth Reddy
Follow us on

లాస్ట్‌ పంచ్‌ మనదైతే ఆ కిక్కే వేరప్పా..! అన్నట్టుంది మహారాష్ట్ర ఎన్నికల సంగ్రామంలో మనోళ్ల తీరు. మరాఠీ గడ్డపై ఆఖరిపోరాటంలో తెలుగునేతలే హవా చాటుతున్నారు. ఏపీ, తెలంగాణ పొలిటికల్‌ స్టార్స్ అందరూ బార్డర్లు దాటి.. మహారాష్ట్రలో గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారు. స్టార్ క్యాంపెయినర్లుగా తెలుగోళ్లే ఎందుకు..? ఫినిషింగ్ టచ్ మనోళ్లతోనే ఎందుకు ఇప్పిస్తున్నట్టు? తెలుగు-మరాఠీ.. ఈ పొలిటికల్ లంకె ఎలా కుదిరినట్టు? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే!

రెండు కూటములు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మహారాష్ట్ర ఎన్నికలు.. ప్రీక్లైమాక్స్‌కు చేరుకున్నాయి. 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో.. నవంబర్‌ 20న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఇంట్రస్టింగ్ పాయింట్ ఏంటంటే.. మహా సంగ్రామం ఆఖరిఘట్టంలో తెలుగు నేతల ఉనికే ఎక్కువగా ఉంది. అటు ఎన్‌డీఏ.. ఇటు ఇండీ కూటమి పెద్దలు పనిగట్టుకుని చిట్టచివరి అస్త్రంగా తెలుగువాళ్లు ఎక్కువగా ఉండే ప్రాంతాల మీద ఫోకస్ పెట్టారు.

ఏపీ, తెలంగాణ నుంచి బడా నేతలను రంగంలోకి దింపుతున్నారు. ఇప్పటికే మహా వికాస్‌ అఘాడి తరపున తొలి విడత ప్రచారం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. నేడు మరోసారి మహా ప్రచార బరిలోకి దిగుతున్నారు. ఈ రోజు చంద్రాపూర్‌, రాజురా, డిగ్రాస్, వార్దా​నియోజకవర్గాల్లో జరిగే ప్రచార సభల్లో పాల్గొంటారు రేవంత్‌రెడ్డి. రేపు ఉదయం నయగావ్, భోకర్, షోలాపూర్​ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు.

తెలంగాణ మంత్రులు సైతం కొన్ని నియోజకవర్గాలకు ఇన్‌చార్జిలు ఉంటూ మహారాష్ట్రలో చురుగ్గా తిరుగుతున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే మహారాష్ట్రలో మకాం వేశారు. పొంగులేటి శ్రీనవాసరెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, సీతక్క కూడా నేటినుంచి మహా వికాస్‌ అఘాడి అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహిస్తారు. ఇటు మహాయుతి కూటమి తరుఫున తెలంగాణ బీజేపీ నేతలు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. తెలంగాణలో ఆరుగ్యారంటీలు, కులగణన విషయంలో కాంగ్రెస్ పార్టీ అట్టర్‌ఫ్లాప్ అంటూ విమర్శలతో హస్తం పార్టీని టార్గెట్‌ చేస్తున్నారు.

బీజేపీ లీడ్ చేస్తున్న మహా యుతి కూటమి తరఫున ఏపీ నుంచి ఐకానిక్ లీడర్లు ప్రచార బరిలోకి దిగుతున్నారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు..ఈ సాయంత్రం ముంబై చేరుకుంటారు. రెండురోజుల పాటు ఎన్‌డీఏ తరఫున చంద్రబాబు ప్రచారం చేస్తారు. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో పాల్గొంటారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కూడా నేడు మహారాష్ట్రకు వెళ్తున్నారు. రెండు రోజుల పాటు ఐదు సభలు, రెండు రోడ్‌ షోలలో పాల్గొంటారు పవన్‌కల్యాణ్. మరట్వాడా, విదర్భ, పశ్చిమ మహారాష్ట్రలో ప్రచారం చేసేలా పవన్ షెడ్యూల్ ఖరారైంది.

పవన్‌ తుపాన్ లాంటివాడంటూ గతంలో మోదీ ఓపెన్ స్టేట్‌మెంట్ ఇవ్వడం..సనాతన ధర్మ పరిరక్షణ పేరుతో పవన్ పేల్చిన డైలాగులు మహారాష్ట్రలో పవన్‌కి పాపులారిటీ పెంచేశాయని జనసేన చెప్పుకుంటోంది. పవన్‌ని తిరుగులేని మాస్ లీడర్‌గా, చంద్రబాబును సీనియర్ మోస్ట్ లీడర్‌గా ప్రజంట్ చేస్తూ.. తమ స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాలో చేర్చుకుంది ఎన్‌డీఏ. ఇప్పుడు వీళ్లిద్దరి పాపులారిటీ మీద మరాఠీ గడ్డపై మహా యుతి కూటమి నేతలు ఆశలు పెట్టుకున్నారు.

మరాఠీ గడ్డపై దాదాపు 14 లక్షల మంది తెలుగువాళ్లున్నారని ఒక అంచనా ఉంది. పైగా.. మహారాష్ట్రలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, వలసల కార్మికుల్లో ఎక్కువమంది తెలుగువారే. ముఖ్యంగా పూణే, ముంబై సహా మరికొన్ని పట్టణాల్లో తెలుగువారి సంఖ్య గట్టిగానే ఉంది. షిరిడీలో స్థిరపడ్డవారిలో తెలుగు మూలాలున్నవాళ్లు ఎక్కువ. తెలంగాణకు పొరుగు రాష్ట్రం కావడం.. గతంలో హైదరాబాద్‌లో అంతర్భాగంగా ఉన్న ప్రాంతం కావడం.. టాలీవుడ్‌కి, బాలీవుడ్‌కీ దగ్గరి అనుబంధం కలిగి ఉండడం.. తెలుగు, మరాఠీ సంస్కృతుల్లో పోలిక ఉండడం.. ఇవన్నీ మహారాష్ట్ర ఎన్నికల్లో తెలుగు ప్రభావాన్ని పెంచే అంశాలే.

అందుకే.. అక్కడి తెలుగు ఓటుబ్యాంకుల్ని కొల్లగొట్టడానికి మరాఠీ పార్టీలు పోటీపడుతున్నాయి. తెలుగు పొలిటికల్ ఐకాన్లకు ప్రత్యేకంగా షెడ్యూలిచ్చి మరీ ప్రచారాలు చేయించుకుంటున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..